సిట్‌ దర్యాప్తు పురోగతిపై నివేదిక ఇవ్వండి

10 Nov, 2018 04:00 IST|Sakshi

ప్రతిపక్ష నేతపై హత్యాయత్నం ఘటనపై అడ్వొకేట్‌ జనరల్‌కు హైకోర్టు ఆదేశం

పోలీసులకు వాంగ్మూలం ఇవ్వాలా? లేదా? అనేది జగన్‌ ఇష్టమని స్పష్టీకరణ

తదుపరి విచారణ ఈ నెల 13వ తేదీకి వాయిదా

హత్యాయత్నం కేసు దర్యాప్తును పర్యవేక్షించబోమని వెల్లడి

సాక్షి, హైదరాబాద్‌: విశాఖపట్నం విమానాశ్రయంలో ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌పై జరిగిన హత్యాయత్నం ఘటనపై ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌) సాగిస్తున్న దర్యాప్తు ఎంతవరకు వచ్చిందో తెలియజేయాలని అడ్వొకేట్‌ జనరల్‌(ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్‌ను హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది. దర్యాప్తు పురోగతిపై ఓ నివేదికను పరిశీలన నిమిత్తం మంగళవారం నాటికి తమ ముందుంచాలని పేర్కొంది. సీఐఎస్‌ఎఫ్, ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా(ఏఏఐ) నియంత్రణలో ఉన్న విశాఖ విమానాశ్రయంలో హత్యాయత్నం ఘటన జరిగి నందున, వారి పరిధిలోకి ఏయే అంశాలు వస్తాయో స్పష్టతనివ్వాలని సీఐఎస్‌ఎఫ్, ఏఏఐ అధికారులను హైకోర్టు ఆదేశించింది.

‘సిట్‌’కు నేతృత్వం వహిస్తున్న అధికారి, ఆ బృందంలో ఉన్న ఇతర అధికారుల వివరాలను తమ ముందుంచాలని సూచించింది. జగన్‌పై హత్యాయత్నం ఘటనపై జరుగుతున్న దర్యాప్తును తాము పర్యవేక్షించబోమని తేల్చిచెప్పింది. హత్యాయత్నం ఘటనకు సంబంధించి పోలీసులకు వాంగ్మూలం ఇవ్వాలా? లేదా? అనేది జగన్‌  ఇష్టమని హైకోర్టు స్పష్టం చేసింది. ఆయన వాంగ్మూలం ఇవ్వాలనుకుంటే ఇవ్వొచ్చని తేల్చి చెప్పింది. తదుపరి విచారణను నవంబర్‌ 13కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి(సీజే) జస్టిస్‌ తొట్టతిల్‌ బి.రాధాకృష్ణ, న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌.వి.భట్‌లతో కూడిన హైకోర్టు ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.

హత్యాయత్నం ఘటనను తక్కువ చేస్తూ మాట్లాడారు
తనపై విశాఖ విమానాశ్రయంలో జరిగిన హత్యాయత్నం ఘటన దర్యాప్తును స్వతంత్ర సంస్థకు అప్పగించేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఇదే అంశంపై వైఎస్సార్‌సీపీ తరపున ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు వై.వి.సుబ్బారెడ్డి మరో పిటిషన్‌ దాఖలు చేశారు. జగన్‌పై హత్యాయత్నం నేపథ్యంలో విమానాశ్రయాల్లో భద్రతను కట్టుదిట్టం చేసేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్‌) కూడా దాఖలైంది. ఈ మూడు వ్యాజ్యాలపై శుక్రవారం సీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది.

జగన్‌ తరఫు సీనియర్‌ న్యాయవాది సి.వి.మోహన్‌రెడ్డి హైకోర్టులో వాదనలు వినిపించారు. హత్యయత్నం ఘటన జరిగిన గంట తరువాత డీజీపీ విలేకరులతో మాట్లాడుతూ, ప్రచారం కోసమే జగన్‌పై నిందితుడు దాడి చేశారని చెప్పారని అన్నారు. అదేరోజు సాయంత్రం ముఖ్యమంత్రి చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ, రాజకీయ సానుభూతి కోసమే జగన్‌పై దాడి జరిగిందని వ్యాఖ్యానించారని తెలిపారు. జగన్‌పై దాడి వెనుక కేంద్ర ప్రభుత్వ హస్తం ఉందని కూడా ఆయన ఆరోపించారని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. ఆపరేషన్‌ గరుడ అంటూ సినీనటుడు శివాజీ చెప్పిన కథలను కూడా ముఖ్యమంత్రి వివరించారన్నారు.

చంద్రబాబు మీడియాతో మాట్లాడిన మాటలను మోహన్‌రెడ్డి ధర్మాసనానికి చదివి వినిపించారు. చంద్రబాబు దాదాపు గంటన్నరసేపు మీడియాతో మాట్లాడితే, జగన్‌పై హత్యాయత్నం ఓ డ్రామా అంటూ వందసార్లు చెప్పారని గుర్తుచేశారు. ఈ హత్యాయత్నం ఘటనను ముఖ్యమంత్రి, డీజీపీ తక్కువ చేస్తూ మాట్లాడారని, అంతేకాక దర్యాప్తు ఏ దిశగా వెళ్లాలో చెప్పకనే చెప్పారని కోర్టుకు నివేదించారు.

