దర్జాగా దోచేస్తున్నారు

5 Aug, 2015 03:18 IST|Sakshi
దర్జాగా దోచేస్తున్నారు

- జిల్లాలో జోరందుకున్న హెల్మెట్‌ల వ్యాపారం
- ఇప్పటి వరకు 65 వేలకు పైగా అమ్మకాలు
- జిల్లాలో మొత్తం ద్విచక్ర వాహనాలు 2.3 లక్షలు
మదనపల్లె:
జిల్లాలో వాహనదారులను హెల్మెట్‌ల వ్యాపారులు దోచేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా హెల్మెట్‌ల వ్యాపారం జోరందుకొంది. జిల్లా వ్యాప్తంగా మొత్తం 2.30 లక్షల వరకూ ద్విచక్రవాహనాలు ఉన్నట్లు మోటారు వాహనాల శాఖ అధికారుల అంచనా. ద్విచక్ర వాహనదారులకు జూలై ఒకటో తారీఖు నుంచి హెల్మెట్‌లు తప్పని సరి కావడంతో వాహనదారులు వీటిని కొనుగోలు చేయడంలో నిమగ్నమయ్యారు. జిల్లావ్యాప్తంగా మొత్తం  2.30 లక్షలకుపైగా ద్విచక్రవాహనాలు, 60 వేలకు పైగా కార్లు ఉన్నాయి. వీరిలో ఇదివరకూ ఏ ఒక్కరో, ఇద్దరో తప్ప హెల్మెట్‌లు కానీ, సీటు బెల్టులు కానీ కచ్చితంగా వాడుతున్న దాఖలాలు లేవు.

అయితే హెల్మెట్‌ల వాడకం తప్పని సరికాడంతో ఇప్పటి వరకూ జిల్లా వ్యాప్తంగా 67 వేలకుపైగా హెల్మెట్‌లను వాహనదారులు కొనుగోలు చేసినట్లు ప్రాథమిక అంచనా. కాగా  మదనపల్లె మోటారు వెహికల్ శాఖ పరిధిలోని మదనపల్లె, గుర్రంకొండ, తంబళ్లపల్లె, పెద్దమండ్యం, బి.కొత్తకోట, పీటీఎం, పెద్దమండ్యం, వాల్మీకిపురం, కురబలకోట, రా మసముద్రం, నిమ్మనపల్లె, పుంగనూరు, పెద్దపంజాణి, చౌడేపల్లెతో కలిపి మొత్తం 14 మండలాల పరిధిలో దాదాపుగా 70 వేల వరకూ ద్విచక్రవాహనాలు, 25 వేల వరకూ కార్లు, జీపులు ఉన్నాయి. కేవలం డివిజన్ కేంద్రమైన మదనపల్లె పట్టణంలో దాదాపుగా 50 వేల వరకూ ద్విచక్రవాహనాలు, 15 వేలకుపైగా కార్లు, జీపులు ఉన్నాయి.  
 
మదనపల్లెలో 10 వేల హెల్మెట్‌ల అమ్మకాలు
డివిజన్ కేంద్రమైన మదనపల్లె పట్టణంలో బెంగళూరు రోడ్డు, కదిరిరోడ్డు, సీటీఎం రోడ్డు, అవెన్యూ రోడ్డు, పుంగనూరు రోడ్డు, నీరుగట్టువారిపల్లె, బెంగళూరు బస్టాండు ప్రాంతాలతో పాటు పలువురు ఆటోమొబైల్ షాపులతో కలిపి మొత్తం 23 చోట్ల అమ్మకాలు సాగిస్తున్నారు.
 
అందుబాటులో లేని హెల్మెట్‌లు
గత నెలతో పోల్చితే ఈ నెలలో కొంత అమ్మకాలు పెరిగాయని, అయితే డిమాం డ్‌కు తగ్గట్టుగా హెల్మెట్‌లు అందుబాటులో లేవని వ్యాపారులు అంటున్నారు. ఢిల్లీ, ముంబయి, కలకత్తా తదితర పెద్ద నగరాల నుంచి బెంగళూరు, హైదరాబాదు, చెన్నై వంటి నగరాలకు దిగుమతి చేసుకోవాల్సి ఉందని, అక్కడి నుంచి మన ప్రాంతాలకు తీసుకురావాల్సి ఉందన్నారు.
 
దోచుకుంటున్న వ్యాపారులు
జిల్లావ్యాప్తంగా హెల్మెట్‌ల విక్రయించే కొందరు వ్యాపారులు వాహనదారులను దోచుకొంటున్నారు. రూ.450 విలువ చేసే ఫుల్ హెల్మెట్ రూ.750కి, రూ.200 విలువ చేసే హాఫ్ హెల్మెట్ రూ.300కి విక్రయిస్తున్నారు. వాస్తవానికి ఐఎస్‌ఐ మార్కువైతే ప్రస్తుతం అధికంగా అందుబాటులో లేకపోవడంతో పోలీసుల బారి నుంచి రక్షించుకునేందుకు ఏదో ఒకటని కొనక తప్పడం లేదు.

మరిన్ని వార్తలు