3 నెలలుగా సీసీ కెమెరాలు పనిచేయట్లేదా?

14 Nov, 2018 03:39 IST|Sakshi

హైకోర్టు విస్మయం ఇంత ముఖ్యమైన మార్గంలో పనిచేయకపోతే ఏం చేస్తున్నారు?

జాతి భద్రతకు సంబంధించి ఏదైనా ఘటన జరిగితే బాధ్యత ఎవరిది?

విమానాశ్రయంలో ఎవరి బాధ్యతలు ఏమిటో చెప్పండి

సీఐఎస్‌ఎఫ్, ఏఏఐలకు న్యాయస్థానం ఆదేశాలు

సాక్షి, హైదరాబాద్‌: విశాఖపట్నం విమానాశ్రయం మార్గంలో గత మూడు నెలలుగా సీసీ కెమెరాలు పనిచేయకపోవడంపై హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. ఇంత ముఖ్యమైన మార్గంలో సీసీ కెమెరాలు పనిచేయకపోతే ఏం చేస్తున్నారంటూ పోలీసులను ప్రశ్నించింది. ఒకవేళ జాతి భద్రతకు సంబంధించి ఏదైనా జరగరాని ఘటన జరిగితే అప్పుడు బాధపడి ప్రయోజనం ఏముంటుందని నిలదీసింది. మనిషి సృష్టించే విపత్తుల నుంచి రక్షించుకునేందుకు సీసీ కెమెరాలు ఎంతో ఉపయోగకరమని న్యాయస్థానం పేర్కొంది. విమానాశ్రయంలో ఎక్కడెక్కడ సీసీ టీవీలున్నాయి..? వాటి ఫుటేజీ వివరాలపై కోర్టు ఆరా తీసింది. వీఐపీ లాంజ్, రెస్టారెంట్‌లో సీసీ కెమేరాలు లేవనే  విషయాన్ని గుర్తించింది. విమానాశ్రయంలో సీఐఎస్‌ఎఫ్‌ బాధ్యతలు ఏమిటి..? ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఏఏఐ) బాధ్యతలు ఏమిటి? అనే అంశాలను ఆరా తీసింది. ఈ విషయంలో మరింత స్పష్టతనివ్వాలని సీఐఎస్‌ఎఫ్, ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా న్యాయవాదులను ఆదేశించింది.

ఈ వ్యాజ్యంలో సీఐఎస్‌ఫ్‌ ఐజీ, సీఐఎస్‌ఎఫ్‌ అసిస్టెంట్‌ కమాండెంట్, విశాఖపట్నం విమానాశ్రయ ప్రధాన భద్రతాధికారి, విశాఖ విమానాశ్రయ డైరెక్టర్, ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా మేనేజర్లను ప్రతివాదులుగా చేర్చింది. వీరితోపాటు ఇప్పటికే ఈ వ్యాజ్యంలో ప్రతివాదులుగా ఉన్న కేంద్ర హోంశాఖ కార్యదర్శి, రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శి, సీబీఐ డైరెక్టర్, విశాఖ పోలీస్‌ కమిషనర్, సివిల్‌ ఏవియేషన్‌ సెక్యూరిటీ డైరెక్టర్‌ జనరల్‌కు కూడా నోటీసులు జారీ చేస్తూ ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ తొట్టతిల్‌ బి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. 

ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌పై హత్యాయత్నం నేపథ్యంలో అన్ని విమానాశ్రయాల్లో గట్టి భద్రతా చర్యలు తీసుకునేలా ఆదేశాలు ఇవ్వడంతో పాటు ఈ ఘటనపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ గుంటూరుకు చెందిన బోరుగడ్డ అనిల్‌కుమార్, వైఎస్సార్‌ జిల్లాకు చెందిన గుమ్మా అమర్‌నాథ్‌రెడ్డిలు ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్‌) దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై సీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా పిటిషనర్ల తరఫు న్యాయవాది కృష్ణమూర్తి వాదనలు వినిపిస్తూ అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే విమానాశ్రయం వీఐపీ లాంజ్‌లో వైఎస్‌ జగన్‌పై హత్యాయత్నం జరిగిందని, ఇది ఒక్కరు చేసే పని కాదని, దీని వెనక మరికొంత మంది ఉండి ఉంటారని తెలిపారు. వాస్తవాలను నిగ్గు తేల్చేందుకు బాధ్యతాయుతుడైన అధికారి సాయం తీసుకోవాలని ఆయన ధర్మాసనాన్ని కోరారు. అందుకు ధర్మాసనం తిరస్కరిస్తూ తమకు ఇక్కడున్న న్యాయవాదులపై నమ్మకం ఉందని, అధికారుల సాయం ఎంత మాత్రం అవసరం లేదని స్పష్టం చేసింది. ఇదే సమయంలో సీఐఎస్‌ఎఫ్‌ గురించి కేంద్ర ప్రభుత్వ న్యాయవాది లక్ష్మణ్‌ను ప్రశ్నించింది. 

