పులిచింతల ప్రాజెక్టుకు తొలిసారి జలకళ

9 Aug, 2013 02:50 IST|Sakshi
పులిచింతల ప్రాజెక్టుకు తొలిసారి జలకళ

గుంటూరు/మేళ్లచెరువు, న్యూస్‌లైన్: పులిచింతల ప్రాజెక్టుకు తొలిసారి జలకళ వచ్చింది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కల సాకారమైంది. జలయజ్ఞంలో భాగంగా రాష్ర్టంలోనే తొలిసారిగా చేపట్టిన ఈ ప్రాజెక్టు నల్లగొండ జిల్లా మేళ్లచెర్వు మండలంలోని పులిచింతలలో నిర్మించారు. ఎగువన నాగార్జునసాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండడంతో బుధవారం అక్కడ గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశారు. దీంతో గురువారం పులిచింతల ప్రాజెక్టు వద్ద వరద ఉధృతి పెరిగింది. నీటిమట్టం పెరగడంతో ప్రాజెక్టుకు బిగించిన 18 గేట్లలో 14 క్రస్ట్‌గేట్లను ఎత్తి 2.70 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువన ఉన్న ప్రకాశం బ్యారేజీకి వదిలారు. ప్రస్తుతం ప్రాజెక్టు వద్ద క్రస్ట్ లెవల్ పైనుంచి దాదాపు 15 అడుగులకు పైగా వరద నీరు ప్రవహిస్తోంది.
 
 దీంతో ప్రాజెక్ట్‌లో అంతర్భాగంగా నిర్మిస్తున్న విద్యుదుత్పత్తి ప్లాంటులోకి వరద నీరు చేరి, పనులు పూర్తిగా నిలిచిపోయాయి. ఎగువ నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరడంతో పులిచింతల ప్రాజెక్టు నిండుకుండలా తొణికిసలాడుతోంది. కాగా, గేట్ల పైభాగంలో మెకానికల్ పనులకు ఆటంకం లేకపోవడంతో గేట్ల బిగింపు, వెల్డింగ్ పనులను మరింత ముమ్మరం చేశారు. ఈ నెల 15వ తేదీలోగా ప్రాజెక్టు పనులను పూర్తి చేయాలని, స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రాజెక్టును ప్రారంభించాలని నెల రోజుల క్రితం సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఉన్నతాధికారులకు సూచించారు. ఈ నేపథ్యంలో గడిచిన ఇరవై రోజులుగా ప్రాజెక్టు చివరి దశ పనులు వేగంగా జరుగుతున్నాయి. క్రస్ట్‌గేట్లు 24 బిగించాల్సి ఉండగా, ఇప్పటి వరకు 18 గేట్లు బిగించారు. మిగతా ఫ్యాబ్రికేషన్ పనులు జరుగుతున్నాయి.
 
 ముంపు గ్రామాలను తాకిన నీరు
 ఇదిలా ఉండగా పులిచింతల ప్రాజెక్టుకు ఎగువన రిజర్వాయర్‌కు ఆనుకుని ఉన్న ముంపు గ్రామాల శివార్లకు వరదనీరు చేరింది. ఇటు గుంటూరు జిల్లా బెల్లంకొండ మండలం, అటు నల్గొండ జిల్లా మేళ్లచెర్వు మండలంలోని గ్రామాలు కేతవరం, బోధనం, చిట్యాల, గొల్లపేట, కోళ్లూరు, చింత్రియాల, అడ్లూ రు, కృష్ణాపురం, వెల్లటూరు వరదనీటి బారిన పడే ప్రమాదం ఉందని గుర్తించిన ఆయా మండలాల రెవెన్యూ అధికారులు వీఆర్‌వోలకు ప్రత్యేక విధులను కేటాయించారు. లోతట్టు ప్రాంతాల వారిని సురక్షిత ప్రాంతాలకు చేరుస్తున్నారు.

మరిన్ని వార్తలు