సామాన్యుల సాయం

16 May, 2020 13:49 IST|Sakshi

కరోనా విజృంభించడంతో దాని వ్యాప్తిని కట్టడిచేయడానికి లాక్‌డౌన్‌ను విధించారు. దీంతో ఎంతో మంది వలస కార్మికులు, నిరుపేదలు, రోజువారి కూలీలు ఉపాధి కోల్పొయారు. ఉన్నచోట తిండి లేక, ఉపాధి కరువై భార్య పిల్లలతో నడిరోడ్డుపై పడ్డారు. ఒక్కపూట భోజనం దొరకక, సొంతగూటికి చేరే మార్గం లేక నలిగిపోతున్నారు. ఏం చేయాలో దిక్కు తోచక ఎవరైనా పట్టెడన్నం పెడతారేమో అని ఆశగా ఎదురుచూస్తున్నారు. అటువంటి వారిని ఆదుకునేందుకు ప్రభుత్వాలతోపాటు స్వచ్ఛంధ సంస్థలు, సామాన్యులు సైతం ముందు​కొచ్చి సాయం చేస్తున్నారు.

పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం సీతారాం పురం సౌత్ గ్రామ పంచాయతీకి చెందిన సుమారు 55-60 పేదకుటుంబాలకు, పేరు పాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడుగా  పని చేస్తున్న  యేలూరి శ్యామ్ బాబు,  ఎల్‌బీ చర్ల  గురుకుల పాఠశాల లో పీజీటీ గా పని చేస్తోన్న నల్లి సాయి బాబు కలిసి  నిత్యావసర వస్తువులైన వంట నూనె, పంచదార, వివిధ రకాల కూరగాయలు పంపిణీ  చేశారు. ఈ లాక్‌డౌన్‌ సమయంలో చాలా మంది రోజు వారీ  కూలీలు,పనులు లేక ఇబ్బందులు పడుతున్న వేళ వీటిని పంచిపెట్టడంఎంతో సంతోషంగా వుందని వారు చెప్పారు.

విశాఖపట్నంలో పేదలకు సాయం అందించాలనే ఉద్దేశంతో కొంత మంది స్నేహితులు ఒక వాట్సాప్‌ గ్రూప్‌ వ్యాల్యుబుల్‌ హార్ట్స్‌ని క్రియేట్‌ చేసి కొంత మొత్తం సేకరించి ప్రతి వారం కొంత మందికి సాయం చేస్తోన్నారు. తమకి తోచినంతలో పేదవారికి సాయం చేయడంలో ఎంతో తృప్తి ఉందని వారు తెలిపారు. చిన్నవారైనా పెద్దమనసుతో పేదలను ఆదుకుంటూ వారు ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తున్నారు.  

మీరు కూడా లాక్‌డౌన్‌ సమయంలో చేస్తోన్న సేవకార్యాక్రమాను సాక్షి.కామ్‌ ద్వారా నలుగురికి తెలియజేసి వారిలో స్ఫూర్తి నింపాలి అనుకుంటే మీ వివరాలను webeditor@sakshi.com పంపించండి. 

మరిన్ని వార్తలు