మంత్రి గంటాకు హైకోర్టు నోటీసులు

7 Mar, 2017 17:15 IST|Sakshi
మంత్రి గంటా శ్రీనివాసరావుకు హైకోర్టు నోటీసులు

హైదరాబాద్‌ : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మానవ వనరుల శాఖా మంత్రి గంటా శ్రీనివాసరావుకు ఉమ్మడి హైకోర్టు మంగళవారం నోటీసులు జారీ చేసింది. ప్రభుత్వ భూములు తాకట్టు పెట్టి రుణం తీసుకున్నట్లు గంటాపై ఆరోపణలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే.  ప్రత్యూష రిసోర్సెస్‌ అండ్‌ ఇన్‌ఫ్రా ప్రైవేట్‌ లిమిటెడ్హామీదారుగా ఉన్నందుకుగాను గంటాకు ఈ నోటీసులు జారీ చేసింది. ఇందుకు సంబంధించి మూడు వారాల్లో కౌంటర్‌ దాఖలు చేయాలని న్యాయస్థానం ఆదేశించింది.

 ప్రభుత్వ భూమిని తనఖా పెట్టి ఆ సంస్థ ఇండియన్‌ బ్యాంకు నుంచి రుణం పొందిందని పేర్కొంటూ హైకోర్టులో ఓ పిటిషన్‌ దాఖలైంది. రుణగ్రహీతలు, హామీదారులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ దాఖలైన ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన న్యాయస్థానం ఈ మేరకు గంటా సహా ప్రతివాదులందరికీ నోటీసులు జారీ చేసింది. మూడు వారాల్లోగా కౌంటర్‌ దాఖలు చేయాలని ఆదేశించింది.

మరోవైపు ఇండియన్‌ బ్యాంకు నుంచి తీసుకున్న రుణం తిరిగి చెల్లించని కారణంగా మంత్రి గంటాతోపాటు ఆయన బంధువుల ఆస్తుల స్వాధీనం కొనసాగుతోంది. తాజాగా ‘ప్రత్యూష రిసోర్సెస్‌ అండ్‌ ఇన్‌ఫ్రా ప్రైవేట్‌ లిమిటెడ్‌’ కోసం కుదవపెట్టిన మరో రెండు విలువైన స్థిరాస్తులను ఇండియన్‌ బ్యాంకు స్వాధీనం చేసుకున్న విషయం విదితమే.

మరిన్ని వార్తలు