గార్దభ వ్యథ

9 Nov, 2017 07:14 IST|Sakshi
తెనాలిలో వధకు సిద్ధం చేసిన గాడిద

 రోజురోజుకూ పెరిగిపోతున్న గాడిదల వధ

అంతరించిపోతున్న సంతతి

హైకోర్టులో దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యం

నివేదిక ఇవ్వాలంటూ జిల్లా అధికారులకు హైకోర్టు ఆదేశం

కిలోమీటర్ల దూరం.. వీపుపై మోయలేని బరువు..రాళ్ల దారైనా, ముళ్ల బాటైనా అలుపెరగని ప్రయాణం. యజమాని బతుకు బరువు మోసేందుకు గాడిదలు పడిన కష్టమిది.. ఆయన ఇల్లు గడించేందుకు ఒళ్లంతా గుల్ల చేసుకున్న మూగజీవాల ప్రస్తానమిది. అయితే మనిషి కష్టాన్ని గుండెలపై మోసిన గాడిదలను నేడు నిర్దయగా చంపేస్తున్నారు. వాటి రక్తమాంసాలకు   అలవాటు పడి నిత్యం కత్తివేటుకు బలి చేస్తున్నారు. జీవన నావకు తోడుగా..బతుకు బాటకు నీడగా నిలిచిన జీవాన్ని పాషాణ హృదయాలతో ప్రాణాలు తోడేస్తున్నారు. గంభీరమైన గార్దబాల గొంతును నిత్యం వధిస్తూ వాటికి మూగ వ్యథనే మిగిలిస్తున్నారు.

‘గాడిద’ హైకోర్టు మెట్లెక్కింది. గాడిద మాంసం విక్రయాలను నిలిపేయాలంటూ ఓ ప్రజాహిత వ్యాజ్యం దాఖలైంది. ఈ అమ్మకాలు గుం టూరు జిల్లాలో ఎక్కువగా జరుగుతున్నాయని ఆ వ్యాజ్యంలో పేర్కొన్నారు. దీంతో స్పందించిన న్యాయస్థానం గాడిద మాంసం అమ్మకాలపై నివేదిక ఇవ్వాలని జిల్లా అధికారులను ఆదేశించింది. ఈ నేపథ్యంలో ప్రత్యేక కథనం.

తెనాలి : కష్టపడి పనిచేసే వ్యక్తిని ఉద్దేశించి ‘గాడిదలా కష్టపడుతున్నాడు’ అనటం, గొంతు బాగో లేదనటానికి ‘అబ్బ! నీది గార్దభ స్వరం రా’ అని ఎద్దేవా చేయటం తెలిసిందే. భారమంతా తానే మోస్తున్నానని చెప్పటానికి ‘గాడిద బరువును మోస్తున్నా’ అనీ అంటారు. అలాగే, ‘గాడిద గుడ్డేం కాదూ’ అనే వాడుక పదాన్నీ వింటుంటాం. గాడిదను ఇన్ని రకాల ఉపమానాలకు వాడుకుంటున్న మనిషి, ఆధునికతను తొడుక్కుంటున్నకొద్దీ ఆ జంతువుకు దూరమవుతూ వచ్చాడు. యంత్రం ప్రవేశించాక గాడిదతో అవసరం లేదన్నట్టుగా తయారైంది. గ్రామీణ ప్రాంతాల్లోనూ వీటి మనుగడ బాగా తగ్గిపోతోంది.

