పొట్టి ముక్కు, పొడవాటి తోక

15 Jan, 2019 08:35 IST|Sakshi
కాకి నెమలి ఆంధ్ర

ఆకట్టుకునే కోవిల్‌పట్టి కోళ్లు

ఉన్నత కుటుంబాల్లో డాబు, దర్పానికి ప్రతీక

విశాఖపట్నం, తగరపువలస (భీమిలి): పౌరుషం చూపే పందెం కోళ్లే కాదు.. అందాలొలికే హైక్లాస్‌ కోళ్లు కూడా ఉంటాయి. కొన్ని ఉన్నత కుటుంబాలవారు తమ డాబు, దర్పం తెలియడం కోసం వీటిని ఇంటి ముందు కట్టి ఉంచుతారు. పోటీలకు వినియోగించే కోళ్లకు భిన్నంగా పొట్టి ముక్కు, పొడవాటి తోక, డబుల్‌ బాడీ కలిగి ఉండటం వీటి విశేషం. తమిళనాడులో సేలం, దిండిగల్‌ తరువాత కోవిల్‌పట్టి కోళ్లకు దేశవ్యాప్తంగా మంచి గిరాకీ ఉంటుంది. మిగతా ఏ జాతి కోళ్లతోనూ సంకరం కాని కోళ్లుగా వీటికి పేరుంది. తెలుగు రాష్ట్రాలలో అరుదుగా ఉండే ఈ కోవిల్‌పట్టి కోళ్లు పద్మనాభం మండలం రేవిడిలో ఔత్సాహిక కోళ్ల పెంపకందారుడు భూపతిరాజు రాజేష్‌ ఇంట దర్శనమిస్తాయి. ప్రస్తుతం రాజేష్‌ దొడ్లో అయిదు రకాల అరుదైన కోళ్లు ఉన్నాయి.

కాకి నెమలి
ఇందులో తెలుగు రాష్ట్రాలకు చెందినవి రూ.30 వేల వరకు ధర పలికితే, కోవిల్‌పట్టికి చెందిన పుంజులు రూ.40 వేల నుంచి చిట్టి ముక్కు, తోక పొడవును బట్టి రూ.1.50 లక్షల వరకు ఉంటాయి.

సేతువ కలర్‌ మేల్‌
డబుల్‌ బాడీ కలిగి పొట్టి ముక్కు పొడవాటి తోక కలిగిన ఈ జాతి పుంజు రూ.80 వేలు పలుకుతుంది. మనిషికి సిక్స్‌ ప్యాక్‌లా గుడ్‌ బాడీ స్టైల్‌ దీని స్వంతం. ఇది తెల్లగా ఉంటుంది. పూర్తిగా కోవిల్‌పట్టి లైనేజీ కలిగిన కుక్కుటం ఇది.

సేతువ కలర్‌ ఫిమేల్‌
అందాల పోటీలలో పాల్గొనే ఈ ఫిమేల్‌ పక్షులను నూరి అని కూడా  అంటారు. దీని అందం బట్టి వీటి ధర రూ.20 వేల నుంచి 40 వేల వరకు ఉంటుంది.

ఎర్ర కక్కెర
రూ.40 వేల విలువైన ఈ పుంజు కూడా పొడవైన తోక, పొట్టి ముక్కు కలిగి ఉంటుంది.

నల్ల కగర
తెలుగు రాష్ట్రాలలో లభించే నల్ల కగర భిన్నంగా ఉంటుంది. కోవిల్‌పట్టిలో దీని ధర రూ.20 వేల వరకు ఉంటుంది.

అరుదైన కోళ్ల సేకరణ హాబీ
నా దగ్గర రూ.20 వేల నుంచి రూ.లక్షన్నర విలువైన కోళ్లు ఉంటాయి. ఆన్‌లైన్‌లో పక్షుల జాతిని చూసి కొనుగోలు చేస్తుంటాను. కొన్ని నెలలు పెంచిన తరువాత వేరే వాటిని కొని వీటిని అమ్మేస్తుంటాను. ఇంతేసి డబ్బులు పెట్టి కొన్నవాటిని తినడానికి మనసొప్పదు. నా దగ్గర ఉన్న అరుదైన జాతి కోళ్లను చూడటానికి పక్క రాష్ట్రాల నుంచి కూడా వస్తుంటారు.–భూపతిరాజు రాజేష్, రేవిడి

మరిన్ని వార్తలు