ప్రజావేదిక కూల్చివేతపై స్టేకు హైకోర్టు నో

26 Jun, 2019 09:00 IST|Sakshi

సాక్షి, అమరావతి : కృష్ణా నది కరకట్టపై గత టీడీపీ ప్రభుత్వం అక్రమంగా నిర్మించిన ప్రజావేదికను కూల్చివేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ మంగళవారం హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్‌) దాఖలైన సంగతి తెలిసిందే. అయితే ప్రజావేదికను కూల్చివేయకుండా అడ్డుకోవలంటూ దాఖలైన పిల్‌పై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు నిరాకరించింది. ప్రజావేదిక అక్రమ నిర్మాణమేనంటూ పిటిషనర్‌ తన వ్యాజ్యంలో పలుమార్లు పేర్కొన్న సంగతిని హైకోర్టు ప్రస్తావించింది. ప్రజావేదిక భవనం అక్రమమా? కాదా? అని హైకోర్టు పిటిషనర్‌ను ప్రశ్నించింది. అలాంటప్పుడు ఇందులో ప్రజాప్రయోజన వ్యాజ్యం ఏముందని సూటిగా ప్రశ్నించింది. రాష్ట్ర ప్రభుత్వం తరపున వాదనలను వినిపించిన అడ్వకేట్‌ జనరల్‌ శ్రీరాం వాదనలను ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు పూర్తిగా సమర్థించింది. ప్రజావేదిక ఖర్చును తిరిగి రాబట్టాలన్న అంశంపై విచారణ కొనసాగిస్తామని వెల్లడించింది. ఈ అంశంపై విచారణను నాలుగు వారాలకు హైకోర్టు వాయిదా వేసింది.

కాగా ప్రజా వేదికను కూల్చివేయకుండా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ ప్రకాశం జిల్లా స్వర్ణకు చెందిన పోలూరి శ్రీనివాసరావు ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. మంగళవారం రాత్రి హౌస్‌ మోషన్‌ రూపంలో ఆయన అత్యవసరంగా ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఇందులో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, నీటి వనరుల శాఖ ముఖ్య కార్యదర్శి, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి, రహదారులు, భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి తదితరులతో పాటు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, మాజీ మంత్రి పి.నారాయణలను ప్రతివాదులుగా పేర్కొన్నారు. ఈ వ్యాజ్యంపై న్యాయమూర్తులు జస్టిస్‌ ఎం.సీతారామమూర్తి, జస్టిస్‌ జి.శ్యాంప్రసాద్‌లతో కూడిన ధర్మాసనం అత్యవసరంగా విచారణ జరిపింది.

మరిన్ని వార్తలు