తగ్గుతున్న సంఖ్య..
దేశంలో పశువులు, ఇతర జంతువుల సంఖ్య తగ్గిపోతోంది. పాడి పశువుల సంఖ్య పెరుగుతున్నా, మిగిలిన వాటి పరిస్థితి ఆందోళనకరమే. 2012 గణాంకాల ప్రకారం దేశవ్యాప్తంగా గాడిదల్లో  27.22 శాతం తగ్గుదల నమోదైంది. 2007 నాటికి 4.38 లక్షలుగా ఉన్న గాడిదలు, 2012 లెక్కలకు వచ్చేసరికి 3.19 లక్షలు మాత్రమే ఉన్నాయి. రాజస్తాన్‌లో ఇవి అధికం కాగా, తర్వాతి స్థానాల్లో గుజరాత్, మహారాష్ట్ర, బీహార్, ఆంధ్రప్రదేశ్‌ ఉన్నాయి. మనిషి కుటుంబానికి సన్నిహితంగా మెలుగుతూ వచ్చిన గాడిద, క్రమక్రమంగా సంచార జీవులతో సహవాసం చేస్తూ వచ్చాయి. ఇప్పటికీ ఎక్కువగా దుస్తులు ఉతికేవాళ్లు, ఇటుక బట్టీలు, కొండల్లోని పుణ్య క్షేత్రాలకు యాత్రికులను తీసుకెళ్లేందుకు వీటిని వినియోగిస్తున్నారు. ఇతర ప్రాంతాల్లో వీటి ఉనికి నామమాత్రమే.

గతంలో చీరాల ప్రసిద్ధి..
మాంసాహారులు పెరగటం కూడా గాడిదల మనుగడకు ముప్పుతెచ్చేలా తయారైంది. రకరకాల జంతువులను తింటున్నట్టే, మనిషి గాడిద మాంసానికీ అలవాటు పడుతున్నాడు. ఒకప్పుడు రాష్ట్రంలో చీరాల గాడిద మాంసానికి ప్రసిద్ధి. క్రీడాకారులు, బరువైన పనులు చేసేవాళ్లు గాడిద రక్తం తాగేందుకు చీరాలకు చేరుకునేవారు. వేకువజామునే గాడిదను కోసిన వెంటనే పట్టిన రక్తాన్ని తాగేసి వీధుల్లో పరుగులు తీసేవారు. పనిలోపనిగా కొంత మాంసాన్ని తీసుకొచ్చి వండించుకుని తినేవారు. గాడిద రక్తం, మాంసం ఆరోగ్యానికి భేషుగ్గా ఉంటాయని అప్పట్లో బాగా ప్రచారం జరిగింది. స్టూవర్ట్‌పురంతో సహా మరికొన్ని ప్రాంతాలకు చెందిన ఆరితేరిన నేరస్తులు గాడిద రక్తాన్ని, మాంసాన్ని తీసుకుంటారని ఉదహరించేవారు. క్రమంగా విస్తరించి గ్రామాలకు, నగరాలకు పాకింది.
వందకుపైగా కుటుంబాలకు జీవనోపాధి..
జిల్లాలో చెరుకుపల్లి, తాడేపల్లి, గుంటూరు, బాపట్లకు చెందిన 100 నుంచి 200 కుటుంబాల వారు గాడిద మాంసాన్ని జీవనోపాధిగా చేసుకున్నారు. కొందరు వారం వారం ఒకేచోట మాంసం విక్రయాలు చేస్తుంటే, మరికొందరు రోజుకో ఊరు చొప్పున చేపడుతున్నారు. ఆపరేషను చేయించుకున్నవారికి కుట్లు మానటానికి, ప్రమాదాల్లో తగిలిన దెబ్బలు తాలూకు నొప్పుల నివారణకు గాడిద మాంసం మంచి ఔషధమనే ప్రచారంతో వినియోగం పెరిగింది. పొట్టేలు మాంసం తరహాలోనే కిలో రూ.400 అమ్ముతున్నారు. ఆడ గాడిద పాలు కూడా (గా>్లసుడు) రూ.50 నుంచి రూ.100 ధరకు విక్రయిస్తున్నారు. ఛాతీలో నెమ్ము, ఆయాసానికి దివ్యౌషధంగా చెబుతుంటారు. మాంసాహారుల్లో అవసరమైనవారు నిరభ్యంతరంగా ఈ మాంసాన్నీ ఆదరిస్తున్నారు.

