మాకేంటి?

12 Jul, 2015 02:08 IST|Sakshi
మాకేంటి?

- నాలుగున్నర లక్షలతో రోడ్డు వేస్తున్నావ్. నాలుగు వేలు ఇస్తే ఎలా? ఫైవ్ పర్సంట్ ఇవ్వాల్సిందే. లేదంటే రోడ్డు పనులు జరగనీయను.
     (కాంట్రాక్టర్‌కు ఓ అధికార పార్టీ కార్పొరేటర్ బెదిరింపు)
- స్టాండింగ్ కమిటీ అంటే ఎంతో కొంత అందుతుంది
- అనుకున్నాం. ఏడాది కావొస్తుంది ఒక్క రూపాయీ రాలేదు. అజెండాలోని తీర్మానాలను తల ఊపి వచ్చేందుకే ఈ పదవి ఉన్నట్లుంది. అబ్బే ఇదేం బాగోలా. స్టాండింగ్ కమిటీ చైర్మన్ నేనైతే ఇలా ఉండేది కాదబ్బా.
     (స్టాండింగ్ కమిటీ సభ్యురాలి అభిప్రాయం..)
 
- టీడీపీలో కాసుల గోల
- ఏడాదైనా రూపాయి సంపాదన లేదంటున్న కార్పొరేటర్లు
- మేయర్‌కు తలనొప్పి
- అభివృద్ధి పనులకు అడ్డంకి
ఇలా.. టీడీపీలో కాసుల గోల మొదలైంది. పైసల కోసం అధికార పార్టీ కార్పొరేటర్లు రోడ్డెక్కుతున్నారు. నగరాభివృద్ధికి అడ్డుపడుతూ పంచాయితీలు పెడుతున్నారు. పాలన ఆరంభించి ఏడాది పూర్తయినా పైసా ముట్టలేదని కొందరు బహిరంగంగానే విమర్శిస్తుండగా.. ఈ పంచాయితీలను పరిష్కరించలేక మేయర్ తలపట్టుకుంటున్నారు.
 
విజయవాడ సెంట్రల్ :
నగరపాలక సంస్థలో అధికార పార్టీ కార్పొరేటర్లు కొందరు పైసలే పరమావధిగా అందినకాడికి దండుకుంటుంటే.. మరి కొందరు చేతికేమి అందక లబోదిబోమంటున్నారు. ‘లక్షలు ఖర్చుచేసి అధికారంలోకి వచ్చాం. కనీసం వాటినైనా సంపాదించుకోకపోతే ఎలా?’ అనే ధోరణి ప్రదర్శిస్తున్నారు. ఇందులో భాగంగానే టౌన్‌ప్లానింగ్‌ను అడ్డం పెట్టుకుని నలుగురు కార్పొరేటర్లు దందా చెలాయిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అభివృద్ధి పనుల్లోనూ పర్సంటేజ్‌ల కోసం చేయి చాస్తుండటంతో వసూళ్ల గుట్టురట్టవుతోంది.

కార్పొరేషన్‌లో రోడ్లు, డ్రెయిన్ల నిర్మాణానికి రూ.30 కోట్లు కేటాయించారు. వీటితో 59 డివిజన్లలో 300 పనులు చేపట్టారు. ప్రస్తుతం అవి నిర్మాణ దశలో ఉన్నాయి. పర్సంటేజ్ విషయంలో తేడా రావడంతో ఓ కార్పొరేటర్ రోడ్డు పనులు నిలుపుదల చేయాల్సిందిగా కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. సంబంధిత అధికారి చెబితే కానీ తాను నిలుపుదల చేయనని కాంట్రాక్టర్ స్పష్టం చేశారు. ఈ సమాధానానికి ఫీలైన సదరు కార్పొరేటర్ మేయర్ కోనేరు శ్రీధర్ వద్ద పంచాయితీ పెట్టినట్లు తెలిసింది. అభివృద్ధి పనులు జరగనివ్వాలని, వ్యక్తిగత స్వార్థంతో అడ్డుకుంటే ప్రజల్లో చెడ్డపేరు వస్తుందని మేయర్ ఆ కార్పొరేటర్‌కు హితవు చెప్పినట్టు భోగట్టా. ఈ విషయం బయటకు పొక్కడంతో ఇదే ధోరణి ప్రదర్శిద్దామనుకుంటున్న మరికొందరు కార్పొరేటర్లు వెనక్కు తగ్గినట్టు తెలుస్తోంది.
 
