చదువుకోనివ్వరా.?

25 Jan, 2019 07:08 IST|Sakshi
మంత్రి గంటా కార్యక్రమం కోసం ఏయూ కాన్వొకేషన్‌ హాల్‌ ఆవరణలో ఎండలో నిరీక్షిస్తున్న విద్యార్థినులు(ఫైల్‌)

విద్యార్థుల్ని వీధుల్లో తిప్పుతారా.?

విద్యను ప్రమాదంలో పడేస్తే చూస్తూ ఊరుకోమంటూ హైకోర్టు చురక

ప్రభుత్వం తీరు మారాలంటున్న తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు

ప్రైవేటు స్కూళ్లతో పోటీపడి వాటికి ధీటుగా విద్యనందించి, శత శాతం ఫలితాలు సాధించాలని ఊదరగొడుతున్న సర్కారు.. క్షేత్రస్థాయిలో మాత్రం దానికి విరుద్ధంగా వ్యవహరిస్తోంది. అరకొర పుస్తకాలు, మౌలిక సదుపాయాలను అంతంత మాత్రంగానే కల్పిస్తున్న విషయం పక్కన పెడితే.. దీక్షలు, అవగాహన సదస్సుల పేరుతో విద్యార్థుల్ని పాఠశాలలో కంటే.. బయటే ఎక్కువగా ఉండేలా చేస్తోంది. ప్రభుత్వ విభిన్న వైఖరి వల్ల తొలి ఆరున్నర నెలల విద్యా సంవత్సరంలో సగం రోజుల పాటు బడి బయటే ఉన్నారు. ఈ కారణంగా వారికి విద్యాబోధన కష్టంగా మారుతోందంటూ ఉపాధ్యాయులు వాపోతున్నారు. ప్రభుత్వం అనుసరిస్తున్న ఈ అనుచిత విధానం.. పిల్లల చదువులకు గుదిబండలా మారుతోంది.

విశాఖ సిటీ: 2018 డిసెంబర్‌ 28న ప్రారంభమైన విశాఖ ఉత్సవ్‌కు విశాఖ వ్యాలీ స్కూల్‌కు చెందిన విద్యార్థుల్ని బీచ్‌ రోడ్డుకు తరలించారు. అందర్నీ వరుస క్రమంలో నిలబెట్టిన ఉపాధ్యాయులకు హఠాత్తుగా మరో వైపునకు విద్యార్థుల్ని మార్చాలని అధికారులు ఆదేశించారు. ఇంతలో ఓ విద్యార్థి రోప్‌ తగిలి కిందపడిపోయాడు. చేయి విరిగి ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు. ఇంత జరిగినా ఈ ఘటన వెలుగులోకి రాలేదు.‘ప్రభుత్వం నిర్వహించే కార్యక్రమాల్లో పాల్గొన్న పాఠశాల విద్యార్థుల్ని ప్రమాదంలో పడేస్తామంటే అంగీకరించేది లేదు. ఈ అంశంలో చట్ట నిబంధనలు ఏమి చెబుతున్నాయో తక్షణమే తెలియజేయండి. అసలు ప్రభుత్వం నిర్వహించే కార్యక్రమాలకు విద్యార్థుల్ని ఎలా తరలిస్తారు.?’  – ఈ నెల 22న ఏపీ సర్కారుపై హైకోర్టు చేసిన వ్యాఖ్యలివి.

రాష్ట్ర అత్యున్నత ధర్మాసనం పైన జరిగిన విశాఖ ఉత్సవ్‌ ఘటనను అనుసరించి ఈ వ్యాఖ్యలు చేయకపోయినా.. అదే తరహాలో సంఘటన జరగడం దురదృష్టం. హైకోర్టు చెప్పింది అక్షర సత్యమే. ఎందుకంటే.. నాలుగున్నరేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం ఏ చిన్న కార్యక్రమాన్ని తలపెట్టినా  సర్కారు బడుల్లో విద్యనభ్యసిస్తున్న చిన్నారులనే పావులుగా వాడుకుంటున్నారు. అందుకే ఓల్డ్‌ స్టూడెంట్స్‌ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి ఎ.రామకృష్ణ ఈ వ్యవహారంపై హైకోర్టును ఆశ్రయించారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల్ని సర్కారు కార్యక్రమాలకు తీసుకెళ్లడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ హైకోర్టులో వేసిన పిటిషన్‌పై తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి(ఏసీజే) జస్టిస్‌ సి.ప్రవీణ్‌కుమార్, జసిస్ట్‌ ఎం.సత్యనారాయణమూర్తిలతో కూడిన ధర్మాసనం పైవిధంగా స్పందించింది. దీనిపై చట్ట నిబంధనలు ఏం చెబుతున్నాయో తెలియజేయాలని చంద్రబాబు ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణను వారం రోజులు వాయిదా వేసింది.

