నిప్పుల వాన

22 May, 2015 02:20 IST|Sakshi
నిప్పుల వాన

- కొనసాగుతున్న వడగాడ్పులు
- వడదెబ్బకు ఆరుగురు మృతి
- తల్లడిల్లుతున్న జిల్లా ప్రజలు
- విశాఖలో ఉష్ణతీవ్రత 37.2 డిగ్రీలు
సాక్షి, విశాఖపట్నం:
భానుడు నిప్పులు కురిపిస్తున్నాడు. రోజురోజుకు ఉష్ణతీవ్రతను పెంచుతున్నాడు. దాంతోపాటు వడగాడ్పులు అదే స్థాయిలో ఉధృతమవుతున్నాయి. వరసగా మూడు రోజుల నుంచి వేడిగాలులు జనాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. గురువారం కూడా ఉష్ణోగ్రతలు పెరిగాయి. జిల్లా వ్యాప్తంగా వడదెబ్బకు ఒక్క గురువారమే ఆరుగురు చనిపోయారు. బుధవారం నగరంలో 37 డిగ్రీలు నమోదుకాగా గురువారం మరో .2 డిగ్రీలు పెరిగి 37.2 డిగ్రీలకు చేరుకుంది.

ఇళ్లలో కిటికీలు, తలుపులు వేసినా వేడి తీవ్రత తగ్గలేదు. అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాలేకపోతున్నారు. నిత్యావసర సరకుల కొనుగోలు చేయాల్సి వచ్చిన వారు ఉదయం పది గంటలలోపు, సాయంత్రం ఐదు గంటల తర్వాత వెళ్లి వస్తున్నారు. పగలంతా వడగాడ్పులతో అలసట చెందిన వారు సాయంత్రం వేళ సాగరతీరంలోకి వెళ్లి సేద తీరుతున్నారు. గంటల తరబడి అక్కడే గడిపి ఉపశమనం పొందుతున్నారు. రాత్రికి ఇళ్లకు చేరుకుంటున్నారు. మరోవైపు ఎండ లు, వడగాడ్పులతో పాటు ఉక్కపోతతో నగర వాసులు  సతమతమవుతున్నారు. నగరం సముద్రతీరంలో ఉండడం వల్ల ఉక్కపోత ప్రభావం అధికంగా కనిపిస్తోంది.

ఇళ్లలో ఒకపక్క ఫ్యాన్లు అదే పనిగా తిరుగుతున్నా చెమటలు తగ్గడం లేదు. పశ్చిమ, వాయవ్య దిశ నుంచి గాలులు  వీస్తున్నా అవి కూడా వేడినే వెదజల్లుతున్నాయి తప్ప ఫలితం కనిపించడం లేదు. వచ్చే రెండు రోజులు ఉష్ణోగ్రతలు, వడగాడ్పులు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. అందువల్ల బయటకు వెళ్లాల్సి వస్తే అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు, గర్భిణులు ఇళ్లకే పరిమితమవ్వాలని సూచిస్తున్నారు.

మరిన్ని వార్తలు