రైతుల్ని ఆదుకోండి!

18 Dec, 2014 04:06 IST|Sakshi
రైతుల్ని ఆదుకోండి!

సాక్షి ప్రతినిధి, కడప: ప్రకృతి వైపరీత్యాల కారణంగా నష్టపోతున్న రైతన్నలకు ఆసరాగా నిలవాల్సిన ఇన్స్యూరెన్సు కంపెనీలు సైతం వేదనకు గురి చేస్తున్నాయి. 2012 రబీ పంటలకు ప్రీమియం చెల్లించినా రెండేళ్లుగా బీమా మంజూరు చేయలేదు. శనిగ పంటకు ప్రీమియం చెల్లించుకోవచ్చుని విషయం తెలిసినా ఒకరోజులోనే గడువు ముగిసింది. తక్షణమే రైతులకు ఇన్స్యూరెన్సు కంపెనీ ఆసరాగా నిలవాలని ఏఐసీ సిఎండి జోసెఫ్‌కు కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి వివరించారు. న్యూడిల్లీలో బుధవారం ఆయన సిఎండి జోసెఫ్‌ను కలిసి జిల్లాలోని రైతులు ఎదుర్కొంటున్న దుస్థితిని వివరించినట్లు ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి మీడియాకు తెలిపారు.
 
  ఆయన కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ప్రభుత్వం ప్రకృతి కారణంగా నష్టపోతున్న రైతులకు ఆసరాగా నిలవాలనే లక్ష్యంతో ఇన్స్యూరెన్సు విధానం ప్రవేశ పెట్టింది. పంటలకు ప్రీమియం ముందే చెల్లించినా ఇన్స్యూరెన్సు చెల్లించడంలో కంపెనీలు  వైఫల్యం చెందుతున్నాయి. 2012 రబీ పంటలకు ప్రీమియం చెల్లించినా ఇప్పటికి ఏఐసీ కంపెనీ ఇన్స్యూరెన్సు చెల్లించలేదు.
 శనగకు బీమా గడువు పెంచండి....
 శనగ పంటకు ఇన్స్యూరెన్సు ప్రీమియం చెల్లించుకోవచ్చునని డిసెంబర్ 13న పత్రికల ద్వారా రైతులకు తెలిసింది. తుది గడువు 15గా ప్రకటించారు. అయితే 14వ తేదీ ఆదివారం కావడంతో బ్యాంకుల్లో రైతులు డీడీలు తీసుకునే అవకాశం లేకపోయింది. 15వ తేదీ అందుబాటులో ఉన్న కొద్దిమంది రైతులు మాత్రమే బీమా కోసం డీడీలు కట్టారు. దీంతో ఎక్కువ మంది రైతులంతా అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేదు.
 
  ప్రకృతి కారణంగా రైతులు నష్టపోకుండా ఉండేందుకు ఈనెల 25వ తేదీ వరకూ ఇన్స్యూరెన్సు ప్రీమియం చెల్లించేందుకు గడువు పెంచాలి. ఆమేరకు సిఎండిగా మీరు చర్యలు తీసుకుని రైతులకు అవకాశం కల్పించాలని కోరినట్లు ఎమ్పీ వెల్లడించారు. అలాగే 2010 సంవత్సరం నుంచి 126 మంది రైతులకు చెందిన క్లైమ్‌లు సెటిల్ కాలేదు. పులివెందుల మున్సిపాలిటి పరిధిలోని బ్రహ్మణపల్లెకు చెందిన 126 మంది రైతులు వేరుశనగ పంట కోసం ప్రీమియం చెల్లించారు. అయితే బ్యాంకర్లు పొద్దుతిరుగుడు పంట కోసం చెల్లించినట్లుగా తప్పుగా నమోదు చేసుకున్నారు.
 
  రైతులు బ్యాంకులకు చెల్లించింది వేరుశనగ పంట కోసం. ఆమేరకు పులివెందుల ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు తమ తప్పిదాన్ని ధ్రువపరుస్తూ, 2013 జూలైలో ఏఐసీకి లేఖ రాసింది. రైతులు వేరుశనగ పంట కోసం ప్రీమియం చెల్లించి కూడా బీమా అందుకోలేకపోయారు. వారికి న్యాయం చేయూలని కోరినట్లు చెప్పారు. శనగ పంటకు కనీసం ఈనెల 25వతేదీ వరకూ బీమా గడువు పెంచాలి. 2012 రబీ పంటలకు చెల్లించిన ప్రీమియంకు ఇన్స్యూరెన్సు సత్వరమే అందించాలని సిఎండికి రాతపూర్వకంగా వివరించారు. ఆమేరకు పరిశీలించి సత్వర చర్యలు తీసుకుంటానని  సిఎండి జోసెఫ్ హామీ ఇచ్చారని ఎమ్పీ చెప్పారు.
 

మరిన్ని వార్తలు