పిల్లలా.. పార్టీ కార్యకర్తలా?
ఇప్పుడిప్పుడే విద్యా బోధనలో మార్పులు వచ్చి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తున్నాయంటూ ప్రభుత్వ పాఠశాలలపై విశ్వాసం మొదలైంది. కానీ అది మూణ్ణాళ్ల ముచ్చటగా మార్చేసేందుకు స్వయంగా సర్కారే పూనుకుంటోంది. రాష్ట్ర ప్రభుత్వ అసందర్భ విధానాల వల్ల ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల భవిష్యత్తు తరగదిలో కంటే.. రోడ్లపైనే ఎక్కువగా కనిపిస్తోంది. ఓవైపు 100 శాతం ఉత్తీర్ణత రావాలి, ప్రతి విద్యార్థికీ నాణ్యమైన విద్యను అందించాలంటూ ఉపాధ్యాయులపై తీవ్ర ఒత్తిడి తీసుకొస్తున్న ప్రభుత్వం.. మరోవైపు  విద్యార్థుల్ని స్కూళ్లకు పరిమితం చేయకుండా ఇతర పనులకు వినియోగించేలా వ్యవహరిస్తోంది. పాఠశాలలు ప్రారంభమైనప్పటి నుంచి వరుసగా సర్కారు బడుల్లో చదువుతున్న పిల్లల్ని ప్రభుత్వ కార్యక్రమాలకు వినియోగించేస్తున్నారు. ఓ విధంగా చెప్పాలంటే.. తమ సభల్లో జనం సరిపడనంత రాకపోతుండటంతో పాఠశాల విద్యార్థులతోనే సభా ప్రాంగణం నింపేస్తున్నారు.

నవ నిర్మాణ దీక్షలు మొదలుకొని..!
విద్యా సంవత్సరం ప్రారంభమైన తొలినాళ్ల నుంచి ప్రభుత్వం ఇతర కార్యక్రమాలకు విద్యార్థుల్ని పావులుగా వాడుకుంటోంది. నవనిర్మాణ దీక్షల పేరుతో వారం రోజుల పాటు పిల్లల జీవితాలతో చెలగాటమాడారు. స్కూలుకు వచ్చిన పిల్లల్ని పాఠశాల సమీపంలో జరిగే దీక్షల వద్దకు తీసుకెళ్లడం, అక్కడ రాజకీయ ప్రసంగాలు ముగిసిన తర్వాత ర్యాలీలు, మానవహారాలు నిర్వహించి ఇంటికి పంపించేయడం.. ఇదే తంతు వారం రోజుల పాటు కొనసాగించారు. ఈ మధ్య జ్వరాలు ప్రబలినప్పుడు కూడా విద్యార్థులే ప్రచారకర్తలుగా మారిపోయారు. మహా విశాఖ నగర పరిధిలో డెంగ్యూ, మలేరియా మొదలైన జ్వర బాధితుల సంఖ్య విపరీతంగా పెరిగిపోవడంతో ప్రజల్లో అవగాహన కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది.ఈ అవగాహన కోసం విద్యార్థుల చదువుల్ని పక్కన పెట్టేశారు. వారిని మళ్లీ రోడ్లపైకి తీసుకొచ్చి అవగాహన ర్యాలీలు నిర్వహించారు. ఇదో పది రోజుల ప్రహసనం. ఇటీవల కాలంలో జరిగిన బంద్‌లు, ధర్నాలు, సెలవులు.. ఇలా లెక్కించుకుంటూ పోతే ప్రతి విద్యా సంవత్సరం విద్యార్థుల చదువులు సగమైనా పూర్తి కావనీ ఉపాధ్యాయలు, తల్లిదండ్రులు వాపోతున్నారు. మరోవైపు పిల్లలను ఇలా ప్రభుత్వ కార్యక్రమాలకు తరలించడంపై విద్యార్థి సంఘాలు సైతం మండిపడుతున్నాయి.

రాజ్యాంగ విరుద్ధం
ప్రభుత్వ రాజకీయ కార్యక్రమాలకు విద్యార్థుల్ని తీసుకెళ్లడం రాజ్యాంగ విరుద్ధం. వారికి ఏ మాత్రం సంబంధం లేకపోయినా ప్రభుత్వ పెద్దల ఒత్తిడి కారణంగా అధిక సంఖ్యలో విద్యార్థుల్ని తరలిస్తుంటారు. సభా ప్రాంగణంలో తొక్కిసలాటకు గురికావడం, మండుటెండలో కళ్లుతిరిగి పడిపోవడం వంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేయడం హర్షదాయకం.
– కె వాసు, జనజాగరణ సమితి రాష్ట్ర కన్వీనర్‌

మరిన్ని వార్తలు