హీరో తన కొడుకును హీరోనే చేయాలనుకుంటున్నాడు

8 Jul, 2018 20:20 IST|Sakshi

సాక్షి, కృష్ణా : యలమంచిలి శివాజీ రచించిన ‘ఆరుగాలం’ , బ్రహ్మ శ్రీ పోలూరి హనుమజ్జానకీరామ శర్మ రాసిన ‘జీవితము-సాహిత్యము’ అనే పుస్తకాలను ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆదివారం ఆవిష్కరించారు. తనకు ఎప్పుడూ ప్రజల మధ్యనే ఉండటం ఇష్టమని ఆయన అన్నారు. యలమంచిలి ఓ అలుపెరగని యోధుడని చెప్పారు. దురదృష్టవశాత్తు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత వ్యవసాయానికి కావాల్సినంత ప్రాధాన్యత లభించలేదని అన్నారు. తాను ఏ రాజకీయ పార్టీని విమర్శించనని చెప్పారు.

అది తన పని కూడా కాదని అన్నారు. రైతుని రక్షించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని గుర్తు చేశారు. ఎన్ని కష్టాలు అనుభవిస్తున్నా భారత రైతులు పంటలు పండిస్తున్నారని, అందుకు భారత రైతులకు సెల్యూట్ చేయాలన్నారు.

‘ఓ రాజకీయ నాయకుడు తన తనయుడికి మాట్లాడటం రాకపోయినా, అతన్ని రాజకీయ నాయకుడిగా మార్చాలని ప్రయత్నిస్తున్నాడు. సినిమా నటుడు అతని తనయుడికి ముఖం బాగా లేకపోయినా హీరోని చేయాలనుకుంటున్నాడు. కానీ ఒక రైతు తన కొడుకును రైతుగా చేయాలనుకోవట్లేదు. అలాంటి పరిస్థితులు వ్యవసాయంలో నెలకొన్నాయి.

నేను ఉపరాష్ట్రపతి అయ్యాక నియమ నిబంధల ప్రకారం ప్రజల్లో ఉండలేకపోతున్నాను. అందుకని ఆ నియమ నిబంధనలను కొంత సవరించాను. మూడు కార్యక్రమాలను నిర్ణయించుకున్నాను. ఒకటి దేశ యూనివర్శిటీలన్నీ తిరిగి యువతకి మార్గదర్శకం చేయాలి. సైన్స్ అండ్ టెక్నాలజీ పరిశోధనా కార్యాలయాలకు వెళ్లి పరిశీలించి ప్రోత్సహించాలి. వ్యవసాయదారులని కలవటం, లాభసాటి విధానంపై దృష్టి సారించాలి.’

మరిన్ని వార్తలు