సిట్‌ నివేదికను సమర్పించండి : హైకోర్టు

8 Nov, 2018 15:27 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై జరిగిన హత్యాయత్నం ఘటనకు సంబంధించి దాఖలైన వ్యాజ్యాలపై గురువారం హైకోర్టు విచారించింది. తనపై జరిగిన హత్యాయత్నం కేసు దర్యాప్తు బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వ నియంత్రణలో లేని స్వతంత్ర దర్యాప్తు సంస్థకు అప్పగించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఇదే అంశంపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తరఫున పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు వైవీ సుబ్బారెడ్డి కూడా పిటిషన్‌ దాఖలు చేశారు. సిట్ దర్యాప్తు రిపోర్ట్‌ను షీల్డ్ కవర్‌లో కోర్టుకు సమర్పించాలని హైకోర్టు పేర్కొంది.

అయితే దర్యాప్తు నివేదికను సమర్పించడానికి కొంత సమయం కావాలని  ఏపీ ప్రభుత్వ తరపు న్యాయవాది కోరడంతో, మంగళవారంలోపు సిట్ నివేదికను సమర్పించాలని ఏపీ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. పిటిషన్‌ విచారణ అర్హతపై హైకోర్టు ప్రశ్నించింది. తదుపరి విచారణను హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. శుక్రవారం ఏపీ ప్రభుత్వం తరపు వాదనలను ఏపీ ప్రభుత్వ న్యాయవాది వినిపించనున్నారు.

మరిన్ని వార్తలు