'అనంత'లో భారీ వర్షం

30 May, 2015 08:47 IST|Sakshi
'అనంత'లో భారీ వర్షం

రాయలసీమలో కరువు ప్రాంతమైన అనంతపురంలో జిల్లాలో శుక్రవారం సాయంత్రం వర్షం కురిసింది. జిల్లా పరిధిలోని కళ్యాణదుర్గం, ఉరవకొండ, హిందూపురం, ధర్మవరం, శింగనమల, రాప్తాడు నియోజకవర్గాల్లో విపరీతమైన వరణుడు విజృంభించాడు. ఇన్నిరోజులు కరుణించని వరణుడు ఒక్కసారిగా ఉరుములు, మెరుపులతో జనాన్ని బెంబేలిత్తించాడు. ఈదురుగాలులతో విరుచుకుపడ్డాడు. దెబ్బకు ఎన్నో చెట్లు నేలవాలాయి. పలు ట్రాన్స్ ఫార్మర్లలో విద్యుత్ నిలిచిపోయి పలు గ్రామాలు అంధకారంలో మునిగిపోయాయి. నదుల లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయిపోయాయి.

ఈ అకాల వర్షానికి ఉరుములు, మెరుపులకు భయపడి పెవరలిలో రామక్క (65) అనే వృద్ధురాలు మరణించింది. అదే విధంగా నక్కలదొడ్డిలో లక్ష రూపాయల విలువ చేసే గడ్డివాములు పిడుగుపాటు కారణంగా దగ్ధమయ్యాయి. కరెంటు లేక పలు ప్రాంతాలు అంధకారంలో మునిగిపోయాయి. 40 నుంచి 50 కిలో మీటర్ల వేగంతో గాలులు వీచాయి. ఇదిలా ఉండగా శుక్రవారం సూర్యుడు కూడా తన ప్రతాపాన్ని చూపించాడు. జిల్లా వ్యాప్తంగా అధిక ఉష్ణోగ్రతలతో బెంబేలిత్తించాదు. జిల్లాలోని తాడిమర్రిలో అత్యధికంగా 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

దెబ్బతిన్న నర్సరీలు: రూ.కోటి నష్టం
కళ్యాణదుర్గం పట్టణంలో శుక్రవారం రాత్రి ఈదురుగాలులకు భారీ నష్టం సంభవించింది. పట్టణ పరిసర ప్రాంతాల్లో ఉన్న టమాటా, మిరప, వంగ నార్లు పెంచుతున్న నర్సరీలు గాలి తీవ్రతకు ధ్వంసమయ్యాయి. నాలుగు నర్సరీలు పూర్తిగాను, మరో 13 వరకు పాక్షికంగానూ దెబ్బతిన్నాయి. దీంతో సుమారు రూ.కోటి మేర నష్టం వాటిల్లిందని బాధిత రైతులు తెలిపారు.

మరిన్ని వార్తలు