ఇది మూడోసారి

23 Mar, 2015 04:06 IST|Sakshi
ఇది మూడోసారి

 శ్రీకాకుళం కల్చరల్: ప్రముఖ సినీనటుడు, హీరో సుమన్ ఆదివారం ఆదిత్యుని దర్శించుకున్నారు. తొలిత ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. పండితులు అనివెట్టి మండపంలో సుమన్‌కు మహాదాశీర్వచనం చేసి ప్రసాదం అందించారు. ఈ సందర్భంగా సుమన్ విలేకరులతో మాట్లాడారు. జిల్లాకు రావడం ఇది మూడోసారని అన్నారు. ఈ ప్రాంతంలో షూటింగ్‌లు జరగనందున రావడం లేదని పేర్కొన్నారు. అరసవల్లి సూర్యనారాయణస్వామి, లక్ష్మీనరసింహుని వేషం వేస్తానని చెప్పారు.
 
 బీసీల సంక్షేమం కోసం పోరాడుతానని అన్నారు. బీసీలకు ప్రభుత్వం లో సరైన ప్రాతినిధ్యం కల్పించాలని సుమన్ కోరారు. దర్శకత్వంపై నాకు ఆసక్తి లేదని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. సినీ పరిశ్రమ ఇప్పట్లో విశాఖకు వచ్చే అవకాశం లేదు.. చెన్నై నుంచి వచ్చేందుకు చాలా ఏళ్లు పట్టింది.. అప్పట్లో ప్రభుత్వం భూములు తక్కువ ధరకు అందించింది.. నేడు భూముల ధరలు విపరీతంగా ఉన్నాయని సుమన్ పేర్కొన్నారు. తాను 37 ఏళ్లుగా సినీపరిశ్రమంలో ఉన్నట్టు చెప్పారు. క్రిష్ దర్శకత్వంలో 5 భాషలలో నిర్మిస్తున్న గబ్బర్ సినిమాలో విలన్‌గా నటిస్తున్నానని వెల్లడించారు.  
 
 పోటెత్తిన భక్తులు
 ఆదిత్యుని దర్శించేందుకు ఆదివారం భక్తులు పోటెత్తారు. ఆదివారం సూర్యనారాయణస్వామికి ప్రీతి అయిన రోజు కావడంతో స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు తరలొచ్చారు. తెల్లవారి జామున 5 గంటల నుండే ఆలయం వద్ద బారులు తీరారు. రావిచెట్టుకు, గోశాలకు ప్రత్యేక పూజలు చేసి, దీపాలు వెలిగించారు. భక్తులకు ఇబ్బంది కలగకుండా దేవస్థానం ఇన్‌చార్జ్ ఈవో ఆర్.పుష్పనాథం ఏర్పాట్లను పర్యవేక్షించారు. సూర్యదేవాలయం ఇంద్రపుష్కరిణి వద్ద భక్తులు స్నానాలు ఆచరించారు. భక్తుల కోసం అన్నదానం ఏర్పాటు చేశారు.  
 

మరిన్ని వార్తలు