జర్నలిస్టుల సంక్షేమానికి కృషి చేయాలి

18 Jul, 2018 07:22 IST|Sakshi

తూర్పుగోదావరి : ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా అహర్నిశలూ కష్టించి పనిచేసే జర్నలిస్టుల సంక్షేమానికి కృషి చేయాలని వైఎస్సార్‌ సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ఏపీడబ్ల్యూజేఎఫ్‌ నాయకులు కోరారు. ప్రజా సంకల్పయాత్రలో భాగంగా సోమేశ్వరంలో జరిగిన పాదయాత్రలో యూనియన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్‌.సలీమ్, వి.శ్రీనివాసరావు, వి.సత్యనారాయణలతో పాటు పలువురు పాత్రికేయులు వైఎస్‌ జగన్‌కు వినతి పత్రం అందజేశారు.

ఈ సందర్భంగా సలీమ్‌ మాట్లాడుతూ రాష్ట్రంలోని జర్నలిస్టులకు ఉద్యోగ, ఆర్థిక భద్రత లేకపోవడంతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు. ఇటీవల కాలంలో జర్నలిస్టులపై దాడులు పెరిగాయన్నారు. ఎస్సీ, ఎస్టీ చట్టం మాదిరిగా జర్నలిస్టులపై దాడిచేసిన వారిపై నాన్‌బెయిలబుల్‌ కేసులు నమోదు చేసేలా ప్రత్యేక చట్టం తీసుకురావాలన్నారు. చిన్న, మధ్య పత్రికలకు జిల్లాల్లో పూర్తి స్థాయిలో అక్రిడిడేషన్లు కల్పించాలన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చి, ఇళ్లు నిర్మించుకోడానికి సబ్సిడీతో కూడిన రుణ సదుపాయాన్ని కల్పించాలని జగన్‌ను కోరారు. అలాగే జర్నలిస్టులకు పింఛను సదుపాయం కల్పించాలని కోరారు.

మరిన్ని వార్తలు