విద్యార్థులతో ముఖాముఖిలో హైకోర్డు న్యాయమూర్తి చంద్రకుమార్

1 Sep, 2013 02:34 IST|Sakshi

 ఖమ్మం, న్యూస్‌లైన్: విద్యార్థులు లక్ష్యాన్ని నిర్దేశించుకుని ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగితే విజయాలు తలుపులు తట్టుతాయని హైకోర్టు న్యాయమూర్తి చంద్రకుమార్ అన్నారు. ‘దేశాభివృద్ధిలో విద్యార్థుల పాత్ర’ అనే అంశంపై స్తంభాద్రి రోటరీక్లబ్ ఆధ్వర్యంలో ఖమ్మంలోని స్వర్ణభారతి కల్యాణ మండపంలో శనివారం నిర్వహించిన సదస్సులో ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులతో న్యాయమూర్తి ముఖాముఖి అయ్యారు. విద్యార్థులు ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణతో ముందుకు సాగాలన్నారు. రిక్కాబజర్ పాఠశాలకు చెందిన పదోతరగతి విద్యార్థిని అనూషా, నయాబజార్ బాలికల ఉన్నత పాఠశాలకు చెందిన కె.రమ్య, ప్రశాంతినగర్ పాఠశాలకు చెందిన ప్రసన్న అడిగిన ప్రశ్నలకు ఆయన సవివరంగా సమాధానాలు ఇచ్చారు.
 
 విద్యార్థిని : ప్రస్తుతం న్యాయ వ్యవస్థలో రాజకీయాల జోక్యం ఉందా?
 న్యాయమూర్తి: ఇప్పటి వరకు లేదు. న్యాయవ్యవస్థపై రాజకీయాల జ్యోక్యం ఉండకూడదు. అయితే ఇక ముందు న్యాయమూర్తుల నియామకంలో మార్పులు వస్తాయని అంటున్నారు. అప్పుడు ఏవిధంగా ఉంటుందో చెప్పలేం.
 
 విద్యార్థిని : దేశం అభివృద్ధి చెందాలంటే అధికారుల అవినీతి తగ్గాలి కదా.. అదెందుకు సాధ్యం కావడం లేదు?
 న్యాయమూర్తి: అధికారి అవినీతిపరుడైతే క్షమించకూడదు. కానీ.. ఆయన రాజకీయ నాయకుల పరిధిలో పనిచేయాల్సి వస్తోంది. నాయకుడు చెప్పినట్లు వినకపోతే ఏ శ్రీకాకుల మో.. మరెక్కడికో బదిలీ చేయిస్తారు.. అంటే.. అవినీతి అనేది అధికారులే కాకుండా రాజకీయ నాయకుల్లోనూ ఉండకూడదు. అప్పుడే దేశం అభివృద్ధి చెందుతుంది.
 
 విద్యార్థిని : అన్ని ఆధారాలూ ఉన్న పేదోడు అసత్య సాక్షాలు సృష్టిస్తున్న ధనికుడి చేతిలో న్యాయ పోరాటం గెలవలేకపోతున్నాడు. ఇది అన్యాయం కదా..?
 న్యాయమూర్తి: ఇరువర్గాల వారు చెప్పిన సాక్షాలను విని తీర్పు ఇవ్వడమే న్యాయమూర్తుల పని. అయితే సాక్షాలు చెప్పడంలో ఎవరు నిజం చెబుతున్నారు.. ఎవరు కల్పితాలు చెబుతున్నారు అనేది విశ్లేషించాల్సిన అవసరం ఉంది. ఆ దిశగానే న్యాయస్థానాలు పనిచేస్తున్నాయి. అన్ని సందర్భాల్లో డబ్బులు ఇచ్చి న్యాయాన్ని కొనలేరు. అసత్యపు సాక్షాలు చెప్పేవారు ఎప్పుడో ఒకసారి చట్టానికి దొరికి పోతారు. ఈ కార్యక్రమంలో నాలుగో అదనపు జడ్జ్జి కల్యాణరావు, ఫ్యామిలీ కోర్టు జడ్జి రహమాన్, డీఈఓ రవీంద్రనాథ్‌రెడ్డి, రోటరీక్లబ్ గవర్నర్ మాల్లాది వాసుదేవరావు, శ్రీనివాసరావు, ఖమ్మం అర్బన్ ఎంఈఓ శ్రీనివాస్, వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, న్యాయవాదులు పాల్గొన్నారు.
 
 
 

మరిన్ని వార్తలు