‘నక్సలిజాన్ని రూపుమాపేందుకు ఏం చేస్తున్నారు? 

23 Oct, 2019 04:54 IST|Sakshi

కేంద్రంతో ఏం సంప్రదింపులు జరిపారో చెప్పండి 

హోంశాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీలకు హైకోర్టు స్పష్టీకరణ  

మెరుగైన చికిత్స కోసం భవానీని మంచి ఆసుపత్రికి మార్చాలని ఆదేశం  

సాక్షి, అమరావతి: నక్సలిజం సమస్యను రూపుమాపేందుకు ఏం చర్యలు తీసుకుంటున్నారో వివరించాలని హైకోర్టు మంగళవారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వంతో జరిపిన సంప్రదింపుల వివరాలను ఓ నివేదిక రూపంలో తమ ముందుంచాలని రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీని ఆదేశించింది. ఈ సమస్యకు ఓ పరిష్కారం కనుగొనాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందని పేర్కొంది. ఇటీవల విశాఖ జిల్లా మాదినమల్లు అటవీ ప్రాంతంలో పోలీసులతో జరిగిన ఎదురుకాల్పుల్లో గాయపడి, కాకినాడ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న మావోయిస్టు భవానీని మెరుగైన చికిత్స నిమిత్తం మంచి వైద్య సదుపాయాలున్న ఆసుపత్రికి తరలించాలని హోంశాఖను ఆదేశించింది. ఈ విషయంలో తీసుకున్న చర్యలను కూడా వివరించాలని సూచించింది. తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది. ఎదురు కాల్పుల్లో ఎంతమంది పోలీసులు.. ఎంతమంది నక్సలైట్లు చనిపోయారో తెలియచేయాలని ఆదేశించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి(సీజే) జస్టిస్‌ జితేంద్రకుమార్‌ మహేశ్వరి, న్యాయమూర్తి జస్టిస్‌ జె.ఉమాదేవిలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది.  

‘పిల్‌’గా హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌  
మాదినమల్లు అటవీ ప్రాంతంలో ఎన్‌కౌంటర్‌ జరిగిన తరువాత మావోయిస్టు పార్టీ అగ్రనేత అరుణ, భవానీ, గుమ్మిరేవుల మాజీ సర్పంచి నారాయణరావు ఆచూకీ తెలియడం లేదని, పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలుస్తోందని, అందువల్ల వారిని కోర్టులో హాజరుపరిచేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ పౌర హక్కుల సంఘం నేత చిలుకా చంద్రశేఖర్‌ హైకోర్టులో హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై సీజే నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది. ఈ హెబియస్‌ కార్పస్‌ వ్యాజ్యాన్ని ప్రజాప్రయోజన వ్యాజ్యంగా(పిల్‌) మారుస్తున్నామని స్పష్టం చేసింది.   

మరిన్ని వార్తలు