గ్రామ సచివాలయ ఉద్యోగాలు: ప్రత్యేక హెల్ప్‌ డెస్క్‌ ఏర్పాటు

29 Jul, 2019 12:31 IST|Sakshi
(ఫైల్ ఫోటో)

సాక్షి, అమరావతి : గ్రామ సచివాలయ ఉద్యోగాల భర్తీలో సందేహాలు నివృత్తి కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక హెల్ప్‌ డెస్క్‌ ఏర్పాటు చేసింది. ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఎలాంటి సందేహాలు ఉన్నా హెల్ప్‌ డెస్క్‌కి ఫోన్‌ చేయవచ్చని పంచాయతీ రాజ్‌ శాఖ కమిషనర్‌ గిరిజా శంకర్‌ తెలిపారు. 9121296051, 9121296052, 9121296053, 9121296054, 9121296055 హెల్ప్‌ డెస్క్‌ నంబర్లకు ఫోన్‌ చేస్తే సందేహాలను నివృత్తి చేస్తామని పేర్కొన్నారు. మరోవైపు  ఆయా ఉద్యోగాలకు అర్హులైన నిర్యుదోగ యువత నుంచి ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులు స్వీకరించేందుకు  gramasachivalayam. ap. gov. in,   vsws. ap. gov. in,  wardsachivalayam. ap. gov. in అనే మూడు ప్రత్యేక వెబ్‌సైట్లను సిద్ధం చేశారు.

కాగా రాష్ట్ర చరిత్రలోనే ఎన్నడూ కనివినీ ఎరుగని రీతిలో ఒకే విడతలో 1,26,728 ప్రభుత్వోద్యోగ నియామకాలకు సంబంధించిన రెండు నోటిఫికేషన్లు శుక్రవారం రాత్రి విడుదలయిన విషయం తెలిసిందే. గ్రామ సచివాలయాల్లో 95,088 ఉద్యోగాలకు పంచాయతీరాజ్‌ శాఖ.. పట్టణ వార్డు సచివాలయాల్లో 31,640 ఉద్యోగాలకు పట్టణాభివృద్ది శాఖ నోటిఫికేషన్లను వేర్వేరుగా జారీచేశాయి. గ్రామ, వార్డు సచివాలయాల్లో భర్తీ చేయనున్న 1,26,728 ఉద్యోగాల్లో 80 శాతం పోస్టులను స్థానికులకే కేటాయిస్తారు. మిగిలిన 20 శాతం పోస్టులను ఓపెన్‌ కేటగిరీలో భర్తీ చేస్తారు. జిల్లాను యూనిట్‌గా తీసుకుని అభ్యర్థుల స్థానికతను గుర్తిస్తారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థి 4వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఏడేళ్ల కాలంలో నాలుగేళ్లపాటు ఏ జిల్లాలో చదువుకుంటారో సదరు అభ్యర్థిని స్థానిక కేటగిరీగా గుర్తిస్తారు. ఆ జిల్లాకు కేటాయించిన మొత్తం పోస్టుల్లో 80 శాతం వారితోనే భర్తీ చేస్తారు. ఒక జిల్లాలో ఎక్కువ కాలం చదివి.. వేరే జిల్లాలో ఉద్యోగానికి దరఖాస్తు చేసుకుంటే ఓపెన్‌ కేటగిరీలో 20 శాతం మందిని మాత్రమే ఎంపిక చేస్తారు. ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్‌లో ఈ విషయాలను స్పష్టంగా పేర్కొంది.

చదవండి1,26,728 గ్రామ, వార్డు సచివాలయాల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు
 
వయో పరిమితి.. జీతం ఇలా 
గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయో పరిమితి 18నుంచి 42 ఏళ్లుగా నిర్ణయించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు గరిష్ట వయో పరిమితిలో ఐదేళ్లు, వికలాంగులకు పదేళ్ల సడలింపు అమలు చేస్తారు. సంబంధిత ఉద్యోగంలో ఇప్పటికే ఔట్‌ సోర్సింగ్‌లో పని చేస్తున్న వారికి వయో పరిమితిలో వారి సర్వీసు కాలానికి సడలింపు ఇస్తారు. గరిష్ట వయో పరిమితిలో అత్యధికంగా ఐదేళ్ల సడలింపు ఇస్తారు. జిల్లా స్థాయి కమిటీ ఆధ్వర్యంలో జరిగే రాత పరీక్ష  అనంతరం ఎంపికయ్యే అభ్యర్థికి మొదటి రెండేళ్లు రూ.15 వేల చొప్పున గౌరవ వేతనం చెల్లించి, ఆ తర్వాత పూర్తిస్థాయి ప్రభుత్వ ఉద్యోగి హోదా కల్పిస్తూ బేసిక్‌ శాలరీ అమలు చేస్తారు. పంచాయతీ కార్యదర్శి, వార్డు అడ్మినిస్ట్రేటివ్‌ సెక్రటరీ పోస్టులకు రూ.15,030 నుంచి రూ.46,060 మధ్య బేసిక్‌ శాలరీ నిర్ణయించగా.. మిగిలిన పోస్టులకు రూ.14,600 నుంచి రూ.44,870 మధ్య బేసిక్‌ శాలరీగా అమలు చేయనున్నట్టు పేర్కొన్నారు.  

మరిన్ని వార్తలు