సీఎం చెప్పింది తప్పని పోలీసులు చెప్పగలరా?
ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తే వాస్తవాలను తెలుసుకోకుండా హత్యాయత్నాన్ని డ్రామాగా తేల్చేసినప్పుడు ఆయన కింద పనిచేసే పోలీసులు అందుకు భిన్నంగా ఎలా వాస్తవాలను బహిర్గతం చేయగలరని మోహన్‌రెడ్డి ప్రశ్నించారు. సీఎం చెప్పిన మాటలకు భిన్నంగా మాట్లాడే ధైర్యం ఏ అధికారికి ఉంటుందని అన్నారు. జగన్‌పై హత్యాయత్నం కేసులో పోలీసులు నిష్పక్షపాతంగా దర్యాప్తు చేసే పరిస్థితి లేదు కాబట్టే తాము స్వతంత్ర సంస్థతో దర్యాప్తును కోరుతున్నామని పేర్కొన్నారు. రాజకీయ సానుభూతి కోసమే ఈ దాడి జరిగినట్లు ముఖ్యమంత్రి చెప్పారని, ఇది చాలా తీవ్రమైన ప్రకటన అని అన్నారు.

దీనికి ధర్మాసనం స్పందిస్తూ.. ముఖ్యమంత్రికి కూడా వాక్‌ స్వాతంత్య్రం ఉందని, రాజకీయ సానుభూతి అన్నది ఆయన అభిప్రాయమని వ్యాఖ్యానించింది. దీనిపై మోహన్‌రెడ్డి స్పందిస్తూ.. వాక్‌ స్వాతంత్య్రాన్ని ఎవరూ కాదనరని, అయితే ఆయన బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న సంగతి మర్చిపోయి మాట్లాడటం సమంజసం కాదన్నారు. ధర్మాసనం జోక్యం చేసుకుంటూ, ఇంతకీ పిటిషనర్‌ పోలీసులకు తన వాంగ్మూలాన్ని ఇచ్చారా? సిట్‌కు ఎవరు నేతృత్వం వహిస్తున్నారు అని ఆరా తీసింది.

డీజీపీ, ముఖ్యమంత్రి ప్రకటనల నేపథ్యంలో దర్యాప్తు సక్రమంగా జరిగే అవకాశమే లేదని, అందువల్ల స్వతంత్ర సంస్థ దర్యాప్తును కోరుతున్నామని మోహన్‌రెడ్డి చెప్పారు. పోలీసులపై నమ్మకం లేదు కాబట్టే పిటిషనర్‌ వాంగ్మూలం ఇవ్వలేదన్నారు. జగన్‌పై జరిగిందని హత్యాయత్నమేనని పోలీసులు రిమాండ్‌ రిపోర్ట్‌లో స్పష్టంగా పేర్కొన్నారని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. జగన్‌పై హత్యాయత్నం చేసిన వ్యక్తి వైఎస్సార్‌సీపీ సానుభూతిపరుడుని చెప్పేందుకు ముఖ్యమంత్రి ప్రయత్నిస్తూ వచ్చారని వివరించారు.

ముఖ్యమంత్రి చెప్పినట్లు చేయకపోతే..
జగన్‌కు అయిన గాయం విషయంలోనూ ముఖ్యమంత్రి అవాస్తవాలే చెప్పారని మోహన్‌రెడ్డి గుర్తుచేశారు. క్రిమినల్‌ లా ప్రకారం వాంగ్మూలం ఇచ్చే విషయంలో ఆలస్యం అయ్యే కొద్ది జరిగే నష్టం ఎక్కువగా ఉంటుందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. పోలీసులందరూ తమ రాజకీయ బాస్‌ల తాళానికి అనుగుణంగా నృత్యం చేస్తారని తాము భావించడం లేదని తెలిపింది. సమస్య ఇక్కడే వస్తోందని, అధికారులు రాజ్యాంగం కన్నా తమ రాజకీయ బాస్‌లకే ఎక్కువ నమ్మకంగా ఉంటూ, వారి అడుగులకు మడుగులొత్తుతున్నారని మోహన్‌రెడ్డి చెప్పారు. ఒకవేళ అలా చేయకపోతే పర్యవసానాలు ఎలా ఉంటాయో ఆ అధికారులకు తెలుసని, వారికి మరో ప్రత్యామ్నాయం లేక అలా చేస్తుంటారని ఆయన తెలిపారు.

ఈ సమయంలో అడ్వొకేట్‌ జనరల్‌ శ్రీనివాస్‌ జోక్యం చేసుకుంటూ.. దర్యాప్తునకు సహకరించకుండా పోలీసులు సక్రమంగా దర్యాప్తు చేయడం లేదని ఆరోపించడం అభ్యంతరకరమని అన్నారు. దర్యాప్తునకు సహకరించేలా పిటిషనర్‌ను ఆదేశించాలని కోర్టును కోరారు. ధర్మాసనం స్పందిస్తూ.. ఈ వ్యవహారంలో జరుగుతున్న దర్యాప్తును తాము పర్యవేక్షించబోమని తేల్చిచెప్పింది. పోలీసులకు జగన్‌మోహన్‌రెడ్డి వాంగ్మూలం ఇవ్వాలా? లేదా? అన్నది ఆయన ఇష్టమని స్పష్టం చేసింది. తదుపరి విచారణను ఈ నెల 13కి వాయిదా వేసింది. 

మరిన్ని వార్తలు