కుండపోత

17 Sep, 2019 13:02 IST|Sakshi

పొంచిఉన్న వరద ముప్పు

జిల్లాలోని 9 మండలాల్లో    భారీ వర్షాలు

రాజుపాలెంలో 152, దువ్వూరులో 121 మి.మీ వర్షపాతం నమోదు

ఖరీఫ్‌ చివర్లో జోరు వాన పొంగిపొర్లిన వాగులు, వంకలు

కడప అగ్రికల్చర్‌ : జిల్లాలో ఆదివారం అర్ధరాత్రి నుంచి సోమవారం తెల్లవారుజాము వరకు భారీ వర్షం కురిసింది. కొన్ని మండలాల్లో కుండపోత వాన కురిసింది. ముఖ్యంగా రాజుపాళెం మండలంలో 152 మిల్లీమీటర్లు.. దువ్వూరు మండలంలో 121 మి.మీ. వర్షపాతం నమోదైంది. ఈ మండలాల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా కుంభవృష్టి కురవడం విశేషం.  ఆదివారం రాత్రి ఆకాశం మేఘావృతమై ఒక్కసారిగా నెలలో కురవాల్సిన వర్షమంతా ఒక్క రోజులోనే కుమ్మరించింది.జిల్లాలోని రాజుపాలెం, దువ్వూరు, ప్రొద్దుటూరు, సింహాద్రిపురం, ఎర్రగుంట్ల, చాపాడు, తొండూరు, కొండాపురం, జమ్మలమడుగు మండలాల్లో కుండపోత వాన కురిసింది. వాననీటితో జిల్లాలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి.

జిల్లా అంతటా వర్షం
జిల్లాలో ఆదివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు సరాసరి 38.0 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. కడప 22.2 మి.మీ, వల్లూరు 18.4, పెనగలూరు 32.4, చింతకొమ్మదిన్నె 22.4, ఖాజీపేట 26.2, కమలాపురం 25.0, ఎర్రగుంట్ల 78.2, వీరపునాయునిపల్లె 26.8, రాయచోటి 50.6, చిన్నమండెం 36.0, సంబేపల్లె 48.2, వీరబల్లి 12.0, టి.సుండుపల్లె 36.8, లక్కిరెడ్డిపల్లె 25.2, రామాపురం 15.2, గాలివీడు 36.2, రాజంపేట 6.8, నందలూరు 2.8, పెనగలూరు 24.0, రైల్వేకోడూరు 49.6, ఓబుళవారిపల్లె 18.6, పుల్లంపేట 9.2, చిట్వేలు 25.0, బి.కోడూరు 2.6, బద్వేలు 12.0, గోపవరం 15.8, బి.మఠం 7.0, అట్లూరు 10.0, ఒంటిమిట్ట 11.8, జమ్మలమడుగు 93.6, మైలవరం 66.4, పెద్దముడియం 38.2, ముద్దనూరు 75.6, కొండాపురం 116.4, ప్రొద్దుటూరు 124.0, చాపాడు 80.6, దువ్వూరు 121.2, మైదుకూరు 71.2, రాజుపాలెం 152.6, పులివెందుల 38.0, లింగాల 28.2, వేంపల్లె 15.4, వేముల 35.4, తొండూరు 70.8, సింహాద్రిపురం 92.4 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది.

నీట మునిగిన పంటలు..
రాజుపాలెం మండలంలో పత్తి, జొన్న పంట నీటమునిగింది. దువ్వూరు మండలం లోని మాచనలపల్లె వద్ద వర్షపు నీరు వరినాట్లు వేసిన మళ్లపై పారడంతో వరిమొక్కలు కొట్టుకుపోయినట్లు రైతులు ఆవేదనతో తెలిపారు. ప్రొద్దుటూరు రూరల్‌ పరిధిలో ఇదే పరిస్థితి.  

ఆగిన రాకపోకలు..
రాజుపాలెం మీదుగా ఆళ్లగడ్డకు పోయే వెంగళాయపల్లె రహదారిలో వాగుపొంగి ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయాయి. ఎర్రగుంట్ల మండలంలోని సున్నపురాళ్లపల్లె–ఆర్టీపీపీకి వెళ్లే రహదారిపై ఉన్న కల్లమల్లవాగు పొంగి ప్రవహిస్తుండడంతో రాకపోకలు నిలిచిపోయినట్లు అధికారులు తెలిపారు. అదే విధంగా కొండాపురం మండలంలో పెన్నానది ఉధృతంగా ప్రవహించడంతో ఎర్రగుడి, చామలూరు, సంకేపల్లె గ్రామాలకు రాకపోకలు కొద్దిగంటలపాటు నిలిచిపోయాయి.

ఉద్యాన పంటలకు ఊరట...
ఉద్యాన పంటల రైతులు ఈ వర్షాల పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో రాయచోటి, లక్కిరెడ్డిపల్లె ప్రాంతాల్లో వేరుశనగ, కంది పంటలతోపాటు మామిడి తోటలు ఎండు దశకు చేరుకున్న దశలో కురిసిన వానలు కొంత ప్రయోజనం చేకూరుతుందని ఆయా మండలాల రైతులు చెబుతున్నారు.   ఖరీఫ్‌ సీజన్‌ చివ ర్లో సీజన్‌ మొత్తం వాన ఒక్కరోజులోనే కురిసినట్లుగా ఉందని వాతావరణ శాస్త్రవేత్తలు అంటున్నారు.  సజ్జ, కంది, మొక్కజొన్న, జొన్న, కొర్ర, పత్తి పంటలకు, భూగర్భజలాలు అడుగండి ఎండు ముఖం పట్టిన చీనీ, నిమ్మ, సపోట, జామ, బొప్పాయి, పూలతోటలకు ఈ వర్షాలు చాలా వరకు ప్రాణం పోశాయి.

మరిన్ని వార్తలు