పచ్చ నేతల పనికి ఇబ్బందులు పడ్డ అధికారులు

10 Feb, 2019 04:48 IST|Sakshi
మోదీ రాకను నిరసిస్తూ గన్నవరం ఎయిర్‌పోర్టు వద్ద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ

హోర్డింగ్‌లపై హైడ్రామా

సాక్షి, అమరావతి బ్యూరో: ప్రధాని మోదీ రాష్ట్ర పర్యటన నేపథ్యంలో టీడీపీ మరో రాజకీయ హైడ్రామాకు తెరతీసింది. మోదీ పర్యటనను వ్యతిరేకిస్తూ విజయవాడ, గుంటూరులలో హోర్డింగులను ఏర్పాటు చేసింది. ప్రధాని మోదీ ఆదివారం గుంటూరులో పర్యటించనున్నారు. పలు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం గుంటూరులో బహిరంగసభలో ప్రసంగిస్తారు. ఈ నేపథ్యంలో మోదీ రాష్ట్ర పర్యటనను వ్యతిరేకిస్తూ టీడీపీ గన్నవరం విమానాశ్రయం నుంచి విజయవాడ మీదుగా గుంటూరు వరకు పలుచోట్ల హోర్డింగులు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయించింది. ‘మోదీ గో బ్యాక్‌’ అంటూ ఉన్న పెద్దపెద్ద హోర్డింగులను శుక్రవారం అర్ధరాత్రి తరువాత ఏర్పాటు చేశారు.

నిబంధనల ప్రకారం హోర్డింగులు, కరపత్రాల కింద వాటిని ముద్రించినవారి పేర్లు, ముద్రణ సంస్థల పేర్లు ఉండాలి. అయితే ఆ హోర్డింగులు ఎవరు ఏర్పాటు చేశారో వారి పేర్లుగానీ, వాటిని రూపొందించిన ప్రచురణ సంస్థల పేర్లుగానీ లేవు. కొన్నాళ్లుగా రాష్ట్ర ప్రభుత్వ పథకాలు, టీడీపీ కార్యక్రమాల ప్రచారం కోసం ఏర్పాటు చేసిన హోర్డింగుల స్థానంలోనే ‘మోదీ గో బ్యాక్‌’ హోర్డింగులు పెట్టారు. రాష్ట్ర ప్రభుత్వ పథకాల ప్రచార కాంట్రాక్టు పొందిన సంస్థతోనే ఈ హోర్డింగులు ఏర్పాటు చేయించారని సమాచారం.

సందిగ్ధంలో అధికారులు 
అనుమతుల్లేకుండా ఏర్పాటు చేసిన ఈ హోర్డింగులపై ఎలా స్పందించాలో అర్థమవక అధికారులు మల్లగుల్లాలు పడ్డారు. రాష్ట్రప్రభుత్వమే తెరవెనుక ఉండి ఏర్పాటు చేయడంతో.. వాటిని తొలగించేందుకు అధికారులు శనివారం సాయంత్రం వరకూ సాహసించలేకపోయారు. అయితే ప్రధాని పర్యటన ఏర్పాట్ల పరిశీలనకు వచ్చిన కేంద్ర ప్రభుత్వ, ఎస్‌పీజీ ఉన్నతాధికారులు ఈ హోర్డింగులపై తీవ్రంగా స్పందించినట్లు సమాచారం.

వాటిని ఎవరు ఏర్పాటు చేశారో తెలపాలని కృష్ణా, గుంటూరు జిల్లాల రెవెన్యూ, పోలీసు ఉన్నతాధికారులను సూటిగా ప్రశ్నించినట్లు తెలుస్తోంది. దీనిపై ఏం చెప్పాలో తెలియక రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఇబ్బందిపడ్డారు. దీనిపై తీవ్రంగా స్పందించిన కేంద్రప్రభుత్వ ఉన్నతాధికారులు వెంటనే ఆ హోర్డింగులను తొలగించాలని ఆదేశించారు. దాంతో తర్జనభర్జనల అనంతరం రాష్ట్ర పోలీసు, రెవెన్యూ అధికారులు శనివారం సాయంత్రం తరువాత ఆ హోర్డింగులలో కొన్నింటిని తొలగించారు.

>
మరిన్ని వార్తలు