ఏపీ సర్కారుకు హైకోర్టులో చుక్కెదురు

24 Apr, 2017 13:39 IST|Sakshi
ఏపీ సర్కారుకు హైకోర్టులో చుక్కెదురు

హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి ఉమ్మడి హైకోర్టులో మరోసారి చుక్కెదురైంది. రాజధాని గ్రామాల్లో రైతుల నుంచి బలవంతంగా భూములు లాక్కునేందుకు చంద్రబాబు సర్కారు చేస్తున్న ప్రయత్నాలకు హైకోర్టు బ్రేక్‌ వేసింది. పెనుమాక భూసేకరణ నోటిఫికేషన్‌ పై స్టేటస్‌ కో విధించింది. రైతుల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది. అన్నదాతల అభ్యంతరాలను పరిష్కరించాకే ముందుకెళ్లాలని, అప్పటివరకు యథాతథ స్థితి కొనసాగించాలని ఉన్నత న్యాయస్థానం సోమవారం ఆదేశించింది.

రాజధాని పరిధిలోని గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పెనుమాక గ్రామానికి చెందిన 660.83 ఎకరాలకు ఏపీ ప్రభుత్వం ఇటీవల నోటిఫికేషన్‌ జారీచేసింది. దీంతో 904 మంది భూ యజమానులు ప్రభావితులు అవుతారని ఆ నోటిఫికేషన్‌లో పేర్కొంది. భూములు ఇచ్చేందుకు ఇష్టపడని రైతులు హైకోర్టును ఆశ్రయించారు.

హైకోర్టు తాజాగా ఇచ్చిన ఆదేశాలను పెనుమాక రైతులు స్వాగతించారు. ప్రభుత్వం తమను భయభ్రాంతులకు గురిచేసి భూములు గుంజుకునేందుకు ప్రయత్నిస్తోందని వాపోయారు. తమ తరపున పోరాడుతున్నందుకు వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి, ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. గ్రామ తీర్మానాలు చేసినా పట్టించుకోకుండా భూములు లాక్కునేందుకు చంద్రబాబు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఎమ్మెల్యే ఆర్కే ఆరోపించారు. రాజధాని రైతులకు అండగా ఉంటామని పునరుద్ఘాటించారు.

మరిన్ని వార్తలు