సహ విద్యార్థినులను ప్రశ్నించలేదేం?

21 Apr, 2018 02:16 IST|Sakshi

 ఆయేషా మీరా హత్య కేసులో సిట్‌ను ప్రశ్నించిన హైకోర్టు 

సాక్షి, హైదరాబాద్‌: బీఫార్మసీ విద్యార్థిని ఆయేషా మీరా హత్య కేసుపై సిట్‌ చేస్తున్న దర్యాప్తుపై హైకోర్టు అసంతృప్తిని వ్యక్తం చేసింది. ఆయేషా మీరాతోపాటు హాస్టల్‌లో ఉన్న విద్యార్థినుల వాంగ్మూలాన్ని ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించింది. ‘ఆయేషా హత్య జరిగిన హాస్టల్‌లో వంద మంది ఉన్నారు.

అలాంటి చోట ఆయేషాను తలమీద కొట్టి హత్య చేస్తే పక్కనే ఉన్నవాళ్లు ఏమీ మాట్లాడటం లేదంటే అందుకు భయమే కారణం కావచ్చు. ఇప్పుడు సాగుతున్న దర్యాప్తును చూస్తుంటే, గతంలో విచారించిన వాళ్లనే మళ్లీ విచారిస్తున్నట్లు ఉంది. నిష్పాక్షికంగా, నిజాయితీగా దర్యాప్తు జరపండి’అని సిట్‌ని ఉద్దేశించి కోర్టు వ్యాఖ్యానించింది. దర్యాప్తు పురోగతికి సంబంధించిన వివరాలతో సీల్డ్‌ కవర్‌లో నివేదిక సమర్పించాలని సిట్‌కు నేతృత్వం వహిస్తున్న విశాఖ రేంజ్‌ డీఐజీ సీహెచ్‌ శ్రీకాంత్‌కు స్పష్టం చేసింది.

తదుపరి విచారణను జూలై 13కి వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్‌ రమేశ్‌ రంగనాథన్, న్యాయమూర్తి కొంగర విజయలక్ష్మిలతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.

మరిన్ని వార్తలు