నిందితులను జంతువుల్లా చూస్తారా?

27 Jun, 2018 04:00 IST|Sakshi

     మీడియా ముందు పెరేడ్‌ చేయించడమేంటి?

     హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు

     వ్యక్తిగత గోప్యతకు భంగం 

    కలిగించే అధికారం పోలీసులకు లేదని స్పష్టీకరణ  

సాక్షి, హైదరాబాద్‌: కేసుల్లో అరెస్ట్‌ చేస్తున్న నిందితులను, అనుమానితులను పోలీసులు జంతువుల్లా చూస్తున్నారని హైకోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది. ఇలా చూస్తున్నారు కాబట్టే చట్ట విరుద్ధంగా వారిని మీడియా ముందు పెరేడ్‌ చేయిస్తున్నారంటూ మండిపడింది. ఏ అధికారంతో నిందితులను, అనుమానితులను బహిరంగంగా పెరేడ్‌ చేయిస్తున్నారో వివరిస్తూ అఫిడవిట్‌ దాఖలు చేయాలని తెలిపింది. దీనికి రెండు వారాల గడువు కావాలన్న ప్రభుత్వ అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది. ఏడు రోజుల్లోనే తాము కోరిన అఫిడవిట్‌ను తమ ముందుంచాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్‌ సి.వి.నాగార్జునరెడ్డి, జస్టిస్‌ జి.శ్యాంప్రసాద్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.

తన తల్లి కావటి అలివేలును దొంగగా అనుమానిస్తూ అరెస్ట్‌ చేసిన కర్నూలు జిల్లా, ఆత్మకూరు డీఎస్‌పీ మాధవరెడ్డి.. ఆమెను శ్రీశైలంలో మీడియా ముందు ప్రవేశపెట్టడమేకాక, ఆమెపై తీవ్ర నిర్లక్ష్యపు ఆరోపణలు చేశారంటూ ప్రకాశం జిల్లా, చీరాల మండలం, ఆదినారాయణపురానికి చెందిన కావటి సాగర్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. తన తల్లి ఫొటోలను తీసుకునేందుకు మీడియాకు అనుమతినిచ్చారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ వ్యాజ్యంపై ఇటీవల జస్టిస్‌ సి.వి.నాగార్జునరెడ్డి నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. ఆ సందర్భంగా పోలీసులపై నిప్పులు చెరిగింది. అనుమానితులను, నిందితులను బహిరంగంగా పెరేడ్‌ చేయించి, వారి ఫొటోలను ప్రచురించుకునేందుకు, ప్రసారం చేసుకునేందుకు పత్రికలు, ఎలక్ట్రానిక్‌ మీడియాకు అనుమతినిచ్చే అధికారం పోలీసులకు లేదని తేల్చిచెప్పింది.

ఒక పౌరుడు నిందితుడు లేదా దోషి అయినప్పటికీ, అతని వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించే అధికారం పోలీసులకు లేదని తేల్చి చెప్పింది. ఏ అధికారంతో నిందితులను, అనుమానితులను పోలీసులు బహిరంగంగా పెరేడ్‌ చేయిస్తున్నారో వివరిస్తూ ఈ నెల 26లోగా అఫిడవిట్‌ దాఖలు చేయాలని ఆంధ్రప్రదేశ్‌ డీజీపీని ఆదేశించింది. ఈ క్రమంలోనే మంగళవారం కేసు విచారణకు రాగా, ప్రభుత్వ సహాయ న్యాయవాది అఫిడవిట్‌ దాఖలుకు మరో రెండు వారాల గడువు కోరారు. దీనిపై ధర్మాసనం తీవ్రంగా స్పందించింది. ‘రెండు వారాలు కాదు.. ఎనిమిది రోజుల గడువు కూడా ఇచ్చేది లేదు. వారం గడువునిస్తాం. అఫిడవిట్‌ దాఖలు చేయండి. అనుమానితులు, నిందితులను పోలీసులు జంతువుల్లా చూస్తున్నారు. అందుకే వారిని మీడియా ముందు ఇష్టమొచ్చిన రీతిలో పెరేడ్‌ చేయిస్తున్నారు’ అంటూ ధర్మాసనం మండిపడింది.  

మరిన్ని వార్తలు