వంశపారంపర్య అర్చకులుగా కొనసాగవచ్చు

28 Jun, 2018 03:20 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: వంశ పారంపర్య అర్చకత్వంపై వివాదం నడుస్తున్న నేపథ్యంలో హైకోర్టు ఇటీవల కీలక తీర్పునిచ్చింది. ఆంధ్రప్రదేశ్‌ దేవాదాయ చట్టం 1987 ప్రకారం అర్హులైన అర్చక కుటుంబ సభ్యులు వంశపారంపర్య అర్చకులుగా కొనసాగవచ్చునని హైకోర్టు స్పష్టం చేసింది. రద్దు చేసిన 17/1966 ఏపీ దేవాదాయ చట్టంలో అర్హులైన అర్చక కుటుంబ సభ్యులుగా అర్చకత్వంలో ఎవరైతే కొనసాగుతూ ఉన్నారో, వారికి వంశపారంపర్య అర్చకులుగా కొనసాగే హక్కు ఉందని హైకోర్టు తేల్చి చెప్పింది. అంతేకాక వంశపారంపర్య అర్చకుడికి కొడుకులు లేని పక్షంలో అతని కుమార్తె కొడుకు (మనుమడు) సైతం వంశపారంపర్య అర్చకుడిగా కొనసాగవచ్చునని స్పష్టం చేసింది. వంశపారంపర్య ప్రధాన అర్చకుడిగా కొనసాగుతూ వచ్చిన రమణదీక్షితులను ఆ పదవి నుంచి టీటీడీ అధికారులు ఇటీవల తప్పించిన నేపథ్యంలో ఈ తీర్పునకు ప్రాధాన్యత ఏర్పడింది.  

వివరాల్లోకి వెళితే కృష్ణా జిల్లా, కంకిపాడులోని శ్రీరామలింగేశ్వర స్వామి దేవస్థానంలో.. స్వర్ణ గధాధరబాబు తన తాత మరణించిన నాటి (1984) నుంచి ఆయన రాసిన వీలునామా ప్రకారం  వంశపారంపర్య అర్చకుడిగా కొనసాగుతున్నారు. మిగిలిన వంశపారంపర్య అర్చకులతో కలిసి ప్రతి మూడేళ్లకొకసారి ఏడాది పాటు అర్చకత్వ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మిగిలిన 2 సంవత్సరాలు కుటుంబ జీవనం నిమిత్తం మరోచోట ఓ చిరు వ్యాపారం చేసుకుంటున్నారు. దీనిని కారణంగా చూపుతూ గధాధరబాబును అర్చకత్వ బాధ్యతల నుంచి తప్పిస్తూ, అతని స్వాధీనంలో ఉన్న 3.30 ఎకరాల భూమిని సైతం తమ స్వాధీనంలోకి తీసుకుంటూ దేవాదాయశాఖ ప్రాంతీయ సంయుక్త కమిషనర్‌ 2017లో ప్రొసీడింగ్స్‌ జారీ చేశారు. దీనిని సవాలు చేస్తూ గధాధరబాబు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై న్యాయమూర్తి జస్టిస్‌ బి.శివశంకరరావు విచారణ జరిపారు.

దేవాదాయ చట్టం 1987 ప్రకారం 1966లో రద్దు చేసిన దేవాదాయ చట్టంలో ఎవరైతే వంశపారంపర్య అర్చకత్వ కుటుంబ సభ్యులుగా కొనసాగుతున్నారో వారు వంశపారంపర్య అర్చకులుగా కొనసాగవచ్చునని తీర్పునిచ్చారు. అంతేకాక 33/2007లో తీసుకొచ్చిన సవరణ చట్టంలో పితృ లేదా మాతృ అన్న పదాలు లేవని,b వంశపారంపర్య అర్చక కుటుంబ సభ్యులని మాత్రమే ఉందన్న పిటిషనర్‌ వాదనతో న్యాయమూర్తి ఏకీభవించారు. వంశపారంపర్య ఆర్చకునికి కుమారులు లేనప్పుడు కుమార్తె కుమారుడు సైతం వంశపారంపర్య అర్చకునిగా కొనసాగేందుకు 2007 సవరణ చట్టం అవకాశం కల్పిస్తోందని జస్టిస్‌ శివశంకరరావు స్పష్టం చేశారు. గధాధరబాబు అర్చకత్వాన్ని రద్దు చేస్తూ ప్రాంతీయ సంయుక్త కమిషనర్‌ ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేశారు. తిరిగి అతనికి అర్చకత్వ బాధ్యతలు అప్పగించడంతో పాటు 3.30 ఎకరాలను స్వాధీనం చేయాలని ఆదేశించారు.  

రమణ దీక్షితుల తొలగింపు తప్పుని తేలింది: ఏపీ అర్చక సమాఖ్య 
ఆయనను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్‌
కృష్ణా జిల్లా కంకిపాడు శ్రీరామలింగేశ్వరస్వామి ఆలయంలో పనిచేసే వంశపారంపర్య అర్చకుని విషయంలో హైకోర్టు వెలువరించిన తీర్పుతో తిరుమల ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు తొలగింపు చట్టవిరుద్ధమని స్సష్టమైందని ఆంధ్రప్రదేశ్‌ అర్చక సమాఖ్య బుధవారం ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ తీర్పు తిరుమల వివాదానికి ఒక పరిష్కారం సూచించిందని.. ఉన్నత న్యాయస్థానాల తీర్పును ప్రభుత్వం గౌరవించి రమణదీక్షితులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని ఏపీ అర్చక సమాఖ్య ప్రధాన కార్యదర్శి ఆత్రేయబాబు,  కార్యదర్శి పి.రాంబాబు  ఆ ప్రకటనలో డిమాండ్‌ చేశారు. 2007లో అప్పటి సీఎం రాజశేఖర్‌రెడ్డి పాత దేవదాయ చట్టానికి సవరణ చేసి అర్చకుల వంశపారంపర్య హక్కులు పునరుద్ధరించినప్పటికీ, ఆ ఫలితాలు పూర్తి స్థాయిలో అర్చకులకు అందకుండా నేటి ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయని తప్పుపట్టారు. 

మరిన్ని వార్తలు