హైకోర్టును సీమలోనే ఏర్పాటు చేయాలి

27 Feb, 2018 02:05 IST|Sakshi

రాయలసీమ ప్రాంత న్యాయవాదుల డిమాండ్‌

సాక్షి, హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టును రాయలసీమలోనే ఏర్పాటు చేయాలని హైకోర్టులోని రాయలసీమ ప్రాంత న్యాయవాదులు డిమాండ్‌ చేశారు. అమరావతిలో హైకోర్టు ఏర్పాటు చేయాలన్నది ప్రభుత్వ ఏకపక్ష నిర్ణయమన్నారు. సోమవారం భోజన విరామ సమయంలో పెద్ద ఎత్తున న్యాయవాదులు హైకోర్టు గేటు ఎదుట సమావేశమై, రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు కోసం నినాదాలు చేశారు. రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు కోసం ఉద్యమం చేస్తున్న న్యాయవాదులను అరెస్ట్‌ చేయడాన్ని ఖండించారు. అక్రమ అరెస్టులతో ఉద్యమాన్ని అణచలేరన్నారు.

తమది గొంతెమ్మ కోర్కె కాదని, న్యాయబద్ధంగా తమకు దక్కాల్సిన దానినే తాము కోరుతున్నామన్నారు. అభివృద్ధిని మొత్తం ఒకే ప్రాంతంలో కేంద్రీకరించరాదని పునర్విభజన చట్టంలో స్పష్టంగా ఉందని, దీని ప్రకారం సచివాలయం, హైకోర్టు వంటి వాటిని ఒకే చోట ఏర్పాటు చేయడం సరికాదన్నారు. రాయలసీమలో హైకోర్టు ఏర్పాటుకు చారిత్రక నేపథ్యం ఉందన్నారు. రాష్ట్రంలో మిగిలిన ప్రాంతాలతో పోలిస్తే రాయలసీమ వెనుకబడి ఉందని, ఈ ప్రాంతం అభివృద్ధి కావాలంటే హైకోర్టు ఏర్పాటు చేయడం అత్యవసరమన్నారు.  గత నెల రోజులుగా న్యాయవాదులు రాయలసీమ వ్యాప్తంగా ఉద్యమం చేస్తుంటే, తెలుగుదేశం ప్రభుత్వం అణిచివేసేందుకు అనేక విధాలుగా ప్రయత్నిస్తోందన్నారు. 

మరిన్ని వార్తలు