రిజిస్ట్రేషన్ లేకుండా.. వారసత్వం

11 Aug, 2015 02:24 IST|Sakshi
రిజిస్ట్రేషన్ లేకుండా.. వారసత్వం

* త్వరలో చట్టం తీసుకొస్తామని సీఎం చంద్రబాబు వెల్లడి
* విశాఖలో ‘మీ ఇంటికి మీ భూమి’ ప్రారంభం

సాక్షి, విశాఖపట్నం: తండ్రి సంపాదించిన భూమిని పిల్లలు రిజిస్ట్రేషన్ లేకుండా వారసత్వంగా పొందేలా చట్టం తీసుకొస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. రాష్ర్ట ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన ‘మీ ఇంటికి-మీ భూమి’ కార్యక్రమాన్ని సోమవారం అనకాపల్లి సమీపంలోని శంకరంలో ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో సీఎం మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఇంటి నుంచే తమ భూమి వివరాలను తెలుసుకునే అవకాశాన్ని ‘మీ ఇంటికి మీ భూమి’ ద్వారా కల్పిస్తున్నట్టు చెప్పారు.

రాష్ర్టంలో 2.24 కోట్ల సర్వే నంబర్లుండగా..72 లక్షల మంది పట్టాదారులున్నారని చెప్పారు. వీరికి చెందిన భూమి వివరాలు సేకరించి మీ భూమి వెబ్‌సైట్‌లో పొందుపరిచేందుకు ఈ నెలాఖరు వరకు అధికారులు సర్వే చేస్తారని తెలిపారు. రిజిస్ట్రేషన్లలో అక్రమాలకు చెక్ పెట్టేందుకు ఆధార్‌తో రెవెన్యూ రికార్డుల అనుసంధానం చేపట్టామన్నారు. తెల్లరేషన్‌కార్డునే ఆదాయ ధ్రువీకరణపత్రంగా చూపించవచ్చని, ఆధార్‌కార్డులుంటే నివాస, కుల, జనన ధ్రువీకరణ పత్రాలు అవసరం లేదన్నారు. విశాఖలో నల్లబెల్లంపై దీర్ఘకాలంగా ఉన్న నిషేధం ఎత్తివేత విషయంలో నిబంధనలు సడలిస్తామన్నారు. ఈ సందర్భంగా ‘మీ ఇంటికి- మీ భూమి’ వెబ్‌సైట్‌ను సీఎం ప్రారంభించారు.
 
విభజన హామీలు నిలబెట్టుకోండి..
విభజన నేపథ్యంలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి సీఎం విజ్ఞప్తి చేశారు. ఏపీకి కనీసం ఐదేళ్ల పాటైనా ప్రత్యేక హోదా ఇవ్వాలన్నారు. విభజన హామీల విషయంలో కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు త్వరలో ప్రధానితో సహా కేంద్ర మంత్రులందరినీ కలుస్తామని చెప్పారు.
 
ఆశా వర్కర్ల నిరసన..: వేదిక వద్ద ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను సీఎం ప్రారంభించే సమయంలో ఆశా వర్కర్లు నిరసన వ్యక్తం చేశారు. తమ జీతాలు పెంచాలని.. వేతన బకాయిలు వెంటనే చెల్లించాలని వినతిపత్రమిచ్చేందుకు వచ్చిన ఆశా వర్కర్లను పోలీసులు అనుమతించలేదు. దీంతో స్టాల్స్ ప్రారంభించే సమయంలో సీఎం ఎదుట వారు పెద్దపెట్టున నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. నినాదాలు చేయొద్దు.. మీలో ఎవరైనా వచ్చి వినతి పత్రమివ్వండని మంత్రులు సూచించడంతో నాయకులు వచ్చి సమస్యలు తెలపగా సీఎం వినతిపత్రం తీసుకుని పరిశీలిస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో రాష్ర్ట మంత్రులు అయ్యన్నపాత్రుడు, గంటా, ఎంపీ ముత్తంశెట్టి శ్రీనివాసరావు, జడ్పీ చైర్‌పర్సన్ భవానీ, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా