డీఆర్‌ఓ పోస్టుకు పైరవీల జోరు

26 Sep, 2013 03:38 IST|Sakshi

సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్‌ఓ) పోస్టు కోసం పైరవీలు ఊపందుకున్నాయి. రెవెన్యూ విభాగంలో హాట్‌సీటుగా పరిగణించే ఈ కుర్చీని ఎగరేసుకుపోయేందుకు ఆశావహులు పెద్దస్థాయిలో లాబీయింగ్ చేస్తున్నారు. ప్రస్తుతం డీఆర్‌ఓగా వ్యవహరిస్తున్న కె.రాములు ఈ నెలాఖరున పదవీ విరమణ చేయనున్నారు. పది నెలల క్రితం డీఆర్‌ఓగా నియమితులైన రాములు అనారోగ్యం కారణంగా ఎక్కువ కాలం సెలవులోనే  ఉన్నారు.
 
 పదిహేను రోజుల క్రితం మరోమారు తీవ్ర అస్వస్థతకు గురికావడంతో మళ్లీ సెలవు పెట్టాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో ఖాళీఅయ్యే డీఆర్‌ఓ కుర్చీని దక్కించుకునేందుకు పలువురు తెరవెనుక మంత్రాంగం నెరుపుతున్నారు. జిల్లా పాతకాపులే ఎక్కువగా ఈ సీటు రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. కరీంనగర్ డీఆర్‌ఓ కృష్ణారెడ్డి, పోస్టింగ్ కోసం నిరీక్షిస్తున్న వెంకటేశ్వర్లు సహా హెచ్‌ఎండీఏలో జోనల్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న సురేశ్‌పొద్దార్, యూఎల్‌సీలో అదనపు ఎస్‌ఓగా పనిచేస్తున్న వెంకటేశ్వర్లు, నిజామాబాద్‌లో పనిచేస్తున్న అశోక్‌కుమార్ కూడా డీఆర్‌ఓ పదవి ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. రాజధానికి చేరువలో ఉన్న రంగారెడ్డి జిల్లాలో భూముల విలువలు గణనీయంగా ఉంటాయి. అదే స్థాయిలో రెవెన్యూ వివాదాలున్నాయి. వీటిని ఆసరాగా చేసుకొని రెండు చేతులా సంపాదించుకునే వీలుండడంతో ఈ పోస్టుకు డిమాండ్ ఏర్పడింది.  ఈ కుర్చీ కోసం చేతులు తడిపేందుకు అధికారులు వెనుకడుగు వేయడంలేదు.
 
మంత్రుల చుట్టూ ప్రదక్షిణలు..!
డీఆర్‌ఓ సీటుపై కన్నేసిన ఆశావహులు ఉన్నతస్థాయిలో పలుకుబడిని ఉపయోగిస్తున్నారు. తమ లక్ష్యాన్ని సాధించేందుకు మంత్రులు, గాడ్‌ఫాదర్‌లతో సిఫార్సులు చేయించుకుంటున్నారు. మంత్రులను ప్రసన్నం చేసుకునేందుకు పేషీల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. జిల్లా మంత్రి, ఇన్‌చార్జి మంత్రి సహా రెవెన్యూ మంత్రి ఆశీస్సులతో సీటు కోసం వ్యూహారచన చేశారు. కాగా, అశోక్, వెంకటేశ్వర్లును డీఆర్‌ఓగా నియమించే అంశాన్ని పరిశీలించాలని మంత్రి ప్రసాద్‌కుమార్ ప్రభుత్వానికి లేఖ రాసినట్లు తెలిసింది. అలాగే, తన జిల్లాలో డీఆర్‌ఓగా పనిచేస్తున్న కృష్ణారెడ్డి పేరును పరిశీలించాలని ఇన్‌చార్జి మంత్రి శ్రీధర్‌బాబు ఒత్తిడి చేస్తున్నట్లు సమాచా రం. మరోవైపు గతంలో పలు మండలాల్లో తహసీల్దార్‌గా పనిచేసిన పొద్దార్ కూడా డీఆర్‌ఓగా తనకో అవకాశం ఇవ్వాలని కలెక్టర్ బి.శ్రీధర్‌ను కలిశారు. కలెక్టర్ కూడా ఆయన అభ్యర్థనకు సానుకూలంగా స్పందించి లేఖ రాసినట్లు సమాచారం. ఎమ్మెల్సీ మాగం రంగారెడ్డి సిఫార్సుతో ఏఎస్‌ఓ వెంకటేశ్వర్లు కూడా ఈ సీటుపై గంపెడాశ పెట్టుకున్నారు. వీరేకాకుండా తెరవెనుక మరికొందరు ఈ కుర్చీ కోసం ప్రయత్నాలు సాగిస్తున్నారు. రెవెన్యూ మంత్రి రఘువీరారెడ్డి కూడా తన విధేయుడిని ఇక్కడ నియమించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
 

మరిన్ని వార్తలు