ఆదేశాలను అపహాస్యం చేస్తారా?

23 Jan, 2018 01:41 IST|Sakshi

     ఏపీ సీఎస్, డీజీపీలపై హైకోర్టు ఆగ్రహం 

     కోడి పందేలను ప్రపంచమంతా చూసింది 

     29న హాజరై వివరణ ఇవ్వాలని స్పష్టీకరణ  

సాక్షి, హైదరాబాద్‌: ఈ ఏడాది సంక్రాంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కడా కోడి పందేలు జరగడానికి వీల్లేదంటూ తాము ఇచ్చిన ఆదేశాలను కేవలం కాగితాలకే పరిమితం చేశారని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఇది తమ ఆదేశాలను అపహాస్యం చేయడమేనని, ఇది అత్యంత దురదృష్టకరమని పేర్కొంది. కోడి పందేలు జరగడానికి వీల్లేదని ఆదేశించినా  పందేలు యథాతథంగా జరిగాయని, స్వయంగా ప్రజా ప్రతినిధులే పందేలకు హాజరయ్యారని కోర్టు వ్యాఖ్యానించింది. జరిగిన కోడి పందేలను ప్రపంచమంతా చూసిందని పేర్కొంది. అరుదుగా టీవీలు చూసే తమకే, టీవీల్లో కోడి పందేల దృశ్యాలు పదే పదే కనిపించాయని తెలిపింది. ‘కోడి పందేల విషయంలో ఏమీ చేయలేమంటూ మీరు నిస్సహాయత వ్యక్తం చేస్తే, ఆ విషయాన్ని మాకే చెప్పాలి.. అప్పుడు మిగిలిన సంగతులను మేం చూసుకుంటాం’ అని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌), ఏపీ డీజీపీలను ఉద్దేశించి హైకోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది.  

మా ఆదేశాలను సీరియస్‌గా తీసుకున్నట్లు లేదు
కోడి పందేలు జరిగిన తీరును చూస్తుంటే మా ఆదేశాలను అధికారులు సీరియస్‌గా తీసుకున్నట్లు కనిపించడం లేదని హైకోర్టు వ్యాఖ్యానించింది. కోడి పందేలు జరగకుండా ఏం చర్యలు తీసుకున్నారో వివరిస్తూ నివేదికలు ఇవ్వాలన్న తమ ఆదేశాలను అమలు చేయకపోవడాన్ని తప్పుపట్టింది. నివేదికలు ఇవ్వకపోవడమే కాక, మరింత గడువు కోరడాన్ని తీవ్రంగా ఆక్షేపించింది. తమ ఆదేశాల ప్రకారం నివేదికలు సమర్పించనందుకు అటు సీఎస్‌ దినేష్‌కుమార్, ఇటు డీజీపీ ఎం.మాలకొండయ్యను స్వయంగా కోర్టు ముందు హాజరు కావాలని ఆదేశించింది.

ఎందుకు నివేదికలు సమర్పించలేదో వివరణ ఇవ్వాలని వారికి స్పష్టం చేసింది. తదుపరి విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్‌ రమేశ్‌ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్‌ మంతోజ్‌ గంగారావులతో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. గత ఏడాది సంక్రాంతి సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా, భీమవరం మండలం, వెంప, శ్రీరాంపురం గ్రామాలలో కోడి పందేల పేరుతో జూదం, అశ్లీల నృత్యాలు, వ్యభిచారం నిర్వహించారని, ఈ సంక్రాంతి సందర్భంగా ఇవేమీ జరగకుండా తగిన చర్యలు తీసుకునేలా అధికారులను ఆదేశించాలని కోరుతూ కలిదిండి రామ చంద్రరాజు హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్‌) దాఖలు చేసిన విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు