ప్రభుత్వం కళ్లుమూసుకుని వ్యవహరిస్తోంది

28 Feb, 2018 03:49 IST|Sakshi

     బీఈడీ, డీఈడీ కాలేజీలకు అనుమతులపై హైకోర్టు ఆక్షేపణ

     ప్రభుత్వం అండతో ఆ కాలేజీలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి 

సాక్షి, హైదరాబాద్‌:  రాష్ట్రంలోని పలు బీఈడీ, డీఈడీ కాలేజీల అనుమతుల విషయంలో ప్రభుత్వం కళ్లు మూసుకుని వ్యవహరిస్తోందని హైకోర్టు ఆక్షేపించింది. ఇలాంటి కాలేజీల విషయంలో ప్రభుత్వం ఎంతో కరుణ చూపుతోందని, అందుకే ఆ కాలేజీలు ఇష్టారాజ్యాంగా వ్యవహరిస్తున్నాయని వ్యాఖ్యానించింది. దీనివల్ల అంతిమంగా నష్టపోతున్నది అక్కడ చదువుతున్న విద్యార్థులే అన్నది గుర్తించాలంది. ‘కనీస ప్రమాణాలు పాటించని ఇలాంటి కాలేజీల్లో చదివిన వారు రేపు ఉపాధ్యాయులైతే సమాజానికి నష్టం. విద్యా సంస్థల ఏర్పాటే ఇప్పుడు డబ్బు సంపాదనకు దగ్గర దారిగా మారింది’ అని ఘాటుగా వ్యాఖ్యానించింది. ప్రకాశం, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని బీఈడీ కాలేజీలైన వివేకానంద కాలేజీ, అలీ కాలేజ్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్, నవ చైతన్య కాలేజ్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్, ఆజాద్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌తో పాటు ఇవే జిల్లాల్లోని ఎస్‌ఆర్, జీఎస్‌ఆర్, సలామ్‌ అమరావతి, ఎస్‌ఆర్‌డీ, షారోన్, మహాత్మాగాంధీ డీఈడీ కాలేజీల్లో చదివి ఇటీవల వార్షిక పరీక్షలు రాసిన విద్యార్థుల ఫలితాలను వెల్లడించవద్దని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) రమేశ్‌ రంగనాథన్, న్యాయమూర్తి కొంగర విజయలక్ష్మితో కూడిన ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. ప్రకాశం, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని పలు బీఈడీ, డీఈడీ కాలేజీల యాజమాన్యాలు తమ కాలేజీల్లో చేరని విద్యార్థులను కూడా చేరినట్లు చూపడంతో పాటు, చేరని విద్యార్థుల జాబితాకు ఆమోదముద్ర వేయించుకునేందుకు ప్రయత్నిస్తున్నాయంటూ ప్రకాశం జిల్లాకు చెందిన నవలూరి మాధవరావు హైకోర్టులో రెండు పిల్‌లు దాఖలు చేశారు. వీటిని ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది.

మోసం చేస్తున్నా పట్టించుకోని అధికారులు 
పిటిషనర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది ఎ.సత్యప్రసాద్‌ వాదనలు వినిపిస్తూ ఈ మూడు జిల్లాల్లో ఒకే వ్యక్తి దాదాపు 21 బీఈడీ, డీఈడీ కాలేజీలను నిర్వహిస్తున్నారని వివరించారు. అంతేగాక ఒకే భవనంలో కనీస ప్రమాణాలు లేకుండానే నాలుగైదు కాలేజీలు నిర్వహిస్తున్నారని, అధికారులకు తెలిసినా  చర్యలు తీసుకోవడం లేదన్నారు. ప్రకాశం, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని ఎస్‌ఆర్, జీఎస్‌ఆర్, సలామ్‌ అమరావతి, ఎస్‌ఆర్‌డీ, షారోన్, మహాత్మాగాంధీ డీఈడీ కాలేజీల్లో వాస్తవంగా 163 మంది విద్యార్థులు మాత్రమే చేరారని, అయితే 1,000 మంది చేరినట్లు తప్పుడు జాబితాను తయారు చేశారని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై ధర్మాసనం తీవ్ర విస్మయం వ్యక్తం చేసింది. అసలు రాష్ట్రంలో ఏం జరుగుతోందని ప్రశ్నించింది. అనుమతులు, ప్రవేశాల విషయంలో అధికారులు కళ్లుమూసుకుని ఉన్నారని, ఇదే సమయంలో ఆ కాలేజీలపై ఎక్కడ లేని కరుణ చూపిస్తున్నారని ఘాటుగా వ్యాఖ్యానించింది. శక్తివంతమైన లాబీయింగ్‌ ద్వారానే ఇలా చేయగలుతున్నారని వ్యాఖ్యానించింది. పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేస్తానని కాలేజీల తరఫు న్యాయవాది ఎస్‌.రవి పేర్కొనగా అంగీకరించిన ధర్మాసనం విచారణను వాయిదా వేసింది.

మరిన్ని వార్తలు