హై అలెర్ట్ !

3 Dec, 2014 01:51 IST|Sakshi
హై అలెర్ట్ !

 సాక్షి ప్రతినిధి, విజయనగరం : మావోయిస్టుల వారోత్సవాలు, ఛత్తీస్‌గఢ్ ఘటన నేపథ్యంలో జిల్లా పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది. ఏపీఎస్‌పీ వైజాగ్ న్యూ బెటాలియన్‌కు చెందిన రెండు కౌంటర్  ఏక్షన్ టీమ్‌లను రంగంలోకి దింపింది. ప్రజాప్రతినిధులకు భద్ర త పెంచింది. ఏజెన్సీ పోలీసు స్టేషన్‌ల వద్ద బందోబస్తు పటిష్టం చేసింది. అటు ప్రజా ప్రతినిధులను, ఇటు అధికారులను అప్రమత్తం చేసింది. సమాచారం లేకుండా ఏజెన్సీలో పర్యటించొద్దని హెచ్చరించింది. పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని అంతా సహకరించాలని విజ్ఞప్తి చేసింది. సానుభూతిపరుల కదలికలపై నిఘా పెట్టింది.   మావోయిస్టులు అదునుచూసి దాడిచేసే అవకాశం ఉందని ఇప్పటికే  పోలీసు వర్గాల వద్ద సమాచారం ఉన్నట్టు తెలిసింది.
 
  ఏజెన్సీలో మావోయిస్టుల వారోత్సవాలు ప్రారం భమయ్యాయి. ఈనెల 8వ తేదీవరకు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో మావోయిస్టులు తమ ఉనికి చాటుకునే ప్రయత్నంలో ఉన్నారని సమాచారం. ఇన్నాళ్లూ మావోయిస్టులు స్థబ్ధుగా ఉండడంతో  పోలీసులదే పైచేయిగా కనబడుతోంది. కొన్ని దళాలు సంచరిస్తున్నా వాటిలో ఒక్కొక్కరు లొంగిపోతుండడంతో  ఏజెన్సీలో మావోయిస్టుల ప్రాబల్యం తగ్గిపోయిందని పోలీసు వర్గాలు భావిస్తున్నాయి. అయితే, మావోయిస్టు వర్గాలు ఈ వాదనను ఖండిస్తున్నాయి. తమ బలం తగ్గిపోలేదని,  తమ సత్తా చాటుతామని హెచ్చరిస్తున్నాయి.  అందుకు తగ్గట్టుగా పొరుగు రాష్ట్రమైన ఛత్తీస్‌గఢ్‌లో చెలరేగిపోయారు. సీఆర్‌పీఎఫ్ సాయుధ దళాలపై  దాడి చేసి 14 మందిని పొట్టనపెట్టుకున్నారు. తమ బలం తగ్గలేదని చెప్పకనే చెప్పారు. దీంతో పోలీస్ యంత్రాంగం ఉలిక్కిపడింది.  వెంటనే అప్రమత్తమయింది. ఏజెన్సీలోని పోలీసు స్టేషన్లతో పాటు ప్రజాప్రతినిధులను, అధికారులను అప్రమత్తం చేసింది.  
 
 ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ, జెడ్పీ చైర్‌పర్సన్‌లకు నిబంధలన ప్రకారం 2+2గన్‌మెన్‌ల చొప్పున సెక్యూరిటీ ఉండాలి.  కొంతమంది 1+1సెక్యూరిటీ ఉంచుకుని మిగతా వారిని వెనక్కి ఇచ్చేశారు. మరికొంతమంది 2+2సెక్యూరిటీని కొనసాగిస్తున్నారు. 2+2సెక్యూరిటీ ఉన్నట్టయితే ఇందులో చెరో ఇద్దరికి 15రోజుల ఆఫ్ ఉంటుంది. మిగతా ఇద్దరు షిఫ్ట్‌ల ప్రకారం విధులు నిర్వహిస్తారు. దీనివల్ల ఒకే ఒక గన్‌మెన్ ఉంటారు. అయితే, మావోయిస్టుల వారోత్సవాలు, ఛత్తీస్‌గఢ్ ఘటన నేపథ్యంలో 1+1గన్‌మెన్‌లున్నచోట 2+2సెక్యూరిటీ ని పునరుద్ధరించారు. అంతేకాకుండా ఆ నలుగురూ  ఆఫ్‌లు లేకుండా పనిచేయాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. ఇప్పటికే 2+2గన్‌మెన్‌లుంటే ఆ నలుగురూ ఆఫ్ లేకుండా ప్రజాప్రతినిధి భద్రత చూసుకోవాలని ఉత్తర్వులు జారీ చేశారు. అంటే రౌండ్ ది క్లాక్ డ్యూటీలు చేయాలని సూచించారు. ఒకవైపు గన్‌మెన్‌ల భద్రత పెంచుతూనే మరోవైపు ప్రజాప్రతినిధులకు పలు సూచన, సలహాలు ఇచ్చారు. సమాచారం లేకుండా ఏజెన్సీలో పర్యటించొద్దని సూచించారు.
 
 సమాచారం ఇచ్చినట్టయితే భద్రత కల్పిస్తామని, సాధ్యమైనంతవరకు ఏజెన్సీ శివారు ప్రాంతాల పర్యటనను విరమించుకోవాలని తెలిపారు. అధికారులకు సైతం ఇదే తరహా సూచనలు చేశారు.  దీంతో ప్రజాప్రతినిధులు, అధికారులు అప్రమత్తమయ్యారు. పోలీసులకు తెలియకుండా ఏజెన్సీ శివారు ప్రాంతాలకు వెళ్లే ప్రయత్నం చేయడం లేదు.  అలాగే ఏజెన్సీలోని పోలీసుస్టేషన్ల సిబ్బందిని అప్రమత్తం చేశారు.  ప్రస్తుతం సంచరిస్తున్న మావోయిస్టులపై ప్రత్యేక దృష్టిసారించారు. ఒకవైపు కూంబింగ్ పెంచుతూనే మరోవైపు మావోయిస్టుల సానుభూతిపరులు, అనుమానితులపై నిఘా పెట్టారు.  తనిఖీలు కూడా ముమ్మరం చేశారు.  కొమరాడ, పార్వతీపురం ప్రాంతాల్లో కౌంటర్ ఏక్షన్ టీమ్‌లు రంగంలోకి దిగాయి. ఎలాంటి ఘటనలైనా తిప్పికొట్టేలా సన్నద్ధమయ్యారు. మొత్తానికి అటు మావోయిస్టుల కవ్వింపు చర్యలు, ఇటు పోలీసుల తనిఖీలతో ఏజెన్సీ గ్రామాలు వణుకుతున్నాయి.  
 

మరిన్ని వార్తలు