అందరి అభిప్రాయాలు తీసుకుంటాం

8 Jan, 2020 04:14 IST|Sakshi
విజయవాడ ఏపీఎస్‌ఆర్టీసీ కాంప్లెక్స్‌లో సమావేశమైన హైపవర్‌ కమిటీ

జీఎన్‌ రావు, బీసీజీ నివేదికలను అధ్యయనం చేసి మా నివేదిక ఇస్తాం

ప్రాథమికంగా పరిపాలనా వికేంద్రీకరణ అవసరమని భావిస్తున్నాం 

స్టేక్‌ హోల్డర్స్‌ అందరి అభిప్రాయాలూ సేకరిస్తాం 

హైపవర్‌ కమిటీ సభ్యులు బుగ్గన, కన్నబాబు వెల్లడి 

సుదీర్ఘంగా సాగిన కమిటీ తొలి సమావేశం

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అభివృద్ధి వికేంద్రీకరణ జరగాల్సిందేనని.. అలాగే, అన్ని ప్రాంతాల ప్రజల మనోభావాలను గౌరవిస్తూ పరిపాలనా వికేంద్రీకరణ కూడా అవసరమని ప్రాథమికంగా ఒక అంచనాకు వచ్చినట్లు రాష్ట్ర ప్రభుత్వం నియమించిన హైపవర్‌ కమిటీ తెలిపింది. జీఎన్‌ రావు, బోస్టన్‌ కన్సల్టింగ్‌ గ్రూప్‌ (బీసీజీ) నివేదికలపై చర్చించామని.. ఇంకా దీనిపై అధ్యయనం చేస్తామని కమిటీకి నేతృత్వం వహిస్తున్న మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, మరో మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధి, పాలనా వికేంద్రీకరణపై మంత్రులు, ఉన్నతాధికారులతో ఏర్పాటైన హైపవర్‌ కమిటీ తొలి సమావేశం మంగళవారం విజయవాడలోని ఆర్టీసీ కాంప్లెక్స్‌లో జరిగింది. సమావేశం అనంతరం వారిద్దరూ మీడియాతో మాట్లాడారు. అభివృద్ధి, పరిపాలనా వికేంద్రీకరణ జరగాలనే అంశంపై రాష్ట్రంలో ప్రస్తుతం చర్చ జరుగుతోందని, దానిపై సమావేశంలో పూర్తిస్థాయిలో చర్చించామని తెలిపారు.

ఈ అంశంపై ఇప్పటివరకు రెండు కమిటీలిచ్చిన నివేదికలను విశ్లేషించుకుని ఎలా ముందుకెళ్లాలో నిర్ణయించుకునేందుకు సీఎం వైఎస్‌ జగన్‌ హైపవర్‌ కమిటీని నియమించారని చెప్పారు. తొలి సమావేశంలో జరిగిన చర్చలో వికేంద్రీకరణ జరగాల్సిందేనని కమిటీ భావించిందని.. జోన్లు, సెక్టార్ల వారీగా అభివృద్ధి ఎలా జరగాలో చర్చించామన్నారు. ప్రజల మనోభావాలను గౌరవించి పరిపాలనా వికేంద్రీకరణ జరగాల్సిన అవసరం ఉందని ప్రాథమికంగా ఒక అంచనాకు వచ్చామన్నారు. తదుపరి సమావేశంలో మరింత సుదీర్ఘంగా, వివరంగా జీఎన్‌ రావు, బీసీజీ నివేదికలపై చర్చిస్తామని, ఆ తర్వాత హైపవర్‌ కమిటీ తరఫున ఒక నివేదిక తయారుచేసి ప్రభుత్వానికి అందజేయాలని సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు తెలిపారు. ఈ సమావేశంలో ప్రాథమిక చర్చ మాత్రమే జరిగిందని బుగ్గన రాజేంద్రనాథ్‌ తెలిపారు. ప్రభుత్వానికి అందిన వివిధ నివేదికలు, నిజాలు, లెక్కలన్నీ చూసి చరిత్రలో జరిగిన అనేక పరిణామాలు, పరిస్థితుల్ని కూడా కమిటీ అధ్యయనం చేస్తుందని చెప్పారు. కమిటీ తరఫున రాష్ట్రంలోని స్టేక్‌ హోల్డర్స్‌ అందరి అభిప్రాయాలు కూడా తీసుకుంటామన్నారు. 

సమావేశంలో ఉపముఖ్యమంత్రి పిల్లి సుభాష్‌చంద్రబోస్, మంత్రులు బొత్స సత్యనారాయణ, మేకతోటి సుచరిత, పేర్ని వెంకట్రామయ్య (నాని), మేకపాటి గౌతంరెడ్డి, కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని), ఆదిమూలపు సురేష్, సీఎం ప్రత్యేక సలహాదారు అజేయ కల్లం, ఐఏఎస్‌ అధికారులు నీరబ్‌కుమార్‌ ప్రసాద్, శ్యామలరావు, విజయ్‌కుమార్, డీజీపీ గౌతమ్‌ సవాంగ్, రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి జీఎన్‌ రావు, బీసీజీ గ్రూపు ప్రతినిధులు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు