గనులశాఖ మెమో అమలు నిలిపివేత

26 Oct, 2019 03:29 IST|Sakshi

ఎల్‌ అండ్‌ టీ పిటిషన్‌పై హైకోర్టు 

సాక్షి, అమరావతి: గుంటూరు జిల్లా, తుళ్లూరు మండలం నెక్కల్లు, ఐనవోలు, నేలపాడు గ్రామాల్లో లార్సన్‌ అండ్‌ టోబ్రో (ఎల్‌ అండ్‌ టీ) నిల్వచేసిన ఇసుకను ప్రభుత్వ ఆస్తిగా ప్రకటిస్తూ గనులశాఖ డైరెక్టర్‌ జారీచేసిన మెమో అమలును హైకోర్టు నిలుపుదల చేసింది. నాలుగు వారాల పాటు మెమో అమలును నిలిపేస్తూ హైకోర్టు శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. ఈ ఇసుక తరలింపు విషయంలో యథాతథస్థితి(స్టేటస్‌ కో)ని కొనసాగించాలని గనుల శాఖాధికారులను హైకోర్టు ఆదేశించింది. ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలంది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.

ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ మల్లవోలు సత్యనారాయణమూర్తి మధ్యంతర ఉత్తర్వులు జారీచేశారు. గతంలో ఉచిత ఇసుక పథకం కింద తీసుకున్న ఇసుకను నెక్కల్లు, ఐనవోలు, నేలపాడు గ్రామాల్లోని తమ స్టాక్‌ యార్డ్‌ల్లో నిల్వ చేశామని, ఆ ఇసుకను ప్రభుత్వ ఆస్తిగా ప్రకటించడంతో పాటు, ఆ ఇసుకను ఇతర ప్రాంతాలకు తరలించేందుకు మెట్రిక్‌ టన్నుకు రూ.375 చెల్లించాలంటూ గనుల శాఖాధికారులు మెమో జారీచేశారని, ఈ విషయంలో జోక్యం చేసుకోవాలంటూ ఎల్‌ అండ్‌ టీ అదీకృత అధికారి జి.రామకృష్ణ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై శుక్రవారం జస్టిస్‌ సత్యనారాయణమూర్తి విచారణ జరిపారు. పిటిషనర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది వేదుల వెంకటరమణ, ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది కాసా జగన్‌మోహన్‌రెడ్డి వాదనలు వినిపించారు. 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు