గ్యాస్‌ లీక్‌పై విచారణకు హైపవర్‌ కమిటీ

9 May, 2020 03:56 IST|Sakshi

ఘటనకు కారణాలపై దర్యాప్తు 

పునరావృతమవ్వకుండా చర్యలపై సిఫార్సులు 

నెలలోగా కమిటీ తుది నివేదిక 

రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులు జారీ

సాక్షి, అమరావతి: విశాఖ ఎల్జీ పాలిమర్స్‌లో గ్యాస్‌ లీకేజీ దుర్ఘటనపై కారణాలను నిగ్గు తేల్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత స్థాయి (హై పవర్‌) కమిటీని నియమించింది. కారణాలను అన్వేషించడంతోపాటు పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై  సిఫార్సులు చేయాలని కమిటీని ఆదేశించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. 

కమిటీకి నీరబ్‌కుమార్‌ ప్రసాద్‌ నేతృత్వం
అటవీ, పర్యావరణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నీరబ్‌కుమార్‌ ప్రసాద్‌  ఉన్నత స్థాయి కమిటీ చైర్మన్‌గా వ్యవహరిస్తారు. పరిశ్రమలు, వాణిజ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్‌.కరికాల వలవన్, విశాఖ కలెక్టర్‌ వినయ్‌ చంద్, విశాఖ పోలీస్‌ కమిషనర్‌ ఆర్‌కే మీనా సభ్యులుగా ఉండే ఈ కమిటీలో రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) సభ్య కార్యదర్శి వివేక్‌ యాదవ్‌ సభ్య కన్వీనరుగా వ్యవహరిస్తారు.

అధ్యయనం చేయాల్సిన అంశాలివీ..
► గ్యాస్‌ లీకేజీకి కారణాలతోపాటు భద్రతా ప్రమాణాలను కర్మాగారం పాటించిందా లేదా? అనే అంశాలను కమిటీ విచారించాలి.
► పరిసర గ్రామాలపై గ్యాస్‌ లీకేజీ ప్రభావం దీర్ఘకాలం ఉంటే నివారణ చర్యలపై కూడా సిఫార్సు చేయాలి. 
► యాజమాన్యం నిర్లక్ష్యమే గ్యాస్‌ లీక్‌కు కారణమైతే ఎలాంటి చర్యలు తీసుకోవాలో కమిటీ సిఫార్సు చేయాలి. 
► నివారణ చర్యలు, భద్రతా తనిఖీలపై ప్రభుత్వానికి సిఫార్సులు చేయాలి.
► ఈ తరహా పరిశ్రమలకు సంబంధించి కమిటీ పరిశీలించిన ఇతర ముఖ్యమైన అంశాలను కూడా నివేదికలో పేర్కొనవచ్చు.  
► కమిటీ నెల రోజుల్లోగా ప్రభుత్వానికి తుది నివేదిక సమర్పించాలి. 
► నివారణ చర్యలపై సూచనల కోసం జాతీయ, అంతర్జాతీయ సంస్థలు/ నిపుణులను కమిటీ సహాయకులుగా హైపవర్‌ కమిటీ చైర్మన్‌ ఎంపిక చేసుకోవచ్చు. 
► కమిటీకి అవసరమైన సహాయ సహకారాలు అందించాలని ఆంధ్రప్రదేశ్‌ కాలుష్య నియంత్రణ మండలిని ప్రభుత్వం ఆదేశించింది. 

రూ.30 కోట్లు విడుదల
ఎల్జీ పాలిమర్స్‌ గ్యాస్‌ లీకేజీ దుర్ఘటనలో బాధితులకు నష్టపరిహారం చెల్లించే నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం రూ.30 కోట్లు విడుదల చేసింది. ఈ మేరకు రెవెన్యూ, విపత్తు నిర్వహణ శాఖ ముఖ్య కార్యదర్శి వి.ఉషారాణి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.  ప్రమాద సమాచారం తెలిసిన వెంటనే ఉన్నతాధికారులతో సమీక్షించిన సీఎం జగన్‌ మోహన్‌రెడ్డి విశాఖపట్నం వెళ్లి బాధితులను పరామర్శించి నష్టపరిహారం ప్రకటించారు. సీఎం ఆదేశం మేరకు ప్రమాదం జరిగిన మరుసటి రోజునే ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రూ.30 కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి.

తక్షణమే చెల్లించాలని ఆదేశం
► ఒక్కో మృతుని కుటుంబానికి రూ.కోటి చొప్పున తక్షణమే పరిహారం చెల్లించాలని ఉత్తర్వులు. 
► వెంటిలేటర్లపై చికిత్స పొందుతున్న వారికి రూ.10 లక్షల చొప్పున పరిహారం చెల్లింపు. 
► రెండు, మూడు రోజులు ఆస్పత్రిలో చికిత్స పొందిన వారికి రూ.లక్ష, ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స పొందిన వారికి రూ. 25 వేల చొప్పున చెల్లిస్తారు.
► గ్యాస్‌ లీకేజీ ప్రభావిత గ్రామాల్లో ప్రతి ఒక్కరికీ రూ.10 వేల చొప్పున ఆర్థిక సాయం చెల్లిస్తారు.
► ప్రమాదం జరిగిన మరుసటి రోజే బాధితులందరికీ నష్టపరిహారం విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడంపై అధికార వర్గాల హర్షం.
► ఆపన్నులకు, బాధితులకు సహాయం అందించడంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తనకు తానే సాటి అని ఈ చర్య ద్వారా నిరూపించుకున్నారన్న పలువురు ఐఏఎస్‌లు. ప్రతి అంశంలోనూ సీఎం జగన్‌ ఇదే రకమైన వేగాన్ని ప్రదర్శిస్తున్నారని, నిర్ణయాల్లోనూ, అమల్లోనూ అదే తీరు కనబరుస్తున్నారని ప్రశంస. 

మరిన్ని వార్తలు