గురజాల కోర్టు తీర్పును రద్దు చేసిన హైకోర్టు

18 Sep, 2019 12:57 IST|Sakshi

నలుగురికి మరణశిక్ష రద్దు

సాక్షి, అమరావతి: ఓ వ్యక్తి హత్య కేసులో నలుగురికి మరణశిక్ష విధిస్తూ 2018లో గుంటూరు జిల్లా, గురజాల పదో అదనపు జిల్లా కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు రద్దు చేసింది. ఆ నలుగురు నిర్దోషులని ప్రకటించింది. ఇతర ఏవైనా కేసుల్లో  వీళ్ల అవసరం లేకుంటే, వారిని వెంటనే విడుదల చేయాలని  ఆదేశించింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్‌ చాగరి ప్రవీణ్‌కుమార్, న్యాయమూర్తి జస్టిస్‌ మల్లవోలు సత్యనారాయణమూర్తిలతో కూడిన ధర్మాసనం ఇటీవల తీర్పునిచ్చింది.

కాలిబాటకు సంబంధించిన వివాదంలో గుంటూరు జిల్లా, తంగేడ గ్రామానికి చెందిన సైదా అనే వ్యక్తిని అదే గ్రామానికి చెందిన గాదెరిపల్లె సుభాని, పెదజాన్, మౌలాలి, మహ్మద్‌ కత్తితో పొడిచి చంపారన్న ఆరోపణలపై దాచేపల్లి పోలీసులు 2011లో కేసు నమోదు చేశారు. 2012లో చార్జిషీట్‌ దాఖలు చేశారు. విచారణ జరిపిన గురజాల పదో అదనపు జిల్లా, సెషన్స్‌ కోర్టు.. సుభాని తదితరులు సైదాను హత్య చేశారని నిర్ధారిస్తూ 2018లో మరణశిక్ష విధించింది. అదే సమయంలో మరణశిక్ష పడ్డ దోషులు నలుగురు కింది కోర్టు తీర్పును సవాలు చేస్తూ హైకోర్టులో అప్పీళ్లు దాఖలు చేశారు.

పిటిషనర్ల తరఫు న్యాయవాది కె.సురేశ్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. హతుడిని ఈ నలుగురు వ్యక్తులు చంపుతుండగా చూసిన ప్రత్యక్ష సాక్షులు ఎవరూ లేరన్నారు. అరుదైన, హేయమైన కేసుల్లోనే మరణశిక్ష విధిస్తారని నివేదించారు. పోలీసుల తరఫున పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ కె.శ్రీనివాస్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ఈ కేసు మరణశిక్ష విధించదగ్గ కేసు కాదని తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం మృతుడు సైదాతో ఆ నలుగురు వ్యక్తులకు ఏవో వివాదాలు ఉన్నంత మాత్రాన అతనిని వారే హత్య చేశారని చెప్పడానికి ఏ మాత్రం వీల్లేదంది. గురజాల కోర్టు ఇచ్చిన తీర్పును రద్దు చేస్తున్నట్లు పేర్కొంది.  

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా