'అనంత' పొలాల్లో చాపర్‌

18 Feb, 2020 05:05 IST|Sakshi

సాంకేతిక సమస్యతో పొలాల్లో దిగిన చాపర్‌

బళ్లారికి చెందిన జిందాల్‌ కంపెనీదిగా గుర్తింపు

కళ్యాణదుర్గం రూరల్‌: సాంకేతిక సమస్యతో ఓ చాపర్‌ (హెలికాప్టర్‌) అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రం మండలంలోని ఎరడికెర పొలాల్లో అత్యవసరంగా దిగింది. వివరాలివీ.. కర్ణాటకలోని బళ్లారిలో జిందాల్‌ కంపెనీ ఎగ్జిక్యూటివ్‌ పరంజిత్, పైలట్‌ పాఠక్‌లు సోమవారం ఉదయం బళ్లారి నుంచి మైసూరుకు చాపర్‌లో బయలుదేరారు. ఈ క్రమంలో.. ఇంజిన్‌లో ఇంధనం లీకవడాన్ని గుర్తించిన పైలట్‌ బ్రహ్మసముద్రం సమీపంలోని ఎరడికెర పొలాల్లో సురక్షితంగా ల్యాండ్‌ చేశారు.

విషయం తెలుసుకున్న సమీప గ్రామాల ప్రజలు అధిక సంఖ్యలో ఘటనా స్థలికి చేరుకున్నారు. కళ్యాణదుర్గం డీఎస్పీ వెంకటరమణ, సీఐ శివశంకర్‌ నాయక్, ఎస్‌ఐ నాగేంద్రబాబు, తహసీల్దార్‌ రమేష్, ఇతర అధికారులు వచ్చి వివరాలను సేకరించారు. బళ్లారి నుంచి సాంకేతిక నిపుణులు వచ్చి మరమ్మతులు చేసిన అనంతరం చాపర్‌ తిరిగి వెళ్తుందని చెప్పారు. చాపర్‌ దిగిన ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. 

మరిన్ని వార్తలు