పట్టించుకోకపోతే ఎలా..
ఆశించిన స్థాయిలో ఆదాయం రాకపోవడంతో కొందరు కార్పొరేటర్లు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ నేపథ్యంలో స్టాండింగ్ కమిటీ చైర్మన్ పదవినే ఓ మహిళా కార్పొరేటర్ టార్గెట్ చేశారనే ప్రచారం జరుగుతోంది. నిబంధనల ప్రకారం మేయరే స్టాండింగ్ కమిటీకి చైర్మన్‌గా వ్యవహరించాలి. ప్రస్తుతం అదే విధానం కొనసాగుతోంది. నిబంధనలపై అవగాహన లేని ఆ కార్పొరేటర్ రూ.25 లక్షలు ఖర్చు చేసైనా స్టాండింగ్ కమిటీ చైర్మన్ అవుతా.. అనడంతో తోటి కార్పొరేటర్లు ఆశ్చర్యపోయారు.

భవానీపురం మహ్మదీయ కో-ఆపరేటివ్ సొసైటీ (దర్గా భూములు), శ్రీకనకదుర్గా లే అవుట్ వ్యవహారంలో కొందరు కార్పొరేటర్లకే మేయర్ ఆర్థిక లబ్ధి చేకూర్చేందుకు ప్రయత్నించారన్నది అసమ్మతి కార్పొరేటర్ల ఆరోపణ. భారీ డీల్స్ చేసినప్పుడైనా తమను పట్టించుకోకపోతే ఎలా? అని వారు వాపోతున్నారు. స్టాండింగ్ కమిటీ నిర్ణయాల్లో సైతం తమను డమ్మీలను చేసి మేయరే కథ నడిపించేస్తున్నారని కార్పొరేటర్ ఒకరు విమర్శలు గుప్పిస్తున్నారు.
 
పదవులపై కన్ను
ఏడాది పాలన పూర్తవడంతో ఆశావహులు కొందరు పదవులపై కన్నేశారు. డెప్యూటీ మేయర్, ఫ్లోర్‌లీడర్, స్టాండింగ్ కమిటీ సభ్యులుగా అవకాశాలను దక్కించుకునేందుకు పొలిటికల్ గాడ్‌ఫాదర్స్‌ను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. తూర్పు నియోజకవర్గానికి మేయర్, సెంట్రల్‌కు డెప్యూటీ మేయర్, పశ్చిమకు ఫ్లోర్‌లీడర్ పదవుల్ని గతంలో కేటాయించారు.

మేయర్‌ను ఇప్పట్లో మార్చే ఆలోచనలో అధిష్టానం లేదని సమాచారం. దీంతో మిగిలిన పదవుల్ని దక్కించుకోవడం కోసం కార్పొరేటర్లు ప్రయత్నాలను ముమ్మరం చేశారు. 44వ డివిజన్‌కు చెందిన కాకు మల్లిఖార్జున యాదవ్ డెప్యూటీ మేయర్, 28వ డివిజన్‌కు చెందిన యదుపాటి రామయ్య ఫ్లోర్‌లీడర్ పదవుల్ని ఆశిస్తున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. మల్లిఖార్జున యాదవ్ మూడు నియోజకవర్గాల నుంచి కార్పొరేటర్ల మద్దతు కూడగడుతున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రజాసమస్యల పరిష్కారం మాటెలా ఉన్నా అధికార పార్టీ కార్పొరేటర్లు కాసులు, పదవులపై దృష్టిసారించడం హాట్ టాపిక్‌గా మారింది.

మరిన్ని వార్తలు