బాబు ఇంటి వద్ద భారీగా బలగాలు

11 Jun, 2015 21:36 IST|Sakshi
బాబు ఇంటి వద్ద భారీగా బలగాలు

హైదరాబాద్ సిటీ: ఓటుకు నోటు కేసు అనంతరం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇంటి వద్ద పోలీసు బందోబస్తు భారీగా ఏర్పాటు చేశారు. మొన్నటి వరకు తెలంగాణ పోలీసులు ఆయన ఇంటి వద్ద గస్తీ నిర్వహించగా తాజాగా ఆంధ్రప్రదేశ్ పోలీసులు పెద్ద సంఖ్యలో ఆయన ఇంటి వద్ద బందోబస్తు నిర్వహిస్తున్నారు. చంద్రబాబు ఫోన్‌ట్యాపింగ్ వ్యవహారం, స్టీఫెన్‌సన్‌తో ఫోన్‌లో భేరసారాలు జరుపుతున్న వ్యవహారంపై ఇక్కడి పోలీసులు సరిగ్గా స్పందించలేదంటూ చంద్రబాబు రెండు రోజులక్రితమే అక్కడి పోలీసులపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన నేపథ్యంలో రెండు రోజుల నుంచి ఆయన ఇంటి వద్ద బందో బస్తును భారీగా ఏర్పాటు చేశారు. కర్నూలు నుంచి అదనంగా ఓ ప్లటూన్ బలగాలను ఇక్కడ మోహరించారు.

ఇప్పటికే తెలంగాణ స్పెషల్ పోలీస్ ప్లటూన్ ఇక్కడ విధి నిర్వహణలో ఉండగా, వీరిని రోడ్డుపైన విధుల్లో వేసి కర్నూలు నుంచి వచ్చిన స్పెషల్ పోలీసులను ఇంటి వద్ద మోహరించారు. అలాగే 30 మంది గ్రేహౌండ్స్ పోలీసులను, 30 మంది ఆక్టోపస్ పోలీసులను రప్పించారు. వీరూ రెండు రోజుల నుంచి చంద్రబాబు ఇంటి వద్ద మోహరించారు. అలాగే ఇంటలిజెన్స్ సెక్యూరిటీ వింగ్‌ పోలీసులు కొత్తగా ఎనిమిది మంది చేరారు. చంద్రబాబు నివాసిత ప్రాంతమే కాకుండా చుట్టుపక్కల రోడ్లన్నీ పోలీసు నిఘాలో ఉండిపోయాయి. చీమ చిటుక్కుమన్నా మేల్కొనే విధంగా బలగాలను మోహరించారు. ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఆ రోడ్డుపైన ఎవరి వెళ్లినా వారి వివరాలు సేకరిస్తున్నారు. అవసరమైన వారి పత్రాలను కూడా తనిఖీ చేస్తున్నారు.

మరిన్ని వార్తలు