గౌతమ్‌ను కోర్టు ముందు హాజరుపరచండి

26 Sep, 2014 02:02 IST|Sakshi

* ఏపీ స్పీకర్ కోడెల కోడలు పిటిషన్‌పై హైకోర్టు
* పోలీసులకు ఆదేశం.. విచారణ నేటికి వాయిదా

 
సాక్షి, హైదరాబాద్: ‘నా కుమారుడు గౌతమ్‌ను ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు కుమారుడు, నా భర్త అయిన శివరామకృష్ణ కిడ్నాప్ చేశారు. నా కొడుకును కోర్టు ముందు హాజరుపరిచేలా పోలీసులను ఆదేశించండి అంటూ కోడెల కోడలు పద్మప్రియ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు స్పందించింది. గౌతమ్‌ను శుక్రవారం ఉదయం కోర్టు ముందు హాజరుపరచాలని జూబ్లీహిల్స్ పోలీసులను ఆదేశించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కళ్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా, న్యాయమూర్తి జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం గురువారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.
 
గౌతమ్‌ను పద్మప్రియ నుంచి పలుమార్లు బలవంతంగా తీసుకెళ్లిన శివరామకృష్ణ ఈ నెల 17న కొందరు వ్యక్తులతో కలిసి విశాఖపట్నం వచ్చి కిడ్నాప్ చేసి తీసుకెళ్లారని ఆమె తరఫు న్యాయవాది కోర్టుకు నివేదించారు. దీనిపై ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని తెలిపారు. గౌతమ్‌ను తీసుకెళ్లిన వారి వెంట విశాఖ త్రీ టౌన్ సీఐ ఉన్నట్లు తెలుసుకున్న సీజే తీవ్రంగా స్పందించారు. ‘‘ఈ కేసు పూర్తిగా సివిల్ వ్యవహారం. సివిల్ కేసులతో పోలీసులకేం పని? పిల్లవాడిని తీసుకెళ్లిన వారివెంట సీఐ ఎందుకున్నారు? కోర్టు ఉత్తర్వులు లేకుండా ఆ పిల్లవాడిని తండ్రి బలవంతంగా ఎలా తీసుకెళతారు? ఇందుకు పోలీసులు ఎలా సాయం చేస్తారు?’’ అని ఆంధ్రప్రదేశ్ అడ్వకేట్ జనరల్ పి.వేణుగోపాల్‌ను ప్రశ్నించారు.
 
పిల్లాడు ఎక్కడున్నాడని ధర్మాసనం ప్రశ్నించగా... హైదరాబాద్‌లో తండ్రి వద్ద ఉన్నాడని, అతన్ని తల్లికి అప్పగించేలా ఆదేశాలివ్వాలని పిటిషనర్ తరఫు న్యాయవాది కోరారు. వెంటనే ధర్మాసనం స్పందిస్తూ... గౌతమ్‌ను కోర్టు ముందు హాజరుపరచాలని, ఆ మేర పోలీసులకు సూచనలు ఇవ్వాలని ఏజీకి స్పష్టం చేసింది. పిల్లాడు ప్రస్తుతం హైదరాబాద్, జూబ్లీహిల్స్‌లో ఉన్నాడని, అతన్ని తీసుకురావడంలో ఆంధ్రప్రదేశ్ పోలీసులకు కొంత అసౌకర్యం ఉందని వేణుగోపాల్ నివేదించారు. దీంతో గౌతమ్‌ను కోర్టు ముందు హాజరుపరిచేలా పోలీసులకు సూచనలు చేయాలని కోర్టులో ఉన్న తెలంగాణ అడ్వకేట్ జనరల్ కె.రామకృష్ణారెడ్డికి ధర్మాసనం స్పష్టం చేసింది. కేసు విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది.

మరిన్ని వార్తలు