ఫిరాయింపులపై మేమే తేలుస్తాం! 

30 Nov, 2018 03:00 IST|Sakshi

హైకోర్టు ధర్మాసనం స్పష్టీకరణ 

సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం విచారణతో సంబంధంలేదు 

ప్రస్తుతం ఉన్న చట్ట నిబంధనలు, తీర్పుల ప్రకారం విచారణ జరుపుతాం 

8 నెలలుగా కౌంటర్లు దాఖలు చేయకపోవడంపై అసంతృప్తి 

 ఏ అధికారంతో కొనసాగుతున్నారో చెప్పాలని ఎందుకు ఆదేశించకూడదు? 

వివరణ ఇవ్వాలని ఫిరాయింపుదారులకు మరోసారి ధర్మాసనం నోటీసులు 

స్పీకర్‌కు సైతం జారీ.. విచారణ రెండు వారాలకు వాయిదా 

సాక్షి, హైదరాబాద్‌: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తరఫున గెలిచి అధికార తెలుగుదేశం పార్టీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలకు నోటీసులు జారీచేసి ఎనిమిది నెలలు కావొస్తున్నా ఇప్పటివరకు ఒక్కరు కూడా కౌంటర్‌ దాఖలు చేయకపోవడంపై హైకోర్టు తీవ్ర అసంతృప్తిని వ్యక్తంచేసింది. సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసన విచారణతో సంబంధం లేకుండా, ప్రస్తుతం అమల్లో ఉన్న చట్ట నిబంధనల ప్రకారం ఫిరాయింపుల వ్యవహారాన్ని తేలుస్తామని హైకోర్టు స్పష్టంచేసింది. ఇందులో భాగంగా గతంలో నోటీసులకు స్పందించని ఫిరాయింపుదారులందరికీ హైకోర్టు గురువారం మరోసారి నోటీసులు జారీచేసింది. అలాగే, ఫిరాయించిన తరువాత మంత్రులైన నలుగురికి కూడా నోటీలిచ్చింది. పార్టీ ఫిరాయించిన నేపథ్యంలో ఏ అధికారంతో ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్నారో వివరణ ఇవ్వాలంటూ ఎందుకు ఆదేశాలు జారీ చేయరాదో చెప్పాలని కూడా ఆదేశించింది.

ఇదే సమయంలో ఈ కేసులో స్పీకర్‌ను ప్రతివాదిగా చేరుస్తూ దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌ను హైకోర్టు అనుమతించింది. దీంతో స్పీకర్‌కు సైతం నోటీసులు జారీ అయ్యాయి. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ తొట్టతిల్‌ బి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీచేసింది. కాగా, హైకోర్టు నోటీసులు జారీచేసిన వారిలో ఫిరాయింపుదారులు బుడ్డా రాజశేఖరరెడ్డి, అత్తారు చాంద్‌ బాషా, గొట్టిపాటి రవికుమార్, జలీల్‌ఖాన్, కలమట వెంకటరమణ, ఎం. మణిగాంధీ, పాలపర్తి డేవిడ్‌రాజు, తిరివీధి జయరాములు, జ్యోతుల నెహ్రూ, పాశం సునీల్‌కుమార్, వరుపుల సుబ్బారావు, ఎస్వీ మోహన్‌రెడ్డి, పోతుల రామారావు, ఎం.అశోక్‌రెడ్డి, గిడ్డి ఈశ్వరి, వి. రాజేశ్వరిలతో పాటు మంత్రులుగా కొనసాగుతున్న చిదిపిరాళ్ల ఆదినారాయణరెడ్డి, అమర్‌నాథ్‌రెడ్డి, భూమా అఖిలప్రియ, రావు వెంకట సుజయకృష్ణ రంగారావు ఉన్నారు. 

అంతకుముందు.. వైఎస్సార్‌సీపీ నుంచి గెలుపొంది, ఆ తరువాత టీడీపీలోకి ఫిరాయించిన 22 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని, అలాగే.. మంత్రి పదవులు అనుభవిస్తున్న నలుగురిని వివరణ కోరాలంటూ గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే అన్నా వెంకటరాంబాబు.. అలాగే, ఫిరాయింపుదారులపై చర్యలు తీసుకునేలా స్పీకర్‌ను ఆదేశించాలని కోరుతూ పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన వీర్ల సతీశ్‌కుమార్‌ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్‌) దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ రెండు వ్యాజ్యాలపై గురువారం సీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. 

ప్రతివాదులుగా స్పీకర్, ఎన్నికల సంఘం 
ఈ సందర్భంగా పిటిషనర్ల తరఫు సీనియర్‌ న్యాయవాది సీవీ మోహన్‌రెడ్డి స్పందిస్తూ, ప్రతివాదులందరికీ హైకోర్టు నోటీసులు జారీచేసి 8 నెలలు కావొస్తున్నా ఇప్పటివరకు కౌంటర్లు దాఖలు చేయలేదని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. అలాగే స్పీకర్, కేంద్ర ఎన్నికల సంఘాలను ప్రతివాదులుగా చేర్చిన విషయాన్నీ ప్రస్తావించి అనుబంధ వ్యాజ్యాలను ధర్మాసనం ముందుంచారు. వాటిని పరిశీలించిన ధర్మాసనం, 8 నెలలుగా ప్రతివాదులెవ్వరూ కౌంటర్లు దాఖలు చేయకపోవడంపై అసంతృప్తి వ్యక్తంచేసింది. అంతేకాక, స్పీకర్‌ను ప్రతివాదిగా చేరుస్తూ దాఖలు చేసిన అనుబంధ పిటిషన్లను అనుమతించి  ఫిరాయింపుదారులందరికీ నోటీసులు జారీచేసింది. ఉప్పులేటి కల్పన తరఫు న్యాయవాది వకాలత్‌ ఇవ్వడంతో ఆమెకు నోటీసులు ఇవ్వలేదు. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలంటూ విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.   

మరిన్ని వార్తలు