సీఐఎస్‌ఎఫ్‌ బాధ్యత అంతవరకే ...
ప్రయాణికుల గుర్తింపు కార్డులను పరిశీలించి వారిని విమానాశ్రయం లోపలకు పంపడం, ఆ తరువాత క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించడం వరకే సీఐఎస్‌ఎఫ్‌ బాధ్యతని కేంద్ర ప్రభుత్వ న్యాయవాది లక్ష్మణ్‌ కోర్టుకు నివేదించారు. వీఐపీ లాంజ్‌ సీఐఎస్‌ఎఫ్‌ పరిధిలోకి రాదని, అది ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ అధికారుల నియంత్రణలో ఉంటుందన్నారు. గాయపడిన వ్యక్తులకు చికిత్స అందించే అంశం కూడా ఆ అ«థారిటీ పరిధిలోకే వస్తుందన్నారు. సీఐఎస్‌ఎఫ్‌ ఐజీ సి.వి.ఆనంద్‌ ఘటన తరువాత విశాఖ విమానాశ్రయానికి వెళ్లి విచారణ జరిపారని చెప్పారు. విమానాశ్రయం లోపల ఏ భాగాలు ఎవరి పరిధిలో వస్తాయో నిర్ధిష్టంగా చెప్పాలని ధర్మాసనం కోరగా.. కొంత గడువునిస్తే పూర్తి వివరాలను కోర్టు ముందు ఉంచుతామని లక్ష్మణ్‌ నివేదించారు. కావాల్సినంత సమయం తీసుకోవచ్చని, ఈ విషయంలో తాము ఎవరినీ తొందరపెట్టబోమని, సీఐఎస్‌ఎఫ్‌ను శాసించజాలమని కూడా ధర్మాసనం స్పష్టం చేసింది. ఆ తరువాత ధర్మాసనం సీసీ టీవీలు, వాటి ఫుటేజీల గురించి ఆరా తీసింది. ఘటన తరువాత విమానాశ్రయంలో ఉన్న సీసీ టీవీల ఫుటేజీ తీసుకున్నారా? అని ప్రశ్నించగా... తీసుకున్నామని ఏజీ చెప్పారు. లాంజ్‌ లోపల, బయట, రెస్టారెంట్‌ లోపల, బయట సీసీ టీవీల ఫుటేజీ తీసుకున్నారా? అని ఈ సందర్భంగా ధర్మాసనం ప్రశ్నించింది. అయితే లాంజ్‌లో సీసీ టీవీ లేదని, బయట కొద్ది దూరంలో ఉన్న సీసీ టీవీ నుంచి ఫుటేజీ తీసుకున్నామని ఏజీ చెప్పారు. రెస్టారెంట్‌లో కూడా సీసీ టీవీ లేదన్నారు. 

అందుకే జగన్‌ వాంగ్మూలం ఇవ్వలేదు...
ఆ తరువాత దర్యాప్తు అధికారుల ముందు వైఎస్‌ జగన్‌ వాంగ్మూలం ఇచ్చారా? అంటూ ధర్మాసనం ఆరా తీసింది. ఎటువంటి వాంగ్మూలం ఇవ్వలేదని... డీజీపీ, ముఖ్యమంత్రి వ్యాఖ్యల నేపథ్యంలో దర్యాప్తు నిష్పాక్షికంగా జరిగే అవకాశం లేదు కాబట్టి వాంగ్మూలం ఇవ్వరాదని ఓ స్పష్టమైన వైఖరి తీసుకున్నామని జగన్‌ తరఫు సీనియర్‌ న్యాయవాది సి.వి.మోహన్‌రెడ్డి నివేదించారు. రాజకీయ ప్రయోజనాల కోసం, సానుభూతి కోసమే ఈ ఘటన జరిగిందని, దీనికి పాల్పడిన వ్యక్తి వైఎస్సార్‌ సీపీ కార్యకర్తంటూ ముఖ్యమంత్రి మీడియా సమావేశంలో చెప్పారని ఆయన ధర్మాసనం దృష్టికి తెచ్చారు. జగన్‌పై హత్యాయత్నాన్ని  డ్రామాగా అభివర్ణిస్తూ దర్యాప్తును ఏ దిశగా చేయాలో పోలీసులకు నిర్దేశించారని, అలాగే దర్యాప్తు ఫలితం ఎలా ఉండాలో కూడా చెప్పకనే చెప్పారని ఆయన తెలిపారు.

