రిసార్టుల మాటున... హైటెక్ వ్యభిచారం..

29 Sep, 2013 03:59 IST|Sakshi

చీరాల, న్యూస్‌లైన్ : తీర ప్రాంతంలో రిసార్టుల పేరుతో జరుగుతున్న అసాంఘిక కార్యక్రమాలకు అడ్డూఅదుపు లేకుండాపోతోంది. సెలవు దినాల్లో సేదతీరేందుకు ఏర్పాటు చేసిన రిసార్టులు ఇప్పుడు పేకాట క్లబ్‌లు, క్రికెట్ బుకీలు, హైటెక్ వ్యభిచారానికి అడ్డాగా మారింది. ఇదేదో చీరాల ప్రాంతానికే పరిమితం కాలేదు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నుంచి వచ్చే వారితో రిసార్టులు కిక్కిరిసిపోతున్నాయి. మిగతా చోట్ల పోలీసుల దాడులు, ఇతర సమస్యలు ఉత్పన్నమవుతున్నాయన్న భయంతో కొందరు చీరాల తీర ప్రాంతంలో యథేచ్ఛగా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు.
 
 రామాపురంలోని రిసార్టుల్లో రూ. లక్షల్లో పేకాట, క్రికెట్ బెట్టింగ్‌లు, హైటెక్ వ్యభిచారం జరుగుతున్నాయి. కొంతకాలంగా బుకీలు రామాపురంలోని ఓ పేరు మోసిన రిసార్టులో తిష్ట వేసి క్రికెట్ బెట్టింగులకు పాల్పడుతున్నారు. పది నుంచి ఇరవై మంది బుకీలు రాష్ట్రంలో ఉన్న బెట్టింగ్ బంగార్రాజులతో ఇక్కడి నుంచే క్రికెట్ బెట్టింగ్‌లు నిర్వహిస్తున్నారు. రిసార్టులకు ఆన్‌లైన్ బుకింగ్ సౌకర్యం కూడా ఉండటంతో క్రికెట్ మ్యాచ్‌లు జరిగే అన్ని రోజులూ బుకీల బినామీల పేరుతో అవి బుకవుతున్నాయి. ఇంత పెద్ద ఎత్తున క్రికెట్ బిట్టింగ్‌లు జరుగుతున్న విషయం చీరాల పోలీసు అధికారులకు పక్కాగా తెలుసు. అయినా రిసార్టులు ఇచ్చే నెలవారీ మామూళ్లతో వాటి జోలికే వెళ్లడం మానేశారు. బెట్టింగ్‌లతో ఎందరో జీవితాలు వీధిన పడుతున్నా ఖాకీలు మాత్రం కాలు కదపరు.. కన్నెత్తి చూడరు! మామూలు లాడ్జీల్లో పేకాట ఆడితే మాత్రం ఊరుకోరు. వెంటనే నిందితులను అరెస్టు చేసి కోర్టుకు హాజరు పరుస్తారు. రిసార్టుల జోలికి పోలీసులెవరూ రారు.
 
 అందుకే బుకీలు రిసార్టుల్లో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. గదుల అద్దె భారీగా ఉన్నప్పటికీ ఆ మొత్తం చెల్లించి రూ. లక్షల్లో పేకాడుతున్నారు. ఇది ప్రతిరోజూ జరుగుతున్న వ్యవహారం. గతంలో చిలకలూరిపేట, గుంటూరు ప్రాంతాల్లో మాత్రమే బుకీలు బెట్టింగ్‌లు నిర్వహించే వారు. బెట్టింగులకు ఇప్పుడు రిసార్టులు కేంద్రంగా మారాయి. చీరాల, గుంటూరు, హైదరాబాద్ వంటి ప్రాంతాలకు చెందిన బడాబాబులు రిసార్టుల వద్దే ఉంటూ రూ. లక్షల్లో జూదం నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా శని, ఆదివారాల్లో గది దొరకాలంటే కనీసం మూడు నెలల క్రిత మే అప్రమత్తం కావాలంటే ఆశ్చర్యం వేయక మానదు. పోలీసుల దాడులు జరగవని తెలియడంతో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి జూదం ఆడేందుకు వస్తున్నారు. ఇదిలా ఉండగా రిసార్టుల ముసుగులో జరుగుతున్న వ్యభిచారానికి అంతే లేదు. ఇతర ప్రాంతాల నుంచి కాల్‌గాల్స్ రిసార్టులకు పెద్ద ఎత్తున వస్తున్నారు. ఈ ముసుగులో పలు ఘర్షణలు కూడా జరుగుతున్నాయి. అసాంఘిక కార్యక్రమాలను అరికట్టాల్సిన పోలీసులు నెలవారీ మామూళ్లతో పాటు రిసార్టుల్లో అప్పుడప్పుడూ గదులు తీసుకుంటుండటంతో దాడులకు ఉపక్రమించడం లేదు. గతంలో తీరం ఒడ్డున సేదతీరేందుకు జనం అధిక సంఖ్యలో వచ్చేవారు. ఇప్పుడు అసాంఘిక కార్యక్రమాలకే రిసార్టులకు వస్తున్నారు. పోలీసులు దృష్టి పెట్టి తీరంలో అసాంఘిక కార్యక్రమాలను అరికట్టాలని చీరాల ప్రాంత ప్రజలు కోరుతున్నారు.
 
 

మరిన్ని వార్తలు