స్వేచ్ఛాయుతంగా నిర్వహించండి
సాక్షి, హైదరాబాద్: ప్రకాశం జిల్లా జిల్లా పరిషత్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక నిమిత్తం ఈ నెల 13న జరగనున్న జెడ్‌పీ ప్రత్యేక సమావేశం.. శాంతియుత, స్వేచ్ఛాయుత వాతావరణంలో జరిగేలా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని హైకోర్టు శుక్రవారం ఆదేశించింది. ఎటువంటి ఆటంకాలు లేకుండా ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు ఎన్నికల సంఘం గురువారం జారీ చేసిన సర్క్యులర్‌ను తూచా తప్పకుండా అమలు చేయాలని ఎన్నికల అధికారులకు హైకోర్టు స్పష్టం చేసింది.
చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక కోసం ఈ నెల 13న జరిగే జిల్లా పరిషత్ ప్రత్యేక సమావేశాన్ని పరిశీలించేందుకు ప్రత్యేక పరిశీలకుడిని నియమించేలా ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని, తమ పార్టీ సభ్యులకు రక్షణ కల్పించేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెడ్‌పీటీసీ సభ్యుడు నూకసాని బాలాజీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాన్ని శుక్రవారం న్యాయమూర్తి జస్టిస్ రమేష్ రంగనాథన్ విచారించారు.