మా బిడ్డను బతికించండి!

30 Sep, 2018 11:20 IST|Sakshi

ఆపన్నహస్తం కోసం వేడుకోలు

ఆదుకోని ఎన్టీఆర్‌ వైద్యసేవ

రూ.2.5 లక్షలకు మించి వర్తించదన్న వైద్యులు

అచేతన స్థితిలో ఇంజినీరింగ్‌ విద్యార్థి

నిరుపేద రైతు కుటుంబం.. రెక్కాడితే కానీ డొక్కనిండని దుస్థితి.. తమ సుపుత్రుడు బాగా చదువుకుని పైకి వస్తే తమ కష్టాలు తీరుతాయని ఆ కుటుంబం కలలు కనింది. అయితే ఆ ఆశలు అడియాసలయ్యాయి. దురదృష్టం లారీ రూపంలో వెంబడించింది. ఫలితంగా ఆ ఇంటి వారసుడు అచేతన స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు. తమ బిడ్డను బతికించమని ఆ రైతు కుటుంబం వేడుకొంటోంది.

మదనపల్లె టౌన్‌: దాతలు, తమకు ఆపన్న హస్తం అందించి తమ బిడ్డకు ప్రాణభిక్ష పెట్టాలని చిత్తూ రు జిల్లా పెద్దమండ్యం మండలం పాపేపల్లె పం చాయతీ గురివిరెడ్డిగారిపల్లెకు చెందిన రైతు జీవీ కృష్ణారెడ్డి, శివకుమారి దంపతులు అభ్యర్థిస్తున్నా రు. రోడ్డు ప్రమాదంలో గాయపడి, అచేతన స్థితిలో ఉన్న తమ బిడ్డకు ఆపరేషన్‌ కోసం దయగల వారు సాయం అందించాలని వేడుకుంటున్నారు. వివరాల్లోకి వెళితే.. గురివిరెడ్డిగారిపల్లెకు చెందిన కృష్ణారెడ్డికి ఇద్దరు సంతానం. కుమారుడు భరత్‌ సింహారెడ్డి(21) చిన్నప్పటి నుంచి చదువులో రాణిస్తుండేవాడు. ఈ నేపథ్యంలో వారు తమ కుమారుడిని రెండేళ్ల క్రితం నెల్లూరులోని ఓ ఇంజి నీరింగ్‌ కళాశాలలో చేర్పించారు. తమ కుమారుడు ఇంజినీరింగ్‌ పూర్తి చేస్తే తమ కష్టాలు తీరుతాయని భావించారు. వారి ఆశయానికి తగ్గట్టు భరత్‌సింహారెడ్డి ఇంజినీరింగ్‌ ఫస్టు ఇయర్‌లో మంచి మార్కులు సాధించాడు. అయితే దేవుడు చిన్నచూపు చూశాడు.

 దురదృష్టం లారీ రూపంలో వెంటాడింది. రెండేళ్ల క్రితం లారీ ఢీ కొన్న సంఘటనలో భరత్‌ సింహారెడ్డి కాళ్లు, చేతులు పోగొట్టుకుని, తలకు బలమైన గాయాలు కావడంతో మతి స్థిమితం కోల్పోయాడు. అచేతన స్థితిలో ఉన్న తన ఒక్కగానొక్క బిడ్డను బతికించుకోవడానికి ఆ తల్లిదండ్రులు గ్రామంలో ఉన్న నాలుగు ఎకరాల వ్యవసాయ భూమిని తెగమ్మి ఎట్టకేలకు కొడుకును బతికించుకున్నారు. రూ. 2.5 లక్షలు ఎన్టీఆర్‌ వైద్య సేవలతో ఆపరేషన్‌ కూడా చేయించారు. అప్పటికే చేతిలో ఉన్న డబ్బంతా ఖాళీ అయింది. 

అయినా ఆ యువకుడు లేచి నడవలేకున్నాడు. భరత్‌ సింహారెడ్డి లేచి నడవాలంటే మరో మూడు ఆపరేషన్లు చేయాలని వైద్యులు చెబుతున్నారు. ఇందుకు రూ.5 లక్షలు అవసరమని వైద్యులు చెబుతున్నారు. ఎన్టీఆర్‌ ఆరోగ్యశ్రీ పథకం కోసం దరఖాస్తు చేసుకుంటే ఇప్పటికే రూ.2.5 లక్షల విలువైన వైద్యం చేశామని, ఇక ఎన్టీఆర్‌ ఆరోగ్యశ్రీ వర్తించదని వైద్యులు చెబుతున్నారని ఆ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏ ఆస్పత్రికి వెళ్లినా ఇదే పరిస్థితి ఎదురవుతోందని వారు విలపిస్తున్నారు. ఉన్న పొలం అమ్మివేయడంతో కూలికెళితేగాని కుండకాలని పరిస్థితిలో ఉన్నామని, అంత మొత్తం నగదు తమ వద్ద లేక, అప్పులు చేస్తే తీర్చేదారిలేక ఆ తల్లిదండ్రులు అయోమయంలో పడ్డారు. 

మంచానికే పరిమితమైన తమ బిడ్డను వైద్యపరీక్షలు, మందులుకు ప్రతిసారి మదనపల్లెకు తీసుకువచ్చి, తిరిగి వెళ్లడానికి కష్టంగా మారడంతో పల్లె నుంచి మదనపల్లెలోని అమ్మినేనివీధికి కాపురం మార్చుకున్నారు. నడవలేనిస్థితిలో ఉన్న బిడ్డకు తల్లిదండ్రులు సపర్యలు చేస్తున్నారు. దాతలు వారికి ఆపన్నహస్తం అందించదలిస్తే  9493871077, 9676520586 నంబర్లలో సంప్రదించాలని వారు కోరుతున్నారు. ఎస్‌బీఐ ఎన్టీటీఆర్‌ సర్కిల్‌ అకౌంట్‌ నంబర్‌ 30757452216. ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్‌ ఎస్‌బీఐఎన్‌ 0012727కు సహాయం అందించాలని ప్రాథేయపడుతున్నారు.

మరిన్ని వార్తలు