అమ్మో... గజరాజులు!

22 Aug, 2019 08:30 IST|Sakshi
ఆర్తాం వద్ద రైల్వే ట్రాక్‌ దాటుతున్న ఏనుగుల గుంపు,గుణాణపురం పంట పొలాల్లో సంచరిస్తున్న ఏనుగులు 

గజరాజుల గుంపు కురుపాం నియోజకవర్గంలోకి అడుగిడి వచ్చే నెల సెప్టెంబర్‌ తొమ్మిదో తేదీ నాటికి ఏడాది కానుంది. ఈ ఏడాది కాలంలో అటు శ్రీకాకుళం, ఇటు విజయనగరం జిల్లాల్లో ఎక్కడికక్కడే పంటలకు నష్టం కలగజేస్తూ అన్నదాతను తీవ్రంగా నష్టపరుస్తూనే ఉన్నాయి. తాజాగా బుధవారం మరోసారి కొమరాడ మండలంలోకి ఏనుగులు ప్రవేశించాయి. ఫలితంగా రైతులు జిల్లా నుంచి వీటి తరలింపు ఎప్పటికి జరుగుతుందోనన్న భయాందోళనల నడుమ జీవిస్తున్నారు. ఓ వైపు ప్రకృతి సహకరించక... మరోవైపు గజరాజుల సంచారంతో తమ బతుకులు ఛిద్రమవుతున్నాయన్న ఆందోళన వ్యక్తమవుతోంది.

సాక్షి, కొమరాడ(విజయనగరం) : ఏనుగులు కురుపాం నియోజకవర్గంలోకి అడుగిడి ఏడాదవుతున్నా వీటిని తరలించే ప్రక్రియలో అధికారులు విఫలమయ్యారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కురుపాం నియోజకవర్గంలోకి వచ్చేటపుడు గుంపులో ఎనిమిది గజరాజులు ఉండగా రెండు మృత్యువాత పడగా మిగిలిన ఆరు ఏనుగులు ఈ ప్రాంతంలో సంచరిస్తూ అందరినీ భయాందోళనకు గురి చేస్తున్నాయి. ఇటీవల నెల రోజుల పాటు నాగావళి నదికి ఆవల వైపున్న ప్రాంతంలో సంచరించిన ఏనుగులు మంగళవారం రాత్రి నది దాటి కొమరాడ మండలం గుణానపురానికి వచ్చాయి. బుధవారం తెల్లవారిజామున ఆర్తాం వద్ద రైల్వేట్రాక్‌ దాటుకుంటూ అక్కడ అటవీ ప్రాంతంలోకి చొచ్చుకువెళ్లాయి. దీంతో ఈ ప్రాంత రైతాంగానికి పంటలకు ఎక్కడ నష్టం వాటిల్లుతుందోనన్న ఆందోళన నెలకొంది. 

కూరగాయల సాగే అధికం
కొమరాడ మండలంలోని గుణాణపురం, కళ్లికోట, దుగ్గి, గంగారేగువలస, కుమ్మరిగుంట, కందివలస తదితర గ్రామాల్లో కూరగాయాలు సాగు జిల్లాలోనే మూడో స్థానంలో ఉంది. దీంతో ఈ ప్రాంత రైతులు ఎక్కడ పంటలకు నష్టం చేకూరుతుందోనని ఆందోళన చెందుతున్నారు. ఈ ప్రాంతంలో ఎక్కువగా చిక్కుడు, కాకర, వంగ, ఆనప, బొప్పాయి, టమాట, జామ పంటలు సాగులో ఉన్నాయి. ఇక్కడ పండే కూరగాయలు ఒడిశా రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు వెళ్తాయి. మంచి సాగులో ప్రస్తుతం పంటలు ఉండగా ఏనుగులు ఇక్కడకు ప్రవేశించడంతో సర్వత్రా ఆందోళన నెలకొంది.

పరిష్కారం దొరికేనా...!
ఏనుగుల గుంపును తరలించేందుకు అటవీ శాఖ అధికారులు తమ వంతు ప్రయత్నాలు ఎప్పటి నుంచి చేస్తూనే ఉన్న సఫలీకృతం కావడం లేదు. పార్వతీపురం మండలం డోకిశీల పంచాయతీ పరిధిలోని జంతికొండ అటవీ ప్రాంతంలో 512 హెక్టార్ల పరిధిలో ఎలిఫెంట్‌ జోన్‌ ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి. దీనికి కేంద్ర ప్రభుత్వం అనుమతులు రావాల్సి ఉందని అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు. ఆ ప్రాంతంలో ఎలిఫెంట్‌ జోన్‌ వద్దంటూ ప్రజా సంఘాలు, ప్రజలు వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నారు.

అయినా ఆ ప్రాంతం దట్టమైన అటవీ ప్రాంతం కావడంతో ఎలిఫెంట్‌ జోన్‌ వల్ల ఈ ప్రాంత ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు ఉండవని భావిస్తున్నారు. ఇందుకోసం అటవీ ప్రాంతమంతా ఓ ర్యాంపు తయారు చేసి లోపలికి ఎవరిని వెళ్లనీయకుండా ఏనుగులకు కావాల్సిన నీరు, ఆహారంతో పాటు కావాల్సిన వసతులు కల్పించాలని అధికారులు భావిస్తున్నారు. దీంతో ప్రజలకు ఎటువంటి నష్టం జరగదని, ఏనుగుల బెడద కూడా తప్పుతుందని అటవీ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఈ పరిస్థితుల్లో ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందే..! 

>
మరిన్ని వార్తలు