సాయంత్రం 4.30 గంటలకు ఎఫ్‌ఐఆర్‌ నమోదైందని, ఆ తరువాత ముఖ్యమంత్రి మీడియాతో మాట్లాడుతూ అన్ని విషయాలను తెలుసుకునే మాట్లాడుతున్నట్లు చెప్పారన్నారు. నిందితుడు  తనకు ప్రాణహాని ఉందని చెప్పాడని, అందుకు సంబంధించి సీడీలు కూడా ఉన్నాయని, వాటిని కూడా వ్యాజ్యాలతో జత చేశామని మోహన్‌రెడ్డి కోర్టుకు నివేదించారు. ఈ సమయంలో ధర్మాసనం జోక్యం చేసుకుంటూ గాయపడిన వ్యక్తిని విమానం ఎక్కేందుకు ఎవరు అనుమతించారంటూ లక్ష్మణ్‌ను ప్రశ్నించింది. దీంతో సీఐఎస్‌ఎఫ్‌కు సంబంధం లేదని లక్ష్మణ్‌ పేర్కొన్నారు. అది ఎయిర్‌పోర్ట్‌ వారి పరిధిలోని అంశమన్నారు. వైఎస్‌ జగన్‌ విమానం ఎక్కే సమయానికి అక్కడ ప్రోటోకాల్‌ ఇన్‌స్పెక్టర్, స్థానిక పోలీసులు కూడా ఉన్నారని ఆయన కోర్టు దృష్టికి తెచ్చారు. ప్రధాన ప్రతిపక్ష నేతగా, రాజకీయ నాయకుడిగా, మాజీ ముఖ్యమంత్రి కుమారుడిగా తనకున్న విస్తృత ప్రజాభిమానం దృష్ట్యా వైఎస్‌ జగన్‌ తాను హైదరాబాద్‌ వెళ్లాలని కోరి ఉండొచ్చునని, అయితే నిబంధనలు తెలుసుకోకుండా ఆయన్ను  విమానం ఎలా ఎక్కనిచ్చారని ప్రశ్నించింది. విమానంలో జగన్‌కు జరగరానిది ఏదైనా జరిగితే బాధ్యత ఎవరిదని ప్రశ్నించింది.
 
మేం లోతుగా విచారణ జరపాల్సిన అవసరం ఉంది...
ఆ తరువాత సిట్‌ నివేదికను మరోసారి పరిశీలించిన ధర్మాసనం అందులో సీసీటీవీ కోర్‌ టీం అని పేర్కొని ఉండటాన్ని గమనించి కోర్‌ టీం ఏం చేస్తుందని ప్రశ్నించింది. ఇదే సమయంలో విమానాశ్రయ మార్గంలో గత మూడు నెలలుగా సీసీ టీవీలు పనిచేయడం లేదన్న విషయాన్ని నివేదికలో పేర్కొని ఉండటాన్ని గమనించిన ధర్మాసనం దీనిపై పోలీసులను నిలదీసింది. సిట్‌ నివేదిక పరిశీలించిన తరువాత తాము మరింత లోతుగా విచారణ జరపాల్సిన అవసరం ఉందని పేర్కొంది. పూర్తి వివరాలను పరిశీలించేందుకు సీఐఎస్‌ఎఫ్, ఎయిర్‌పోర్ట్‌ అథారిటీకి చెందిన పలువురు అధికారులను ప్రతివాదులుగా చేరుస్తూ విచారణను వాయిదా వేసింది.

మరిన్ని వార్తలు