మీ అభిప్రాయాలు, సందేహాలు చెప్పండి 

14 Jan, 2020 04:55 IST|Sakshi
వివరాలు వెల్లడిస్తున్న పేర్ని నాని, కన్నబాబు, కొడాలి నాని

రాజధాని రైతులను కోరిన హైపవర్‌ కమిటీ

17వ తేదీ సాయంత్రం వరకు అవకాశం

రైతుల అభిప్రాయాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటామని మంత్రుల వెల్లడి

సాక్షి, అమరావతి: అమరావతి గ్రామాల రైతుల నుంచి ప్రభుత్వం నియమించిన హైపవర్‌ కమిటీ అభిప్రాయాలు, సలహాలను కోరింది. 17వ తేదీ సాయంత్రం ఐదు గంటల వరకూ సీఆర్‌డీఏ కమిషనర్‌కు వ్యక్తిగతంగా గానీ, పోస్టు, ఇ–మెయిల్‌ ద్వారా గానీ తాము చెప్పదలచుకున్న విషయాలను పంపాలని సూచించింది. హైపవర్‌ కమిటీ మూడో సమావేశం విజయవాడలో సోమవారం మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ అధ్యక్షతన జరిగింది. సమావేశం వివరాలను కమిటీ సభ్యులు, మంత్రులు పేర్ని నాని, కన్నబాబు, కొడాలి నాని మీడియాకు వివరించారు. రాజధాని గ్రామాల రైతులే కాకుండా ఎవరైనా తమ అభిప్రాయాలు పంపవచ్చని పేర్ని నాని తెలిపారు. ప్రతి సమావేశంలోనూ తాము రాజధాని రైతుల గురించి చర్చిస్తున్నామని చెప్పారు.

ఇప్పటికే చాలామంది రైతులు మంత్రి బొత్స సత్యనారాయణ, కొడాలి నానితోపాటు తన వద్దకు వచ్చి అభిప్రాయాలు వ్యక్తం చేసి తమ ప్రతిపాదనలు చెబుతున్నారని వివరించారు. ఈ అంశాలన్నింటినీ తాము ప్రభుత్వానికి సమర్పించే నివేదికలో పొందుపరుస్తామన్నారు. వికేంద్రీకరణ అంశాన్ని రాజకీయంగా వాడుకుని, ఇతర ప్రాంతాలకు చెందిన వారిని, మహిళల్ని తీసుకొచ్చి రెచ్చగొడుతున్నారని చంద్రబాబును విమర్శించారు. అన్ని అంశాలపైనా రాజధాని రైతులు తమతో మాట్లాడుతున్నారని, చంద్రబాబు ప్రేరేపిత శక్తులు దాడి చేస్తాయనే భయంతో ఆందోళన చెందుతున్నారని చెప్పారు. జిల్లాల వారీగా అభివృద్ధి ప్రణాళికలను తయారు చేస్తున్నామని, ఈ నెల 17న మరోసారి కమిటీ సమావేశం జరపాలని నిర్ణయించినట్లు వివరించారు. 

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతున్న చంద్రబాబు: కన్నబాబు  
సంక్రాంతి పండుగ సమయంలోనైనా చంద్రబాబు రైతుల్ని రెచ్చగొట్టి తప్పుదారి పట్టించకుండా ప్రశాంతంగా ఉండనివ్వాలని మంత్రి కన్నబాబు హితవు పలికారు. భూములిచ్చిన రైతులది ఒక ఆందోళనైతే చంద్రబాబుది మరో ఆందోళనని విమర్శించారు. ఆయన కుటుంబ సభ్యులు నారావారిపల్లి వెళ్లి పండుగ చేసుకుంటున్నారని, రైతుల్ని మాత్రం పండుగ చేసుకోవద్దంటున్నారని మండిపడ్డారు. డీజీపీ గౌతం సవాంగ్‌పై అవమానకరంగా విమర్శలు చేస్తున్నారని, ఇది పద్ధతి కాదన్నారు. 

ముడాలో కలపాలని కోరాం: కొడాలి నాని 
మచిలీపట్నం పార్లమెంటు పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలను సీఆర్‌డీఏ పరిధి నుంచి తొలగించి ముడా పరిధిలోకి తేవాలని కమిటీ దృష్టికి తీసుకువచ్చినట్లు మంత్రి కొడాలి నాని తెలిపారు. పోర్టును త్వరితగతిన చేపట్టాలని కూడా కోరామన్నారు. ఎయిర్‌పోర్టు, జాతీయ రహదారులు, రైల్వే స్టేషన్‌లు, ఎక్స్‌పోర్టు, ఇంపోర్టును దృష్టిలో పెట్టుకుని వ్యవసాయ, ఆక్వా పరిశ్రమల్ని మచిలీపట్నం ప్రాంతంలో ఏర్పాటు చేయాలని కోరినట్లు వివరించారు. సమావేశంలో ఉపముఖ్యమంత్రి పిల్లి సుభాష్‌చంద్రబోస్, మంత్రులు బొత్స సత్యనారాయణ, మేకతోటి సుచరిత, ఆదిమూలపు సురేష్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్‌ తదితరులు పాల్గొన్నారు.  

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా