హైబీపీనా... నోటెన్షన్

5 Sep, 2013 01:48 IST|Sakshi
  • తేలికపాటి శస్త్ర చికిత్సతో బీపీకి  చెక్
  •  రక్తపోటు పెంచే ‘కరోటిడ్’ అవయవాల గుర్తింపు  
  •   వాటిని తొలగిస్తే.. నియంత్రణలోకి రక్తపోటు
  •  ఎలుకలపై ప్రయోగం విజయవంతం    
  •  మూడేళ్లలోగా అందుబాటులోకి
  •  మీరు ‘అధిక రక్తపోటు (హైపర్‌టెన్షన్)’తో బాధపడుతున్నారా? ఎన్ని మందులు వాడుతున్నా రక్తపోటు నియంత్రణలో ఉండడం లేదా? మీలాంటి వారికి ఓ శుభవార్త. ‘అధిక రక్తపోటు’ను శాశ్వతంగా నియంత్రణలో ఉంచే సరికొత్త చికిత్సా విధానం అందుబాటులోకి రానుంది. ‘అధిక రక్తపోటు’కు కారణమైన ‘కరోటిడ్’ అవయవాలను బ్రిటన్ శాస్త్రవేత్తలు గుర్తించారు. గుండె నుంచి మెదడుకు రక్తాన్ని తీసుకువెళ్లే రక్తనాళాలపై బియ్యపు గింజ పరిమాణంలో ఉండే ఈ రెండు అతిచిన్న అవయవాలను తొలగిస్తే.. ‘రక్తపోటు’ నియంత్రణలో వస్తుందని వారు చెబుతున్నారు. ఇప్పటికే ప్రయోగశాలలో ఎలుకలపై విజయవంతమైన ఈ చికిత్సను.. 20 మంది మనుషులపై ప్రయోగించి  పరిశీలిస్తున్నారు. మూడేళ్లలోగా ఈ చికిత్స అందుబాటులోకి వచ్చే అవకాశముందని చెబుతున్నారు.
     
     ‘కరోటిడ్’ రక్తనాళాలపై బియ్యపు గింజ పరిమాణంలో ఉండే రెండు అతిచిన్న అవయవాలు ‘అధిక రక్తపోటు’కు కారణమవుతున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. దవడల కింద, గొంతుకు రెండు వైపులా ఉండే ఈ అవయవాల్లో కొన్ని నాడులు కలిసి క్లస్టర్‌గా ఏర్పడి ఉంటాయి. వీటి ద్వారా ఎక్కువ రక్తం ప్రవహిస్తూ ఉంటుంది. ఇవి రక్తంలోని ఆక్సిజన్, కార్బన్‌డయాక్సైడ్‌ల స్థాయిని పరిశీలిస్తూ మెదడుకు సంకేతాలు పంపుతుంటాయి. అయితే ఒక్కోసారి ఈ ‘కరోటిడ్’ అవయవాలు ఆక్సిజన్, కార్బన్‌డయాక్సైడ్‌ల స్థాయిపై మెదడుకు తప్పుడు సంకేతాలను పంపుతున్నట్లుగా గుర్తించినట్లు పరిశోధనకు నేతృత్వం వహించిన ప్రొఫెసర్ జూలియన్ పాటన్ చెప్పారు. ఈ తప్పుడు సంకేతాల కారణంగా మెదడు శరీరంలో రక్తపోటును అధిక స్థాయిలో ఉంచేలా ఆదేశిస్తుందని తెలిపారు. తొలుత రెండు ‘కరోటిడ్’ అవయవాల్లో ఒకదానిని మాత్రమే తొలగించి పరిశోధన చేస్తున్నామన్నారు.  మందులు, జీవన విధానంలో మార్పులతో రక్తపోటు నియంత్రణలోకి రానివారికి ఒక చిన్న శస్త్ర చికిత్స ద్వారా ‘కరోటిడ్’ అవయవాలను తొలగిస్తే చాలు అని జూలియన్ పేర్కొన్నారు.

>
మరిన్ని వార్తలు