మెగాస్టార్‌ను ఇక్కడికి తీసుకొస్తా: రామ్‌ చరణ్‌

30 Aug, 2019 10:57 IST|Sakshi
మాట్లాడుతున్న రామ్‌చరణ్‌ 

సాహో, సైరా ట్రైలర్లు అద్భుతం

హీరో రామ్‌చరణ్‌

సాక్షి, సూళ్లూరుపేట(నెల్లూరు): సాహో, సైరా ట్రైలర్లు అద్భుతంగా ఉన్నాయని, ఇలాంటి సినిమాలను భారీ స్క్రీన్లపై చూస్తే మరపురాని అనుభూతి కలుగుతుందని మెగా హీరో రామ్‌చరణ్‌ పేర్కొన్నారు. యూవీ ఆర్ట్‌ క్రియేషన్స్‌ అధినేతలు నిర్మించిన వీ సెల్యులాయిడ్‌ గ్రూప్‌ మల్టీఫ్లెక్స్‌ థియేటర్లను గురువారం ప్రారంభించారు. దక్షిణాసియా, ఇండియాలో తొలిసారిగా భారీ స్క్రీన్‌ను ఈ థియేటర్లలో ఏర్పాటు చేశారు. ప్రారంభం సందర్భంగా సాహో, సైరా ట్రైలర్లను ప్రదర్శించారు. వెంకటగిరి, సర్వేపల్లి ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణరెడ్డి, కాకాణి గోవర్ధన్‌రెడ్డి ప్రారంభించారు.అనంతరం రామ్‌చరణ్‌ రెండు సినిమాల ట్రైలర్లను వీక్షించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. అక్టోబర్‌లో విడుదల కానున్న సైరా సరసింహారెడ్డి సినిమాకు మెగాస్టార్‌ చిరంజీవిని ఇక్కడికి తీసుకొస్తానని అభిమానులకు హామీ ఇచ్చారు.

వీ సెల్యులాయిడ్‌ గ్రూప్‌ థియేటర్లను సాంకేతిక విలువలతో నిర్మించడం విశేషమన్నారు. ఇలాంటి సాంకేతిక విలువలు కలిగిన స్క్రీన్‌ అన్నా, ఇలాంటి వాటిని ప్రోత్సహించే విషయంలో ఎప్పుడూ ముందుండే గుణం చిరంజీవిలో ఎక్కువగా ఉందని, ఈ క్రమంలో తాను, ఎన్వీ ప్రసాద్‌ ఆయన్ను ఇక్కడికి తీసుకొస్తామని తెలిపారు.  

సాహో సినిమాను డైరెక్టర్‌ సుజిత్‌ ఎంతో సాంకేతిక విలువలతో తీశారని, ఈ సినిమాలో హీరో ప్రభాస్‌ను ఎంతో స్టయిలిష్‌గా చూపించారని తెలిపారు. బాహుబలి తర్వాత ప్రభాస్‌తో సాహో సినిమాను అత్యంత భారీ సాంకేతిక విలువలతో తీసి ఉంటారని ట్రైలర్‌ను చూస్తుంటే అర్థమవుతోందని పేర్కొన్నారు. అతి పెద్ద భారీస్క్రీన్‌ కలిగిన వీ సెల్యులాయిడ్‌ గ్రూప్‌ థియేటర్లను నిర్మించిన యూవీ ఆర్ట్‌ క్రియేషన్స్‌ అధినేతలు వేమారెడ్డి వంశీకృష్ణారెడ్డి, వేమారెడ్డి విక్రమ్‌ శ్రీనివాస్‌రెడ్డిని అభినందించారు.  

మరిన్ని వార్తలు