పునాదుల్లోనే పోలవరం

20 Jun, 2019 04:46 IST|Sakshi

ప్రాజెక్టుపై గత టీడీపీ ప్రభుత్వం చెప్పినవన్నీ ప్రగల్భాలే..

2018 మే నాటికే గ్రావిటీపై నీళ్లిస్తామంటూ చంద్రబాబు హంగామా

ప్రాజెక్టు పనులు 66.74 శాతం పూర్తి చేసినట్లు గొప్పలు 

వాస్తవానికి పునాది స్థాయిని కూడా దాటని ప్రధాన జలాశయం పనులు 

హెడ్‌వర్క్స్‌లో భారీగా మిగిలిపోయిన పనులు 

సాక్షి, అమరావతి: రాష్ట్ర విభజన చట్టంలో ఇచ్చిన హామీ ప్రకారం యుద్ధప్రాతిపదికన పూర్తి కావాల్సిన ప్రాజెక్టు అది. చట్ట ప్రకారం వ్యవహరించి ఉంటే ఇప్పటికే ఆ ప్రాజెక్టు పూర్తయ్యేది. 7.2 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుతోపాటు కృష్ణా డెల్టాలో 13.08 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరిగేది. 960 మెగావాట్ల జలవిద్యుత్‌ అందుబాటులోకి వచ్చేది. విశాఖపట్నంలో తాగు, పారిశ్రామిక నీటి అవసరాలు తీరడంతోపాటు 540 గ్రామాల ప్రజల దాహార్తి తీరేది. అలాంటి బహుళార్ధక సాధక పోలవరం జాతీయ ప్రాజెక్టుకు నాలుగేళ్ల పది నెలల చంద్రబాబు నాయుడి పాలన శాపంగా మారింది. పోలవరం ప్రాజెక్టు ఎగువ కాఫర్‌ డ్యామ్‌ను 2018 మే నాటికే పూర్తి చేసి గ్రావిటీ ద్వారా ఆయకట్టుకు నీళ్లిస్తామని 2016 సెప్టెంబరు 30న అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఘనంగా ప్రకటించారు. నాలుగేళ్ల పది నెలల్లో 90 సార్లు వర్చువల్‌ రివ్యూలు.. 29 సార్లు క్షేత్రస్థాయి పర్యటనలు చేశారు. ప్రాజెక్టు పనులను పరుగులు పెట్టించానని గొప్పలు చెప్పారు. కానీ, పోలవరం ప్రాజెక్టులో ప్రధాన జలాశయం(ఎర్త్‌ కమ్‌ రాక్‌ఫిల్‌ డ్యామ్‌) పనులు పునాది స్థాయిని కూడా దాటకపోవడం గమనార్హం. పోలవరం పనులు ఎంత వేగంగా జరిగాయో దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చు.

సగం కూడా పూర్తి కాని కాఫర్‌ డ్యామ్‌ 
పోలవరం కాఫర్‌ డ్యామ్‌ విషయంలో నేల విడిచి సాము చేస్తూ చంద్రబాబు ప్రదర్శించిన విన్యాసాలు ప్రాజెక్టుకు శాపంగా మారాయి. ఒకే సీజన్‌లో పూర్తి చేయాల్సిన కాఫర్‌ డ్యామ్‌ పనులను సగ భాగం కూడా పూర్తి చేయలేకపోయారు. గతేడాది రుతుపవనాల ప్రభావం తక్కువగా ఉన్నా గోదావరికి గరిష్టంగా 28 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం వచ్చింది. ఈ ఏడాది అదే రీతిలో ప్రవాహం వచ్చినా, ఆ ఉధృతికి కాఫర్‌ డ్యామ్‌ తట్టుకుని నిలబడగలదా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటివరకూ చేసిన కాఫర్‌ డ్యామ్‌ పనులను రక్షించడం.. ముంపు గ్రామాల్లోకి వరద ముంచెత్తకుండా చూడటం సవాల్‌గా మారింది. 

చేసింది గోరంత.. చెప్పుకున్నది కొండంత 
- పోలవరం హెడ్‌ వర్క్స్‌లో మట్టి పనులు 1,169.56 లక్షల క్యూబిక్‌ మీటర్లు చేయాలి. ఇప్పటివరకూ 1,012.65 లక్షల క్యూబిక్‌ మీటర్ల పనులు చేశారు. ఇంకా 156.91 లక్షల క్యూబిక్‌ మీటర్ల మట్టి పనులు మిగిలాయి. 
​​​​​​​- పోలవరం హెడ్‌ వర్క్స్‌లో స్పిల్‌ వే, స్పిల్‌ ఛానల్‌ పనుల్లో 38.88 లక్షల క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌ పనులు చేయాలి. ఇప్పటివరకూ 30.28 లక్షల క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌ పనులు చేశారు. ఇంకా 8.60 లక్షల క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌ పనులు చేయాల్సి ఉంది. 
​​​​​​​- గేట్ల తయారీకి 18 వేల టన్నుల స్టీల్‌ అవసరం. ఇప్పటివరకూ 12,583 టన్నుల స్టీల్‌తో స్కిన్‌ ప్లేట్లు రూపొందించారు. గేట్లను బిగించడానికి అవసరమైన హైడ్రాలిక్‌ హాయిస్ట్‌లు ఇప్పటికీ సేకరించలేదు.
​​​​​​​- ఎగువ కాఫర్‌ డ్యామ్‌ పనుల్లో 72.56 లక్షల క్యూబిక్‌ మీటర్లకుగానూ 43.97 లక్షల క్యూ.మీ., దిగువ కాఫర్‌ డ్యామ్‌ పనుల్లో 26.84 లక్షల క్యూబిక్‌ మీటర్లకుగానూ 9.21 లక్షల క్యూబిక్‌ మీటర్ల పనులు చేశారు. 
​​​​​​​- జలాశయంలో ముంపునకు గురయ్యే 222 గ్రామాలకు చెందిన 1,05,601 నిర్వాసిత కుటుంబాలకుగానూ కేవలం 3,922 కుటుంబాలకు మాత్రమే పునరావాసం కల్పించారు. ఇంకా 1,01,679 కుటుంబాలకు పునరావాసం కల్పించాలి. 
​​​​​​​- కుడి కాలువలో ఇప్పటికీ 18 కిలోమీటర్ల లైనింగ్‌ పనులు మిగిలిపోయాయి. 
​​​​​​​- ఎడమ కాలువలో ఇప్పటికీ 25 కిలోమీటర్ల తవ్వకం, 90 కిలోమీటర్ల పొడువున లైనింగ్‌ పనులు మిగిలిపోయాయి. 
​​​​​​​- పోలవరం ప్రాజెక్టు, నిర్వాసితుల పునరావాసానికి 1,31,102.67 ఎకరాల భూమి సేకరించాలి. ఇప్పటిదాకా 98,316.72 ఎకరాలు సేకరించారు. ఇంకా 32,785.95 ఎకరాలు సేకరించాల్సి ఉంది.  
​​​​​​​- వీటిని పరిగణనలోకి తీసుకుంటే పావలా భాగం పనులు కూడా పూర్తి కాలేదని స్పష్టమవుతోంది. కానీ, చంద్రబాబు సర్కార్‌ మాత్రం 66.74% పూర్తి చేసినట్లు గొప్పగా ప్రకటించుకోవడం గమనార్హం.

మరిన్ని వార్తలు