ఏ నివేదికల ఆధారంగా కాపులను బీసీల్లో చేర్చారు..

21 Jul, 2018 03:59 IST|Sakshi

     వాటిని స.హ చట్టం ద్వారా ఇవ్వాల్సిందే..

     రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం  

సాక్షి, హైదరాబాద్‌: ఏ నివేదికలను ఆధారంగా చేసుకుని కాపులను బీసీల్లో చేరుస్తూ నిర్ణయం తీసుకున్నారో ఆ నివేదికలను సమాచార హక్కు చట్టం కింద బహిర్గతం చేయాలని ఉమ్మడి హైకోర్టు శుక్రవారం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాన్ని ఆదేశించింది. బీసీ కమిషన్‌ చైర్మన్‌ హోదాలో జస్టిస్‌ మంజునాథ్‌ ఇచ్చిన నివేదికను, బీసీ కమిషన్‌ సభ్యులు ముగ్గురు ఇచ్చిన నివేదికను స.హ. చట్టం కింద న్యాయవాది కొండల్‌రావుకు ఇవ్వాలని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ ఎ.రాజశేఖర్‌రెడ్డి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. ఏ నివేదిక ఆధారంగా కాపులను బీసీల్లో చేరుస్తూ నిర్ణయం తీసుకున్నారో వాటిని బహిర్గతం చేయాలంటూ స.హ. చట్టం కింద పెట్టుకున్న దరఖాస్తును బీసీ సంక్షేమశాఖ తిరస్కరించడాన్ని సవాలు చేస్తూ న్యాయవాది కె.కొండల్‌రావు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

ఈ వ్యాజ్యంపై శుక్రవారం న్యాయమూర్తి జస్టిస్‌ ఎ.రాజశేఖర్‌రెడ్డి విచారణ జరిపారు. పిటిషనర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది ఎ.సత్యప్రసాద్‌ వాదనలు వినిపిస్తూ.. కాపు, తెలగ, బలిజ, ఒంటిరి కులాలను బీసీల్లో చేర్చే విషయంలో బీసీ కమిషన్‌ చైర్మన్‌ హోదాలో జస్టిస్‌ మంజునాథ్‌ ఓ నివేదికను, కమిషన్‌కు చెందిన ముగ్గురు సభ్యులు మరో నివేదికను ప్రభుత్వానికి ఇచ్చారన్నారు. అయితే ప్రభుత్వం మాత్రం జస్టిస్‌ మంజునాథ్‌ నివేదికను కాకుండా ముగ్గురు సభ్యులు ఇచ్చిన నివేదికను పరిగణనలోకి తీసుకుని కాపులను బీసీల్లో చేరుస్తూ నిర్ణయం తీసుకుందన్నారు.

అయితే కాపులను బీసీల్లో చేర్చడంపై పిటిషనర్‌కు పలు అభ్యంతరాలున్నాయని, వీటన్నింటినీ ఆయన బీసీ కమిషన్‌ ముందు వ్యక్తం చేశారని వివరించారు. ఈ నేపథ్యంలో సదరు నివేదికలను ఇవ్వాలని కోరుతూ పిటిషనర్‌ స.హ. చట్టం కింద బీసీ సంక్షేమ శాఖకు దరఖాస్తు చేసుకుంటే, సంబంధిత అధికారి తిరస్కరించారని తెలిపారు. అంతేకాక ఈ నివేదికలను బయటపెడితే సమస్యలు వస్తాయని, అందువల్ల కోరిన సమాచారాన్ని ఇవ్వడం సాధ్యం కాదని చెప్పారని ఆయన కోర్టుకు నివేదించారు. దీనిపై న్యాయస్థానం విస్మయం వ్యక్తం చేసింది. పిటిషనర్‌ కోరిన సమాచారాన్ని అందజేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేశారు.  

మరిన్ని వార్తలు