కోర్టులో ప్రజాహిత వ్యాజ్యం...
ఈ నేపధ్యంలో కాకినాడకు చెందిన యానిమల్‌ రెస్క్యూ ఆర్గనైజేషన్‌ కార్యదర్శి గోపాలరావు, మరో ముగ్గురు హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేశారు. గుంటూరులో గాడిదలను వధించి, విచ్చలవిడిగా మాంసం విక్రయాలు సాగిస్తున్నారనీ, అధికారులు చర్యలు తీసుకోవటం లేదంటూ దాఖలైన వ్యాజ్యంపై హైకోర్టు స్పందించింది. గత నెల 31వ తేదీన ఈ వ్యాజ్యంలో వాదనలు విన్న తర్వాత సంబంధిత రాష్ట్ర, గుంటూరు జిల్లా అధికారులకు నోటీసులు జారీ చేసింది. మంగళవారం జరిగిన విచారణలో ‘గాడదల్నీ వదలరా..’ అంటూ విస్మయం వ్యక్తం చేసింది. దీనిపై నివేదికను కోరి వచ్చే వారానికి వాయిదా వేసింది. అయితే, ఈ పరిణామాలతో గాడిదల మాంసం విక్రయాలు జీవనోపాధిగా చేసుకున్నవారు ఆందోళనకు గురవుతున్నారు. వారు కూడా కోర్టును ఆశ్రయించి తమ వాదనల్ని వినిపించేందుకు సిద్ధమవుతున్నారు.

తాడేపల్లి, వణుకూరుల్లోనూ..
తాడేపల్లి రూరల్‌ (మంగళగిరి) / కంకిపాడు (పెనమలూరు) / నందిగామ : తాడేపల్లి కేంద్రంగా గాడిద మాంసం అమ్మకాలను నిర్వహిస్తున్నారు. కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి గాడిదలను తీసుకువస్తుంటారు. కేజీ రూ.400 నుంచి రూ.500 వరకు అమ్ముతుంటారు. జిల్లా మొత్తంమీద ఇక్కడే గాడిద మాంసం విక్రయాలు ఎక్కువగా జరుగుతాయని చెప్పొచ్చు.  ఇక పెనమలూరు మండలం వణుకూరులో ప్రతి ఆదివా రం గాడిద మాంసం అమ్మకాలు సాగుతుంటా యి. ప్రస్తుతం కిలో రూ.400 ఉంది. ఉయ్యూరు బస్టాండు సెంటర్‌లోనూ ప్రతి ఆదివారం అమ్మకాలు జరుగుతుంటాయి. అలాగే, లీటరు గాడిద పాలు రూ.100 నుంచి రూ.130 వరకు అమ్ముతుంటారు.  నందిగామ పట్టణంలోనూ తరచూ గాడిద పాలు అమ్మకానికి వస్తున్నాయి.

మేమూ కోర్టును ఆశ్రయిస్తాం..
గొర్రెలు, కోళ్లు కోస్తున్నారు.. పశువుల్నీ వదలటం లేదు. గాడిదల మాంసం విక్రయిస్తే తప్పేమిటి? తినేవాళ్లుంటేనే కదా మేం అమ్మేది? జిల్లాలో చాలామందిమి ఈ వ్యాపారంపై ఆధారపడ్డాం. మేం కోయోళ్లం... గాడిదలోళ్లు అంటారు. ఇక్కడ గాడిదలు దొరకటం లేదు. మహారాష్ట్ర నుంచి తీసుకొచ్చుకుంటున్నాం. ఇద్దరం కలిసి చాకిరీ చేస్తే చెరో రూ.500 మిగిలితేనే గొప్ప! మా నోటికాడ కూడు లాగేత్తే ఎట్టా బతకాల? మేమూ కోర్టుకెళతాం. – చండ్ర గోపి, చెరుకుపల్లి 

మరిన్ని వార్తలు